Grandhi Srinivas: గ్రంధి శ్రీనివాస్ రాజకీయ భవిష్యత్ ఏంటి?
ఇంత కన్ఫ్యూజన్‌లో ఉన్న గ్రంధి శ్రీనివాస్.. త్వరలో కేంద్ర సహాయమంత్రి శ్రీనివాస్ వర్మతో భేటీ కానున్నారు.

Grandhi Srinivas
పొలిటికల్ చౌరస్తాలో నిలబడిన గ్రంధి శ్రీనివాస్ దారెటు..? వైసీపీకి రాంరాం చెప్పాక ఆయన ముందు కూటమిలో చేరేలా మూడు దారులున్నాయి..? మరి ఆయన ఏ దారిలో వెళ్తారు..? జనసేనకు జై కొడితే లాభమా? సైకిల్ సవారీ మేలు చేస్తుందా? కాషాయంతో దోస్తీ కలిసొస్తుందా? పొలిటికల్ ఫ్యూచర్ కోసం గ్రంధి కన్‌ఫ్యూజన్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
వైసీపీకి రాజీనామా చేసిన భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ రాజకీయ పయనంపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఆయన ఇప్పుడు ఏ పార్టీ కండువా కప్పుకుంటారా అన్నది భీమవరంలో ఆసక్తికరంగా మారింది. గతంలో ప్రజారాజ్యం పార్టీలో పనిచేసిన గ్రంధికి జనసేన ముఖ్యనేతలతో మంచి పరిచయాలు ఉన్నాయి.
దీంతో ఆయన జనసేనలో చేరే అవకాశం ఉందంటూ ఆయన అనుచరులు చెబుతున్నారు. జనసేనలో చూస్తే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే జనసేన నుంచే పులపర్తి రామాంజనేయులు బలంగా ఉన్నారు. ఆయన ఉండగా గ్రంధిని చేర్చుకోనే అవకాశాలు తక్కువగా ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది.
మరోవైపు టీడీపీకి నేతల కొరతే లేదు. బలమైన నాయకులు ఎంతో మంది ఆ పార్టీలో ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీలోకి వెళ్తే గ్రంధికి అంత ప్రాధాన్యత ఉండదనే చర్చ జరుగుతోంది. దీంతో టీడీపీలోకి వద్దే వద్దని తన అనుచరులు చెబుతున్నారట.
శ్రీనివాస వర్మతో గ్రంధికి మంచి రిలేషన్స్
జనసేన, టీడీపీ కాకుంటే ఇక గ్రంధి శ్రీనివాస్‌కి బీజేపీ తప్ప.. వేరే దారి ఏదీ కనిపించడం లేదు. బీజేపీలో కనుక గ్రంధి శ్రీనివాస్ చేరితే కూటమిలో పొత్తుల్లో భాగంగా టికెట్‌ని భీమవరం నుంచి సాధించుకునే చాన్స్ ఉంటుందనేది ఆయన ఆలోచనగా తెలుస్తోంది.. మరోవైపు కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మతో గ్రంధికి మంచి రిలేషన్స్ ఉన్నాయి.. దీంతో ఆ రూట్‌లో బీజేపీలోకే వెళ్తారనే టాక్ చక్కర్లు కొడుతోంది. బీజేపీకి గోదావరి జిల్లాల్లో నాయకత్వ కొరత కూడా ఉంది.
పార్టీలో ఎవరు చేరినా రెడ్ కార్పెట్ పరిచే అవకాశాలున్నాయి. అటు వెళ్తే ఇటీవల తన వ్యాపారాల మీద జరిగిన ఐటీ దాడులు, ఆ కేసుల నుంచి కూడా రిలీఫ్ దొరికే ఛాన్స్ ఉంది.. ఆ ఈక్వేషన్స్‌తో గ్రంధి శ్రీనివాస్ చూపు బీజేపీ వైపు పడిందని సమాచారం.. ఒకవేళ బీజేపీలో కూడా చేరకపోతే.. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉండటమే బెటర్ ఆప్షన్ అనే ఆలోచన కూడా చేస్తున్నారంట గ్రంధి.. అంతేకాదు భీమవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు, అవసరమైన సూచనలు సలహాలు ఇచ్చేలా కార్యచరణ రూపొందించుకొనే ఆలోచన చేస్తున్నారట.
ఇంత కన్ఫ్యూజన్‌లో ఉన్న గ్రంధి శ్రీనివాస్.. త్వరలో కేంద్ర సహాయమంత్రి శ్రీనివాస్ వర్మతో భేటీ కానున్నారు. ఈ భేటీ తర్వాత కూటమి మూడు దారుల జంక్షన్‌లో నిలబడిన గ్రంధి శ్రీనివాస్ పయనం ఎటువైపో తేలిపోనుంది. అప్పటి వరకు ఆయన అడుగులు ఎటు వైపు పడతాయో ఇప్పుడే చెప్పలేమని ఆయన స్నహితులు చెబుతున్న మాట.
అల్లు అర్జున్ అరెస్ట్‌పై రాజకీయ దుమారం.. సీఎం కామెంట్స్ వెనుక ఆంతర్యమేంటి?