Gudivada Amarnath: అనకాపల్లినే అమర్‌నాథ్ మళ్లీ ఎంచుకోడానికి కారణమేంటి?

ఇన్ని రోజులు ఒక ఎత్తు, ఇక నుంచి మరో ఎత్తు అంటూ సన్నిహితులకు చెబుతున్న మంత్రి అమర్‌నాథ్.. వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి సీటు నాదే.. అక్కడ పోటీ చేసేదీ నేనేనని సినిమా స్టైల్‌లో డైలాగ్‌లు చెబుతున్నారట.

Gudivada Amarnath: అనకాపల్లినే అమర్‌నాథ్ మళ్లీ ఎంచుకోడానికి కారణమేంటి?

why gudivada amarnath again contest in anakapalli explained in telugu

Gudivada Amarnath- Anakapalli: ఉత్తరాంధ్రలో అత్యంత కీలక నియోజకవర్గం అనకాపల్లి.. ప్రస్తుత మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి వీఐపీ నియోజకవర్గంగా గుర్తింపు పొందింది. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఎవరు గెలిచినా కచ్చితంగా రాష్ట్రమంత్రివర్గంలో చోటు దక్కించుకోవడమే అనకాపల్లి ప్రత్యేకత.. ఇటువంటి నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో మళ్లీ అమర్‌నాథ్ పోటీచేస్తారా, లేదా? అన్న సస్పెన్స్ ఏర్పడింది. అధికార పార్టీకి ఈ నియోజకవర్గంలో బలమైన నేతలు ఉండటం.. విశాఖ నగరానికి చెందిన మంత్రి అమర్‌నాథ్ జిల్లాలో మరో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ప్రచారానికి తాజాగా ఫుల్‌స్టాప్ పెట్టారు. మళ్లీ అనకాపల్లి నుంచే వన్స్‌మోర్ అంటున్నారు.. మంత్రి అమర్‌నాథ్ తగ్గేదేలే అంటూ అనకాపల్లినే ఎంచుకోడానికి కారణమేంటి? తెరవెనుక రాజకీయం ఏముందో చూద్దాం.

మంత్రి అమర్నాథ్ వచ్చే ఎన్నికలలో ఎక్కడినుంచి పోటీ చేస్తారన్నదానిపై ఉత్తరాంధ్రలో పెద్ద చర్చే నడిచింది. మాజీ మంత్రులు కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావు, గంటా శ్రీనివాస్‌ వంటి సీనియర్లు గతంలో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. కాపు, గవర సామాజిక వర్గాలు ఇక్కడ ప్రధానమైనవి. అనకాపల్లిలో తొలి నుంచీ గవర నేతల ఆధిపత్యం కొనసాగగా.. 2009లో ఈ లెక్కలను మార్చేశారు మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు. 2019లో ఈ విధానాన్నే పాటించి సక్సెస్ అయ్యింది వైసీపీ. గత ఎన్నికల్లో అనకాపల్లిలో గెలిచిన గుడివాడ అమర్నాథ్.. సీఎం జగన్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినా.. మంత్రి పీఠం దక్కిన వాళ్ళలో అమర్నాథ్ ఒకరు. ఎమ్మెల్యే అయిన తొలిరోజు నుంచీ నియోజకవర్గంపై ప్రత్యేక ముద్ర వేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు మంత్రి అమర్‌నాథ్. మొదట్లో అంతా సానుకూలంగానే కనిపించినా తరవాత.. తర్వాత గ్రూపుల గోల ఎక్కువైంది. వీలు చిక్కిన ప్రతిసారీ మంత్రి, ఎంపీ సత్యవతి, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు వర్గీయులు రాజకీయ వేడిని రాజేస్తూనే ఉన్నారు.

ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో మంత్రి అమర్నాథ్ అనకాపల్లి నుంచి మరోసారి పోటీ చేయరనే ప్రచారం విస్తృతంగా జరిగింది. యలమంచిలి లేకపోతే పెందుర్తి సీటును సేఫ్ జోన్ గా భావిస్తున్నారనే ఊహాగానాలు ఎక్కువయ్యాయి. అదే సమయంలో కాపు సామాజిక వర్గానికి అనకాపల్లి ఎంపీ టిక్కెట్ కేటాయించాలనే ఆలోచనలో వైసీపీ హైకమాండ్ ఉందనే సమాచారం ఊపు తెచ్చింది. 2014లో మంత్రి అమర్‌నాథ్ అనకపల్లి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.. మళ్లీ ఎంపీగా అమర్నాథ్ పేరును పరిశీలిస్తారనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. దీంతో ఎమ్మెల్యే టికెట్‌పై కన్నేసిన సీనియర్ నేత దాడి వీరభద్రరావు, ఎంపీ సత్యవతి వర్గాలకు కలిసి వచ్చాయి. ఇక్కడ నుంచే ఎత్తులు, పై ఎత్తులు మరింత విస్తృతం కాగా మంత్రి వెర్సస్ దాడి వర్గంగా వ్యవహారం ముదిరి పాకానపడింది. అమర్‌నాథ్‌ సీట్ ఖాళీ చేస్తే తన కుమారుడు రత్నాకర్ కు పోటీచేసే అవకాశం వస్తుందని చాలా కాలంగా దాడి వీరభద్రరావు ఎదురుచూస్తున్నారు. ఈసారి ఛాన్స్ రాకపోతే ఇక ప్రత్యక్ష రాజకీయాలు నడపడంలో అర్థం లేదనేది ఆయన అభిప్రాయం. ఈ కారణంగానే ప్రతి అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు దాడి.

Also Read: అచ్చెన్నాయుడి ప్రకటన.. చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేశారా.. బాబు స్కెచ్ ఏంటో?

అనకాపల్లిలో పేరుకి టీడీపీ ప్రతిపక్షం అయినప్పటికీ స్వపక్షంలో రాజుకున్న కుంపటి మంత్రి అమర్నాథ్ కు ఇబ్బందికరంగా మారింది. పోస్టర్ వివాదం మూలంగా ఎంపీతో మెుదలైన వర్గపోరు.. ఆలయ కమిటీల్లో దాడి వర్గీయులకు చోటు కల్పించకపోవడంతో మరింత ఎక్కువైంది. కీలకమైన గవర సామాజికవర్గానికి మంత్రి కావాలనే ప్రాధాన్యం తగ్గించారనే అభిప్రాయం పెరగడంతో.. వచ్చేఎన్నికల్లో మంత్రి అమర్‌నాథ్ అనకాపల్లిని వదిలేస్తారని అంతా అనుకున్నారు. అయితే అనూహ్యంగా అనకపల్లిలో తన మార్కు చూపెడుతున్నారు అమర్నాథ్.. కీలకమైన అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్ష పదవిని తనకు అత్యంత సన్నిహతుడైన గవర కార్పొరేషన్ చైర్మన్ బొడ్డేట ప్రసాద్‌కు ఇప్పించుకున్నారు. నామినేటెడ్ పదవులు, పార్టీ విభాగాల్లో నియమకాల్లో కూడా గవర సామాజిక వర్గానికి ప్రాధాన్యం పెంచడం ద్వారా తనకు వ్యతిరేకంగా జరిగిన ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు మంత్రి అమర్‌నాథ్.

Also Read: చంద్రబాబు అనకొండ కోరల్లో ఇరుక్కున్నారు.. జగన్‌కూ ఇదే పరిస్థితి వస్తుంది.. ఎందుకంటే?: రఘువీరారెడ్డి

ఇన్ని రోజులు ఒక ఎత్తు, ఇక నుంచి మరో ఎత్తు అంటూ సన్నిహితులకు చెబుతున్న మంత్రి.. వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి సీటు నాదే.. అక్కడ పోటీ చేసేదీ నేనేనని సినిమా స్టైల్‌లో డైలాగ్‌లు చెబుతున్నారట. అమర్నాథ్‌ స్టేట్‌మెంట్స్‌తో ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న కేడర్‌లో దూకుడు పెరిగిందని అంటున్నారు. గృహ సారథుల సమావేశంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు అందరికంటే ఎక్కువగా దాడి వర్గాన్ని కలవరపెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సారి సీటు మారతానని టీడీపీ, జనసేన కావాలనే ప్రచారం చేస్తున్నాయని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అమర్నాథ్‌ చెప్పడంతో.. అనకాపల్లిపై ఆశలు పెట్టుకున్న దాడి వర్గం నిరాశ పడ్డట్టు చెప్పుకుంటున్నారు. ఇదే దూకుడుతో రాజకీయంగా అనకాపల్లి వైసీపీలో దాడి కుటుంబానికి దారులు మూసేయాలన్న వ్యూహం కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు.