జనసేనాని బలమేంటి? : పవర్‌స్టార్ వెపన్ బీజేపీయేనా?

జనసేనాని పవన్ కల్యాణ్ ఈ మధ్య చీటికిమాటికీ ఢిల్లీకి వెళ్తున్నారు. ఏపీ రాష్ట్ర బీజేపీ నేతల కంటే ఎక్కువ సార్లు ఆయనే వెళ్లి రావడం చూస్తున్నాం. అయితే.. ఈమధ్య రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామంటూ కొత్త పల్లవి మొదలుపెట్టారు పవన్.
అసలు పవన్ ఏంటి జగన్ ప్రభుత్వాన్ని కూల్చేయడం ఏంటనే చర్చ మొదలైంది. రాజధాని అమరావతిలోనే ఉంటుందని అంటారు. ప్రభుత్వం 30 రాజధానులు ఏర్పాటు చేసినా అన్నింటినీ కలిపి ఒక్కటే రాజధాని చేస్తామంటారు. అసలు పవన్ కల్యాణ్ ఏం చూసుకొని ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారనేది ఇప్పుడు జనాల్లో డిస్కషన్.
బీజేపీ బలమేనా? :
ప్రభుత్వాన్ని కూలగొట్టాలంటే అసెంబ్లీలో తన పార్టీకి బలం ఉండాలి. కానీ, ఉన్న ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌రావు వైసీపీకి అనుకూలంగా ఉంటున్నారు. మరి ప్రభుత్వాన్ని కూలగొట్టాలంటే పవన్‌కు అసలు బలముందా? ఏ ఉద్దేశంతో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు పబ్లిక్‌గా చేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బలమే తన బలం అనుకుంటున్నారేమో అని జనాలు అంటున్నారు. రాష్ట్రంలో బీజేపీకి కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. బలం లేకపోయినా ఏ ధైర్యంతో పవన్ అలా మాట్లాడుతున్నారనేదే ఎవరికీ అర్థం కావడం లేదు.
జగన్ సర్కారు కూలదోస్తాం :
అమరావతి రైతులతో మంగళవారం మాట్లాడిన సందర్భంలో పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ సర్కారును కూలదోసేస్తామని అన్నారు. ఢిల్లీకి వెళ్తున్నానని చెప్పుకొచ్చారు. బుధవారం ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడ బీజేపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. భవిష్యత్ కార్యాచరణతోపాటూ పొత్తుకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు.
మిత్రపక్షాలుగా రాష్ట్రంలో ఎలా ముందుకు సాగాలనే అంశంపైనే ఫోకస్ పెట్టారు. అంతకు మించి ఇంకేం జరగలేదని అంటున్నారు. ఈ సమయంలో కేంద్రంలోని బీజేపీ కూడా రాష్ట్ర వ్యవహారాలపై స్పందించేందుకు ప్రయత్నించదని చెబుతున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు కొంత సద్దుమణిగిన తర్వాత కేంద్రం ఈ విషయంలో స్పందించే వీలుందని అభిప్రాయపడుతున్నారు.
పవన్ ఉద్దేశమిదేనా?
మరోపక్క రాజధాని రైతుల ఆవేదనను విన్న పవన్ కల్యాణ్…తాను అండగా నిలబడతానని, కేంద్రంతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని గట్టిగా చెప్పారు. ప్రభుత్వాన్ని కూలగొడతానని పదే పదే పవన్ కల్యాణ్ చెప్పడం.. ఢిల్లీకి వెళ్తుండడం చూస్తుంటే ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొన్నా.. అంత సీనేం ఉండదని జనాలు అనుకుంటున్నారు. ప్రభుత్వాన్ని కూలదోయడం అంత ఈజీ కాదని పవన్‌తో పాటు అందరికీ తెలిసిందే. కాకపోతే జనాల్లో కాస్త ఆవేశం పుట్టించి అలా కొన్నాళ్లు నడిపించేద్దామని అనుకుంటున్నారేమో?