వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తనే చంపేసింది, ఆ తర్వాత ఖతర్నాక్ కథ అల్లింది.. గుంటూరులో ఘోరం

wife murder husband: ఓ వ్యక్తి దారుణంగా హత్య చేయబడ్డాడు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. అయితే భర్త వేధింపులు తట్టుకోలేకే తమ బంధువుతో కలిసి చంపామని భార్య చెప్పింది. కానీ పోలీసులకు ఎక్కడో లాజిక్ మిస్సైంది. తమదైన శైలిలో అడగడంతో అసలు విషయం బయటపడింది. ఆమె అల్లిన కథను చూసి షాకయ్యారు.
రక్తపు మడుగులో భర్త.. తమ బంధువే చంపాడన్న భార్య.. హత్యకు వేధింపులే కారణమంటున్న భార్య.. అసలు నిజం బయటపెట్టిన పోలీసులు. గుంటూరు తెనాలిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అర్థరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. మృతుడి భార్య తెలిపిన వివరాలతో దర్యాప్తు ప్రారంభించారు.
చంద్రా నాయక్ దారుణ హత్య:
తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా మిర్యాలగూడెం ప్రాంతానికి చెందిన భార్యాభర్తలు చంద్రానాయక్, జ్యోతి కొన్నేళ్ల క్రితం తెనాలి వచ్చారు. సుల్తానాబాద్‌లో స్థిరపడ్డారు. వీరికి ముగ్గురు పిల్లలు. భర్త రాడ్ బెండింగ్ పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే వాడు. కుటుంబం అన్నాక ఏవో కొన్ని గొడవలు వస్తుంటాయి. అలానే వీరి మధ్య కూడా అప్పుడప్పుడు గొడవలు జరుగుతుండేవి. అయితే అక్టోబర్ 21న అర్థరాత్రి సమయంలో చంద్రా రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఓ వ్యక్తి అతి దారుణంగా కత్తితో పొడిచి పరారయ్యాడు.
https://10tv.in/husband-harassment-on-wife-for-extra-dowry-wife-protest-in-front-of-house-anantapur-district/
పోలీసుల అనుమానంతో వెలుగులోకి నిజం:
హత్యకు సంబంధించి మృతుడి భార్యను విచారించారు పోలీసులు. తనను భర్త రోజూ కొడుతూ చంపుతానని బెదిరిస్తుండడంతో తన అక్క కొడుకు సాయికుమార్ చంపాడని పోలీసులకు చెప్పింది. హత్య సమయంలో అరుపులు బయటకు వినబడకపోవడంతో పోలీసులు అనుమానించారు. అనుమానితుల కాల్ డేటాను విశ్లేషించి నిజాన్ని వెలికి తీశారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తేల్చారు.
భర్త వేధిస్తున్నాడని పోలీసులకు కట్టుకథ:
మృతుడి భార్యకు శివనాగార్జున అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం వివాహేతర బంధానికి దారి తీసింది. అక్క కొడుకు సాయికుమార్ వారికి సహకరిస్తూ ఉండేవాడు. కొద్ది నెలల క్రితం తన భార్యపై అనుమానం కలిగిన భర్త అమెను ప్రశ్నిస్తూ, కొడుతుండేవాడు. భర్త నుంచి ఎప్పటికైనా తనకు, తన అక్క కుమారుడికి ప్రాణ హాని ఉందని, అతడిని ఎలాగైనా చంపాలని ముగ్గురూ నిర్ణయించుకున్నారు. అక్టోబర్ 21న తెల్లవారుజామున ప్లాన్ ప్రకారం చంద్రాని హత్య చేశారు. ఆ తరువాత వేధింపులే కారణమంటూ పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశారు. హత్య కేసులో ప్రధాన నిందితుడు సాయికుమార్, మృతుడి భార్య, ఆమె ప్రియుడు శివనాగార్జునను పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని ఎస్‌డీపీవో తెలిపారు.
తండ్రి హత్యకు గురవడం, తల్లి జైలు పాలవడంతో వాళ్ల పిల్లలు దిక్కులేని వారయ్యారు. ఈ కేసు విషయంలో న్యాయస్థానం ఇచ్చే తీర్పు ఇటువంటి ఘటనలకు పాల్పడే వారికి గుణపాఠం కావాలని పలువురు కోరుతున్నారు.