Lagadapati Rajagopal : మళ్లీ రాజకీయాల్లోకి లగడపాటి రాజగోపాల్‌? ఏ పార్టీలో చేరతారు? ఎక్కడి నుంచి పోటీ చేస్తారు?

విభజన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నారు. వైసీపీలో చేరితే విజయవాడ ఎంపీగా.. Lagadapati Rajagopal Reentry

Lagadapati Rajagopal : మళ్లీ రాజకీయాల్లోకి లగడపాటి రాజగోపాల్‌? ఏ పార్టీలో చేరతారు? ఎక్కడి నుంచి పోటీ చేస్తారు?

Lagadapati Rajagopal

Updated On : September 8, 2023 / 8:40 PM IST

Lagadapati Rajagopal Reentry : రాజకీయాల సంచలనాల లగడపాటి రాజగోపాల్ రీఎంట్రీ ఇస్తున్నారా? రాష్ట్ర విభజనతో పాలిటిక్స్ కి బై బై చెప్పిన విజయవాడ మాజీ ఎంపీ.. మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి రావాలని ఇంట్రస్ట్ చూపడానికి కారణం ఏంటి? సర్వేలతో హల్ చల్ చేసే రాజగోపాల్ కొన్నేళ్లుగా చడీచప్పుడు చేయడం లేదు. పదేళ్లుగా ఎటువంటి రాజకీయ కార్యక్రమాల్లోనూ కనిపించలేదు. తాను అన్న మాట ప్రకారం రాజకీయాలకు దూరమైపోయారు.

కానీ, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న ఈ సమయంలో లగడపాటి మళ్లీ రావాలంటూ ఆయన అనుచరులు హల్ చల్ చేస్తున్నారు. నిజంగా లగడపాటిపై అభిమానంతో ఈ డిమాండ్ చేస్తున్నారా? లేదా రాజకీయాలపై మమకారం తగ్గించుకోలేకే రాజగోపాలే అనుచరుల ద్వారా తన ఎంట్రీకి సంకేతాలు ఇస్తున్నారా?(Lagadapati Rajagopal)

Also Read..Chandrababu: నన్ను అరెస్టు చేస్తారేమో..! టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..

లగడపాటి రాజగోపాల్.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని నేత. రాష్ట్ర విభజనతో రాజకీయాలకు రాం రాం చెప్పేసిన రాజగోపాల్ ఎన్నికల సమయంలో తన సంస్థ ద్వారా ఎగ్జిట్ పోల్ సర్వేలు విడుదల చేస్తూ అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తున్నారు. విభజనకు ముందు ఆయన చేసిన సర్వేలు వంద శాతం నమ్మదగ్గ ఫలితాలు ఇచ్చేవి.

ఆ విధంగా ఫేమస్ అయిన విజయవాడ మాజీ ఎంపీ.. విభజన సమయంలో పార్లమెంటులో హంగామా చేసి ఏపీ ప్రజల్లో హీరోగా నిలవాలని కోరుకున్నారు. కానీ, తాను ఆశించినది ఒకటైతే జరిగింది మరొకటి. విభజన అడ్డుకోలేని రాజగోపాల్ రాజకీయ సన్యాసం తీసుకున్నారు. అయితే, రాజగోపాల్ రాజకీయ సన్యాసం చేయలేదని, తాత్కాలిక వనవాసం మాత్రమే చేస్తున్నారని ఆయన అనుచరులు ప్రచారం చేస్తున్నారు.(Lagadapati Rajagopal)

రాజగోపాల్ మళ్లీ రాజకీయాల్లోకి రావాలంటూ విజయవాడలో ఆయన అనుచరులు కొంతకాలంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ తరపున రెండుసార్లు గెలిచిన రాజగోపాల్.. విభజన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నారు. పూర్తిగా వ్యాపారానికే పరిమితమైన రాజగోపాల్.. మళ్లీ రాజకీయాల్లోకి రావాలంటూ డిమాండ్లు వినిపించడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. రాజగోపాల్ మళ్లీ రాజకీయాల్లోకి వస్తారా? వస్తే ఏ పార్టీలో చేరతారు? అనే చర్చ నడుస్తోంది.

Also Read..Gudivada: కొడాలి నానిని ఓడించాలంటే సరైనోడు ఉండాల్సిందే.. టీడీపీ టిక్కెట్ ఎవరికి!

టీడీపీ అధినేత చంద్రబాబుతో టచ్ లో ఉన్న లగడపాటికి బెజవాడలో అవకాశం దక్కే పరిస్థితి లేదు. ప్రస్తుతం విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆయన సోదరుడు చిన్ని మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ మధ్యలో ఎంట్రీ ఇవ్వడం కన్నా ప్రత్యామ్నాయం చూసుకోవడమే బెటర్ అనుకుంటున్నారట లగడపాటి. ఏలూరు పార్లమెంటు స్థానం నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉందని టాక్ ఉంది. మరోవైపు ఆయన వైసీపీలో చేరితే విజయవాడ ఎంపీగా పోటీ చేసే ఛాన్స్ ఉంది అంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితుడు అయిన రాజగోపాల్.. వైసీపీలో చేరే ఛాన్స్ కొట్టిపారేయలేము అంటున్నారు.

ఇంకోవైపు రాజగోపాల్ కుమారుడు గన్నవరం నుంచి పోటీ చేసే అవకాశాలపైనా ప్రచారం జరుగుతోంది. అయితే, గన్నవరంలో రెండు పార్టీల తరపున ఎమ్మెల్యే అభ్యర్థులు ఖరారు కావడంతో రాజగోపాల్ తీసుకోబోయే స్టెప్ పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఇంతకీ రాజగోపాల్ వస్తారా? రారా? అన్నది ముందుగా తేలాల్సి ఉంది.