Varma: బాబు, పవన్ మెచ్చిన నేతకు పెద్దపీట వేస్తారా? పిఠాపురం వర్మను వరించబోయే పదవి ఏంటి?
పిఠాపురంలో వర్మే కాదు.. మాజీమంత్రి దేవినేని ఉమా, బుద్దా వెంకన్న, బీటెక్ రవి, జవహార్.. ఇలా చాలామంది నేతలు పదవుల రేసులో ఉన్నారు.

అపోజిషన్‌లో ఉన్నప్పుడు బాధింపబడ్డోళ్లను.. అధికారంలోకి వచ్చేందుకు త్యాగం చేసినోళ్లను.. అందలం ఎక్కిస్తున్నారు సీఎం చంద్రబాబు. తన మాట విని పార్టీ గెలుపు కోసం సీటు వదులుకున్న నేతలకు..అప్పటి అధికార పార్టీని గట్టిగా ఎదుర్కొన్న నేతలకు పెద్దపీట వేస్తూ వస్తున్నారు. లేటెస్ట్‌గా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా నియమించారు సీఎం చంద్రబాబు.
అసలు ఆయనకే ఎమ్మెల్యే టికెటే దక్కదనుకున్న సమయంలో..అందరినీ ఒప్పించి టికెట్ ఇచ్చి గెలిపించడంతో పాటు.. ఇప్పుడు శాసనసభ ఉపసభాపతి హోదాలో కూర్చోబెట్టారు. వైసీపీ ఎంపీగా గెలిచి..ఆ పార్టీ అధినేత విధానాలు నచ్చక వ్యతిరేకిస్తూ వచ్చిన రఘురామకృష్ణంరాజు..ఎన్ని ఇబ్బందులు పెట్టినా తన పోరాటం ఆపలేదు. అలా అప్పట్లో అధికార పార్టీ నుంచి బాధింపబడ్డ ఆయనకు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కింది.
అందరి కంటే ముందే వర్మకు ఏదో ఒక పోస్ట్?
ఇక మోస్ట్ అవేటెడ్. అటు టీడీపీ అధినేత.. ఇటు జనసేన అధినేత ఇద్దరు నచ్చిన మెచ్చిన నేత SVSN వర్మకు దక్కే పోస్ట్‌పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అందరి కంటే ముందే వర్మకు ఏదో ఒక పోస్ట్ ఇస్తారని అనుకున్నారు. కానీ టీటీడీ ఛైర్మన్‌తో పాటు నామినేటెడ్ పోస్టుల నియామకం కూడా జరిగిపోయింది. ఇంకా కొన్ని నామినేటెడ్ పోస్టులు ఉన్నా వర్మకు ఏ పదవి ఇస్తారనేది మాత్రం ఇంట్రెస్టింగ్‌గా మారింది. వర్మకు మంచి పోస్ట్ ఇవ్వాలని పవన్ కల్యాణ్ కూడా సీఎం చంద్రబాబుతో చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే ఆయన కోరుకున్నట్లుగా ఎమ్మెల్సీని చేస్తారని అంటున్నారు. మండలికి పంపడమే కాదు.. ఇంకా ప్రమోషన్ ఇస్తారని తెలుస్తోంది.
ఎమ్మెల్సీని చేసి ఏదైనా కార్పోరేషన్ ఛైర్మన్ హోదాను కూడా కల్పించే అవకాశం ఉందంటున్నారు. 23 సంవత్సరాలుగా చంద్రబాబుతో కలిసి రాజకీయ ప్రయాణం చేస్తున్నారు వర్మ. అధినేత మాటను జవదాటని నేతగా ఆయనకు పేరుంది. అంతేకాదు మొన్నటి ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే గెలుస్తారని ఆయనపై అనుచరులు ఒత్తిడి తెచ్చారు. కానీ బాస్ ఆదేశాల ప్రకారమే సీటు త్యాగం చేశారు వర్మ. టీడీపీ అధిష్టానం నిర్ణయాన్ని లోకల్ క్యాడర్ వ్యతిరేకించినా, వర్మ మాత్రం చంద్రబాబు ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేశారు.
రాత్రింబవళ్లు పవన్ కల్యాణ్ గెలుపు కోసం కృషి
వర్మ, అతని భార్య లక్ష్మీదేవి..కొడుకు గిరీష్.. ఆయన కుటుంబం అంతా రాత్రింబవళ్లు పవన్ కల్యాణ్ గెలుపు కోసం కష్టపడ్డారు. వర్మకు ఫస్ట్ ఎమ్మెల్సీ సీటు ఇస్తామని..ప్రమోషన్ కూడా కల్పిస్తామని బహిరంగంగా హామీ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. పవన్ కల్యాణ్ కూడా చట్టసభల్లో వర్మ గారు ఉండాలంటూ ఎన్నో సార్లు స్టేట్‌మెంట్ ఇచ్చారు. బలమైన నాయకుడైన వర్మకు ఎమ్మెల్సీ ఇస్తామని..దానికి తన పూర్తి సపోర్టు ఉంటుందని పిఠాపురం బహిరంగ సభలోనే జనసేనాని హామీ ఇచ్చారు. అయితే క్షత్రియ వర్గానికి క్యాబినెట్‌లో స్థానం కల్పించాలనుకుంటే మాత్రం వర్మకు అమాత్యయోగం దక్కే అవకాశం ఉందంటున్నారు.
వర్మతో పని అయిపోయిందని అటు చంద్రబాబు..ఇటు పవన్ కల్యాణ్ ఇద్దరు లైట్ తీసుకోవడం లేదు. పవన్ పిఠాపురం వస్తే చాలు ఆయన పక్కనే ఉంటున్నారు వర్మ. తన గెలుపునకు సహకరించి, సీటు వదులుకున్న వర్మను అంతలా గౌరవిస్తున్నారు పవన్. ఆయనకు ఇచ్చే పదవి విషయంలోనూ అటు చంద్రబాబు, ఇటు పవన్ ఇద్దరు కమిట్‌మెంట్‌తో ఉన్నారని..వర్మ ఫుల్ స్యాటిస్‌ఫై అయ్యే బెర్తే ఇస్తారని అంటున్నారు.
పిఠాపురంలో వర్మే కాదు..మాజీమంత్రి దేవినేని ఉమా, బుద్దా వెంకన్న, బీటెక్ రవి, జవహార్..ఇలా చాలామంది నేతలు పదవుల రేసులో ఉన్నారు. వీళ్లందరూ కూడా ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్నారు. అయితే కార్పోరేషన్ ఛైర్మన్లు లేకపోతే ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి అందరినీ సంతృప్తి పరచాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కొందరు నేతలు ఈ టర్మ్ మొత్తం ఏదో ఒక పదవిలో ఉండాలని కోరుకుంటే..ఇంకొందరు మాత్రం చెప్పుకోదగ్గ హోదా ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అలా తమకు ఎప్పుడు అదృష్టం వరిస్తుందోనని ఎదురుచూస్తున్నారు ఆశావహులు.
మీ తల్లిని, చెల్లిని తిట్టిన వారిని మేము అరెస్ట్ చేస్తున్నాం- జగన్‌పై హోంమంత్రి అనిత ఫైర్