ఏలూరుకు ప్రపంచం ఆరోగ్య సంస్ధ బృందం…..జగన్ సర్కారు కీలక నిర్ణయం

  • Published By: murthy ,Published On : December 7, 2020 / 05:17 PM IST
ఏలూరుకు ప్రపంచం ఆరోగ్య సంస్ధ బృందం…..జగన్ సర్కారు కీలక నిర్ణయం

Updated On : December 7, 2020 / 5:24 PM IST

World Health Organization delegation to visit Eluru : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు ఆస్పత్రికి వచ్చిన బాధితుల సంఖ్య 443కి చేరింది. వ్యాధి కారణాలు తెలుసుకోటానికి ప్రపంచ ఆరోగ్య సంస్ధకు చెందిన వైద్యుల బృందం ఏలూరు రానున్నది. ఉన్నపళంగా కళ్లు తిరిగి పడిపోవటం, స్పృహ కోల్పోవడం, మూర్చరావటం, నోటి నుంచి నురగలు కక్కుకుంటూ కింద పడిపోవడం లాంటి దృశ్యాలతో ఏలూరులో ఎక్కడ చూసినా భయానక వాతావరణం ఏర్పడింది.

ఆస్పత్రుల్లో చేరిన వారిలో ఇప్పటి వరకు 243 మంది కోలుకోవడంతో వారిని డిశ్చార్జ్‌ చేశామని…..ఇంకా 183 మంది చికిత్స పొందుతున్నట్లు వైద్యశాఖ అధికారులు తెలిపారు. పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉన్న 16 మందిని విజయవాడ, ఇతర ఆస్పత్రులకు తరలించినట్లు వెల్లడించారు. బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహించినా అస్వస్థతకు గల కారణాలు తెలియడం లేదు. బాధితుల్లో ఎక్కువమంది 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్యవారు కాగా.. 12 ఏళ్లలోపు పిల్లలు 45 మందికి పైగా ఉన్నారు.



ఏలూరులోని దక్షిణ వీధిలో గుర్తించిన ఈ వ్యాధి క్రమంగా ఇతర ప్రాంతాలకూ విస్తరించడం నేపథ్యంలో దోమల మందు దీనికి కారణమై ఉంటుందా? అన్న కోణంలో వైద్యాధికారులు అంచనా వేస్తున్నారు. ‘ఆర్గానో క్లోరినో’ అనే రసాయనం కారణమై ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. నమూనాల ఫలితాలు వచ్చిన తర్వాతే ఈ వ్యాధికి గల కారణాలు తెలిసే అవకాశముంది. అప్పటి వరకు బాగానే ఉందని, ఏం జరిగిందో తెలిసేలోపే కిందపడిపోయామని బాధితులు చెబుతున్నారు. దీనికి కారణాలు తెలుసుకునేందుకు ఢిల్లీలోని ఎయిమ్స్‌ బృందం ఇప్పటికే నమూనాలను సేకరించింది. మరింత లోతుగా పరీక్షలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.



హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీకి కూడా ఏపీ అధికారులు కొన్ని నమూనాలను పంపించారు. కాగా ఈ వ్యాధిపై అంతర్జాతీయ సంస్థలతో అధ్యయనం చేయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సహకారాన్ని జగన్ సర్కార్ కోరింది. రేపో, ఎల్లుండో WHO ప్రతినిధి బృందాలు ఏలూరుకు చేరుకునే అవకాశం ఉందని రాష్ట్ర అధికారులు చెబుతున్నారు.

కాగా, ఇప్పటికే సీసీఎంబీ, ఐఐసీటీ, ఎన్ఐఎన్ సంస్థలు వ్యాధికి గలకారణాలు అన్వేషించే పనిలో నిమగ్నమై ఉన్నాయి. దీనిపై అధ్యయనం చేసేందుకు ఇప్పటికే ఎయిమ్స్ సీనియర్ వైద్యులు ఏలూరు చేరుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ఏలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారికి అందుతున్న వైద్యంపై అడిగి తెలుసుకున్నారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారుల్ని ఆదేశించారు.