ఏపీకి కేంద్రం అన్యాయం చేసింది: పార్లమెంట్‌లో పోరాడతాం – విజయసాయి రెడ్డి

  • Published By: vamsi ,Published On : February 1, 2020 / 05:16 PM IST
ఏపీకి కేంద్రం అన్యాయం చేసింది: పార్లమెంట్‌లో పోరాడతాం – విజయసాయి రెడ్డి

Updated On : February 1, 2020 / 5:16 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం బడ్జెట్‌లో ఏమీ కేటియించకుండా మొండిచేయి చూపిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. బడ్జెట్ నిరుత్సాహపరిచిందని, నిధుల కేటాయింపుల్లో ఏపీకి కేంద్రం మొండిచేయి చూపిందని విమర్శించారు. ఏపీకి ఒక్క కొత్త రైల్వే ప్రాజెక్ట్ కూడా కేంద్రం ప్రకటించలేదని, రాష్ట్రంలో ఎయిర్ పోర్టుల అభివృద్ధికి నిధులు ఇవ్వలేదని అన్నారు విజయసాయి రెడ్డి. 

రాష్ట్రానికి ప్రత్యేకహోదా అంశం గురించి అసలు ప్రస్తావించలేదని, పారిశ్రామిక రాయితీలు, సబ్సిడీల ఊసే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ విభజన చట్టం ప్రకారం రెవెన్యూలోటు కింద నిధులు రావాలని, ప్రాజెక్టుల కేటాయింపులో పోలవరం ప్రాజెక్టు కూడా చేర్చాలని, రైతుల ఆదాయం రెండింతలు చేస్తారనే విషయమై స్పష్టత లేదని ఆయన అన్నారు.

పోలవరం ప్రాజెక్టు నిధులు త్వరితగతిన విడుదల చేయాలని, రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వాలని, ఏపీకి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని డిమాండ్ చేశారు విజయసాయి రెడ్డి. కేంద్రానికి పక్షపాత ధోరణి ఉండడం మంచిది కాదని, బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీకి జరిగిన అన్యాయంపై పార్లమెంట్‌లో పోరాడతామన్నారు.