ప్రాణం తీస్తున్న క్రెడిట్ యాప్స్.. అప్పు తీర్చాలని బ్లాక్ మెయిల్, గాజువాకలో యువతి ఆత్మహత్య

  • Published By: naveen ,Published On : November 4, 2020 / 11:50 AM IST
ప్రాణం తీస్తున్న క్రెడిట్ యాప్స్.. అప్పు తీర్చాలని బ్లాక్ మెయిల్, గాజువాకలో యువతి ఆత్మహత్య

Updated On : November 4, 2020 / 12:25 PM IST

credit apps harassment: మీకు క్షణాల్లో అప్పు ఇచ్చి ఆపదలో ఆదుకుంటామంటూ నోటిఫికేషన్లు ఇస్తూ ప్రాణాలు తీస్తున్నాయి క్రెడిట్ యాప్స్‌. విద్యార్థులు, నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకొని తమ దందాను కొనసాగిస్తున్నాయి. మూడు వేల నుంచి 20 వేల వరకు రుణాలను అందిస్తున్నాయి ఈ యాప్స్‌. ఈ అప్పును పది నుంచి 15 రోజుల్లోనే తీర్చేయాలి. అప్పు సరైన సమయంలో చెల్లిస్తే సరి.. లేదంటే అప్పుడు మొదలవుతాయి వేధింపులు. తల్లిదండ్రులు, బంధువులు, ఫ్రెండ్స్‌కు ఫోన్లు చేస్తామంటూ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతూ యువతీ, యువకుల జీవితాలతో ఆడుకుంటున్నాయి ఈ యాప్స్‌.

అప్పు ఇచ్చిన వారి బెదిరింపులు తట్టుకోలేక ఆత్మహత్య:
ఇలా సరైన సమయంలో రుణం చెల్లించలేక ప్రాణాలు తీసుకుంది విశాఖ జిల్లా గాజువాకలోని సుందరయ్య కాలనీకి చెందిన ఆహ్లాద అనే యువతి. ఇంటి అవసరాల కోసం ఆహ్లాద రెండు ఇన్‌స్టంట్ లోన్‌ యాప్‌ ల నుంచి 40 వేల రూపాయల వరకు లోన్‌ తీసుకుంది. గడువులోగా తిరిగి చెల్లించే దారి లేక.. అప్పులు ఇచ్చిన వారి బెదిరింపులు తట్టుకోలేక నిన్న(నవంబర్ 3,2020) ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆన్‌లైన్ క్రెడిట్ యాప్స్‌ రూపొందించి ఇన్‌స్టంట్ లోన్‌ పేరుతో రుణాలు ఇవ్వడం ఆర్బీఐ నిబంధనలకు విరుద్దం. అదే సమయంలో అప్పులు తిరిగి చెల్లించమని బ్లాక్ మెయిల్ చేయడం కూడా నిబంధనలకు విరుద్ధమంటున్నారు సైబర్‌ పోలీసులు.

విద్యార్థులు, నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకొని అనైతిక వ్యాపారం:
విద్యార్థులు, నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకొని ఈ అనైతిక వ్యాపారం చేస్తున్నాయి ఆన్‌లైన్ క్రెడిట్ యాప్స్. సైబర్‌ నేరగాళ్లు, ఆర్థిక మోసాలకు పాల్పడే వారంతా యువతను ఇన్‌స్టంట్ లోన్ పేరుతో ముగ్గులోకి లాగుతున్నారు. గో క్యాష్, స్మాల్ వాలెట్, బబుల్ లోన్, బిలియన్ క్యాష్, లోన్ బజార్ వంటి వందలాది యాప్‌లు ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్‌లో దర్శనమిస్తున్నాయి.

ఆన్‌లైన్‌లో ఎక్కువగా గడిపే యువతను టార్గెట్ చేసి వారికి లింక్‌లు పంపిస్తున్నారు. ఫోటో, ఆధార్‌ కార్డ్, సెల్‌ఫోన్‌లోని కాంటాక్ట్‌లే ష్యూరిటీగా ఇచ్చే ఈ రుణంలో… మళ్లీ పదిశాతం ప్రాసెసింగ్‌ ఛార్జీల కింత కోత విధిస్తారు. మిగిలిన మొత్తాన్ని గూగుల్ పే, ఫోన్‌ పే, పేటీఎం ద్వారా పంపిస్తారు.. గడువులోగా చెల్లించకపోతే ఇక బెదిరింపులు మొదలవుతాయి. ఈ బెదిరింపులు తాళలేక, అప్పు తీర్చే మార్గం కానరాక ఆహ్లాద ఆత్మహత్యకు పాల్పడింది.

బబుల్‌ లోన్‌ ఆనే కంపెనీ నుంచి రుణం తీసుకుంది ఆహ్లాద. ఫోన్‌ ఓపెన్‌ చేయగానే మరో 10 ఆప్‌లు యాడ్‌ చేసినట్లు మేసేజ్ లు వచ్చాయి. రుణం చెల్లించకపోతే ఫోన్‌ కాంటాక్టుల ద్వారా మిగిలిన వారికి వివరాలు చెబుతామని బెదిరింపులకు దిగారు. ఆత్మహత్యకు ముందు ఆహ్లాదకు అనేక బెదిరింపు కాల్స్‌, మేసేజ్ లు వచ్చాయి.