అమరావతిలో జగన్ మాస్టర్ ప్లాన్ ఇదేనా? 

  • Published By: srihari ,Published On : June 23, 2020 / 11:50 AM IST
అమరావతిలో జగన్ మాస్టర్ ప్లాన్ ఇదేనా? 

Updated On : June 23, 2020 / 11:50 AM IST

అమరావతి సీఎం జగన్‌కు చంద్రబాబు వేసిన చిక్కుముడి. బ్రహ్మాండమైన ఆలోచనలు… ప్లాన్‌లు. నిధుల విషయానికొస్తే అంతకన్నా బ్రహ్మాండం. ఇక్కడే జగన్‌ను భయపెడుతోంది.  కొన్ని నిర్మాణలు 90 శాతం దాకా పూర్తయ్యాయి. ఎమ్మెల్యే, ఐఏఎస్, ఐపీఎస్ క్వార్టర్స్ 90 శాతం పూర్తి కాగా, జడ్జిల క్వార్టర్స్, ఉద్యోగుల క్వార్టర్స్ దాదాపు రెడీ. విఐపీలు ఉండే ఈ అపార్ట్‌మెంట్‌లను అత్యంత నాణ్యతతో, అత్యాధునిక హంగులతో, విదేశీ పరిజ్ఞానంతో నిర్మించారు. వీటన్నింటిని ఎలా వాడుకోవాలి? వీటిని ఎంతమందికి కేటాయించినా ఇంకా మిగిలిపోయేలా ఉన్నాయి. 

రాజధాని మాస్టర్ ప్లాన్ ప్రకారం నవ నగరాలను కలుపుతూ నిర్మాణం చేపట్టిన 18.30 కిలో మీటర్ల  సీడ్ యాక్సెస్ రోడ్డు 80 శాతం పూర్తయ్యింది. అనుసంధానంగా నిర్మిస్తున్న మరో 35 కిలోమీటర్ల  రోడ్ల నిర్మాణం ఆగిపోయింది. ఈ రోడ్లను పూర్తి చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. మాస్టర్ ప్లాన్‌ను బుట్టదాఖలు చేసిన జగన్  సర్కార్.. మహా నగరాన్ని నిర్మించే ఆర్థిక పరిస్థితి రాష్ట్రానికి లేదని తెగేసి చెప్పింది. అందుకే చాలా భవనాల దగ్గరికి నిర్మించతలపెట్టిన రోడ్లు మధ్యలోనే ఆగిపోయాయి. 

ఈ భవనాలను పూర్తి చేయాలన్నా పూర్తి చేసి వినియోగించుకోవాలంటే కొన్ని రోడ్ల నిర్మాణం అయినా పూర్తి చేయక తప్పదు. రాజధాని మార్పు అంశాన్ని మొదట తెరమీదకు తెచ్చిన మంత్రి బొత్స సత్యనారాయణే.. మళ్లీ రాజధాని నిర్మాణాలు పరిశీలిస్తుండటంతో.. రాజధాని  ప్రాంత రైతుల్లో అయోమయం. ప్రభుత్వం ఏం చేయబోతోందో తెలియక ఆందోళన. విపక్షమైతే కూపీలు లాగడం మొదలెట్టింది.

అందుకే బొత్స పర్యటపై భిన్నమైన అభిప్రాయాలు. ఎవరికి తోచిన విధంగా వారు అన్వయించుకుంటున్నారు. ఈ పరిణామాలన్నింటి చూస్తే … మూడు రాజధానులకు ఉన్న అడ్డంకులను తొలగించుకునే పనిలో భాగంగానే… ప్రభుత్వం అమరావతి ప్రాంతంలోని ప్రజలను, రైతులను ఒప్పించే ప్రణాళిక ఏదో రచించినట్లు స్పష్టమవుతోంది. 

ఇందుకోసమే మంత్రి బొత్స సత్యనారాయణ వరుస పర్యటనలు చేసి నిర్మాణాలను పరిశీలించడంతో పాటు, ప్రజల  స్పందన ఎలా ఉండనుందో తెలుసుకొంటున్నారని ప్రతిపక్షలంటున్నాయి. రాజధాని కోసం ప్రభుత్వం తీసుకున్న 35 వేల ఎకరాలను ఏం చేయాలి? రైతులకు  ఇచ్చిన ప్లాట్‌లకు విలువ వచ్చే విధంగా ఏం చేయాలి ? ప్రభుత్వం దగ్గర ప్లాన్‌లున్నాయి. 

అంతేకాదు, పరిపాలన రాజధానిగా విశాఖపట్నంను చేస్తే అమరావతి  ప్రాంత రైతులు మనోభావాల దెబ్బతినకుండా వారికి ఓదార్పునిచ్చే ప్రణాళికను ప్రభుత్వం చేస్తున్నట్లు సమాచారం.  ప్రభుత్వ భారీ ప్రణాళికతో అమరావతిని అభివృద్ధి చేసి తాము అనుకున్న మూడు రాజధానులకు అడ్డంకి లేకుండా చేసుకొనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది.