YCP MLAs: జగన్ పెట్టిన టెస్ట్‌లో పాసయ్యేదెవరు, ఫెయిలయ్యేదెవరు?

అసెంబ్లీ సమావేశాల చివరి రోజున గడప గడపకు కార్యక్రమంపై ఫైనల్ వర్క్ షాప్ నిర్వహించనున్నారు. అదేరోజు కొందరు ఎమ్మెల్యేల భవితవ్యాన్ని తేల్చనున్నారు.

YCP MLAs: జగన్ పెట్టిన టెస్ట్‌లో పాసయ్యేదెవరు, ఫెయిలయ్యేదెవరు?

YS Jagan to give progress cards of YCP MLAs

YCP MLAs Progress: 2024 ఎన్నికలకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) పూర్తిగా సిద్ధమైపోయిందా? వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలెవరో సీఎం జగన్ (CM Jagan) తేల్చేశారా? సర్వేలు, నివేదికల ఆధారంగా సిట్టింగ్‌ల పనితీరు, గెలిచే వారి సత్తా ఏంటో తేలిపోయిందా? జగన్ పెట్టిన ఈ టెస్ట్‌లో పాసయ్యేదెవరు? ఫెయిలయ్యేదెవరు? ఈనెల 27న ఇవ్వనున్న ప్రోగ్రెస్ రిపోర్ట్స్‌లో సిట్టింగ్‌ల భవితవ్యం తేలిపోనుందా? ఈ తెరవెనుక రాజకీయం తెలుసుకుందాం రండి.

జిమిలి ఎన్నికలకు అవకాశం లేకపోవడంతో ఏపీలో కూడా షెడ్యూల్ ప్రకారమే వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అన్ని అసెంబ్లీ స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న వైఎస్ జగన్.. అభ్యర్ధుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. సరిగ్గా పనిచేయని, జనంలో లేని ఎమ్మెల్యేలకు టికెట్ల ఇవ్వమని ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు వైసీపీ బాస్.

పనితీరు విషయంలో పలు కీలక అంశాలను జగన్ ప్రామాణికంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. గడప గడపకు కార్యక్రమంలో పాల్గొనకపోవడం, వర్గ విబేధాలు, నియోజకవర్గాల్లో క్యాడర్ అసంతృప్తితో ఉండటం, అభివృద్ధికి నోచుకోకపోవడం, గ్రూపు రాజకీయాలు, అవినీతి ఆరోపణలు ఉన్న వారిపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. అన్ని సర్వేలు, నివేదికల ఆధారంగా ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్టులు తయారు చేసిన జగన్.. ఈనెల 27న వాటిని వ్యక్తిగతంగా అందజేయనున్నట్లు తెలుస్తోంది. తాజా నివేదికల ప్రకారం సుమారు 18 మంది లిస్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. వీరికి మరో ఛాన్స్ ఇస్తారా? లేక టిక్కెట్ ఇవ్వకుండా పక్కన పెడతారా అన్నది మాత్రం సస్పెన్స్‌గానే మారింది.

Also Read: టీడీపీ ముందున్న ఏకైక మార్గం అదేనా.. వారిద్దరినీ ప్రజాక్షేత్రంలోకి తీసుకొస్తారా?

ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాల చివరి రోజున గడప గడపకు కార్యక్రమంపై ఫైనల్ వర్క్ షాప్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలను ఎన్నికలకు సన్నద్ధం చేయనున్న జగన్.. అదేరోజు కొందరు ఎమ్మెల్యేల భవితవ్యాన్ని తేల్చనున్నారు. నివేదికల ఆధారంగా పనితీరు బాగాలేని వారికి టిక్కెట్లు ఇస్తారో లేదో తేల్చేసే అవకాశముంది.

Also Read: అసలు నారా లోకేశ్ హస్తినకు ఎందుకు వెళ్లారు.. అక్కడ ఏం చేస్తున్నారు?

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యేల పనితీరుపై జగన్ ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తూ ఉంటారు. ఇలా చేయించిన వివిధ సర్వేల్లో పలువురు ఎమ్మెల్యేల పనితీరు అస్సలు బాగోలేదని తేలిందని సమాచారం. ఈ విషయమై ఇప్పటికే పలు సమావేశాల్లో పేర్లు చెప్పి మరీ వారికి క్లాస్ తీసుకున్నారు జగన్. ఈ నేపథ్యంలోనే ప్రజాదరణ లేని వారిని తప్పించి, ఆ స్థానంలో కొత్తవారిని నియమించేందుకు జగన్ కసరత్తు చేస్తున్నారు. మొత్తం 7 సర్వేల ఆధారంగా తొలి విడత జాబితాతో పాటు సీట్లు దక్కని ఎమ్మెల్యేల పేర్లు కూడా ప్రకటించే అవకాశముందని వైసీపీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఇదే సమయంలో సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని కొత్త అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డారట జగన్.

మొత్తంగా ఈసారి ప్రకటించే టిక్కెట్లలో ఎక్కువగా మహిళలు, బీసీలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వైసీపీ వర్గాలే చెబుతున్నాయి.