YS Sharmila : ఐదేళ్లు గాడిదలు కాశారా? వైఎస్సార్ మరణంపై ఎందుకు విచారణ జరపలేదు : విజయసాయిరెడ్డికి వైఎస్‌ షర్మిల గట్టి కౌంటర్!

YS Sharmila : వైఎస్సార్ మరణానికి చంద్రబాబు కారణం అయితే.. మీరు అధికారంలో ఉండి 5 ఏళ్లు గాడిదలు కాశారా? ప్రత్యేక విచారణ ఎందుకు జరిపించలేదు?

YS Sharmila : ఐదేళ్లు గాడిదలు కాశారా? వైఎస్సార్ మరణంపై ఎందుకు విచారణ జరపలేదు : విజయసాయిరెడ్డికి వైఎస్‌ షర్మిల గట్టి కౌంటర్!

ys sharmila strong counter to ysrcp mp vijayasai reddy

Updated On : October 27, 2024 / 5:32 PM IST

YS Sharmila : వైఎస్ఆర్ ఆస్తులకు సంబంధించి వైఎస్ జగన్, వైఎస్ షర్మిల మధ్య వివాదం కొనసాగుతోంది. వైఎస్ జగన్ సపోర్టుగా వైసీపీ నేతలు రంగంలోకి దిగారు. ఆ పార్టీ నేతలకు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఆస్తుల గురించి నలుగురు చిన్న బిడ్డలకు సమాన వాటా ఉంటుందన్న వైఎస్ఆర్ మ్యాండేట్ అబద్దమని మీ బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పగలరా? అని విజయసాయిని షర్మిల సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా వైఎస్ జగన్‌పై కూడా ఆమె విమర్శలు గుప్పించారు. మీరు చదివింది జగన్ మోహన్ రెడ్డి స్క్రిప్ట్ కాదని ప్రమాణం చేయగలరా? ప్రశ్నించారు.

ఐదేళ్లు గాడిదలు కాశారా? :
‘‘ మీరూ వైఎస్ జగన్‌ మోచేతి నీళ్లు తాగిన వాళ్లే. రాజకీయంగా, ఆర్థికంగా జగన్ వల్ల బలపడిన వాళ్ళే. మీరు ఇలా కాకపోతే ఎలా మాట్లాడుతారులే. వైఎస్‌ఆర్‌ మరణానికి కాంగ్రెస్ ముమ్మాటికీ కారణం కాదు. రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది వైఎస్సార్. బంగారు బాతును ఎవరు చంపుకోరు. సొంత కళ్లను ఎవరు పొడుచుకోరు.

వైఎస్సార్ మరణానికి చంద్రబాబు కారణం అయితే.. మీరు అధికారంలో ఉండి 5 ఏళ్లు గాడిదలు కాశారా? ప్రత్యేక విచారణ ఎందుకు జరిపించలేదు? దర్యాప్తు చేసి నిజానిజాలు ఎందుకు బయట పెట్టలేదు? దోషులను ఎందుకు శిక్షించలేదు? అనుమానం ఉంటే.. 5 ఏళ్లు అధికారంలో ఉండి కూడా ఎందుకు ఒక్క ఎంక్వైరీ కూడా వెయ్యలేదు? ఇది మీ చేతకానితనానికి నిదర్శనం కాదా?” అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.

చంద్రబాబుతో ఎలాంటి వ్యక్తిగత సంబంధాలు లేవు :
వైఎస్సార్ మరణం తర్వాత చార్జిషీట్‌లో ఆయన పేరు చేర్పించింది మీ అధినేత జగన్ కాదా? కేసుల నుంచి బయట పడేందుకు పొన్నవోలుతో కలిసి ఈ కుట్ర చేయలేదా? అలా చేయకపోతే జగన్ సీఎం అయిన వెంటనే.. మొదటగా అడ్వకేట్ జనరల్ పదవి ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు మళ్లీ తన స్వప్రయోజనం కోసం తల్లిని కోర్టుకి ఈడ్చిన విషపు నాగు జగన్ కాదా? చంద్రబాబుతో నాకు ఎలాంటి వ్యక్తిగత సంబంధాలు లేవు.

వైఎస్సార్ తన బిడ్డ పెళ్లికి చంద్రబాబును పిలిచారు. అలాగే నేను కూడా పిలిచాను. ప్రతిపక్ష నేతను పెళ్లికి ఆహ్వానిస్తే.. నా చీర గురించి కూడా విపరీత అర్థాలు తీసే మీలాంటి వాళ్ళకు సభ్యతా సంస్కారం ఉందని ఎలా అనుకోవాలి?
” అని వరుసగా ప్రశ్నల వర్షం కురిపించారు.

వైఎస్ జగన్‌కు ఇంకా చంద్రబాబు పిచ్చి వీడలేదా? ఇప్పటికీ అద్దంలో చూసుకున్నా.. చంద్రబాబే కనిపిస్తున్నట్లుంది. చంద్రబాబు కళ్ళల్లో ఆనందం చూడటానికో ఆయన బ్రాండింగ్‌ను ఫాలో అవ్వడానికో.. ఆయన్ను ఇంప్రెస్ చేయడానికో.. పని చేయాల్సిన అవసరం లేదని వైఎస్సార్ బిడ్డకు ఎన్నటికీ రాదని మాట ఇస్తున్నా అంటూ వైఎస్ షర్మిల మండిపడ్డారు.

Read Also : AP TET 2024 Final Answer Key : ఏపీ టెట్ 2024 ఫైనల్ ఆన్సర్ కీ వచ్చేస్తోంది.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!