మాట తప్పారు : మంత్రి బుగ్గనపై భగ్గుమంటున్న వైసీపీ కార్యకర్తలు

  • Published By: veegamteam ,Published On : January 18, 2020 / 12:29 PM IST
మాట తప్పారు : మంత్రి బుగ్గనపై భగ్గుమంటున్న వైసీపీ కార్యకర్తలు

Updated On : January 18, 2020 / 12:29 PM IST

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి సొంత నియోజకవర్గంలో వైసీపీ నేతలు అలకబునారు. స్థానిక పదవులపై రెడ్డి సామాజికవర్గం నేతలు పెట్టుకున్న ఆశలపై.. రిజర్వేషన్లు నీళ్లు చల్లాయి. ఎన్నికల సమయంలో మంత్రి బుగ్గన ద్వితీయ శ్రేణి నాయకులకు ఇచ్చిన పదవుల హామీ రిజర్వేషన్ల దెబ్బకు గాలిలో కలిసింది. దీంతో మంత్రి బుగ్గనపై అధికార పార్టీ నేతలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. 

పార్టీలోనూ, ప్రజల్లోనూ బుగ్గనపై అసంతృప్తి..?
రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సొంత నియోజకవర్గం డోన్‌ లో రాజకీయ స్తబ్దత నెలకొంది. మొన్నటి వరకు వివాదరహితుడిగా, ప్రజల మనిషిగా పేరు ఉన్న బుగ్గనకు మంత్రి అయ్యాక అటు సొంత పార్టీ నేతల్లోను.. ఇటు నియోజకవర్గ ప్రజల్లోనూ అసంతృప్తిని మూటగట్టుకున్నారని సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు. ఎన్నికల సమయంలో మంత్రి సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నేతలు బుగ్గన గెలుపునకు చాలా కష్టపడ్డారట. వైసీపీ అధికారంలోకి వస్తే తమకు జడ్పీటీసీ, ఎంపీపీ పదవులు దక్కుతాయనుకున్నారట. కానీ, ఇప్పుడు ఇక్కడ ఓసీ నేతలకు రిజర్వేషన్లు కలిసి రావడం లేదు. దీంతో సొంత పార్టీలోని సొంత సామాజికవర్గానికి చెందిన నేతలు మంత్రి బుగనపై అలకబూనారంటున్నారు. 

bugganna

ఓసీ నేతలకు నిరాశ:
డోన్ ఎంపీపీ పదవిపై అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు ఆశలు పెంచుకున్నారు. కానీ, ఎంపీపీ పదవి బీసీ జనరల్‌కు రిజర్వేషన్ కావడంతో పోటీ చేయాలనుకున్న కొందరు నేతలకు మింగుడుపడటం లేదు. డోన్ జడ్పీటీసీ పదవి కూడా బీసీ మహిళకు కేటాయించారు. ఈ పదవిలో కూడా పోటీ చేసేందుకు ఓసీ నేతలకు అవకాశం లేకుండా పోయింది. దీంతో బుగ్గన సొంత సామాజికవర్గం నేతలు అసంతృప్తితో ఉన్నారట. రెండు పదవులు బీసీలకే కేటాయించడంతో ఓసీ నేతలు పార్టీ అధిష్టానంపైన, మంత్రి బుగ్గనపైన అగ్గి మీద గుగ్గిలం అయిపోతున్నారు. 

 

ysrcp

నామినేటెడ్‌ పదవిపైనే ఆశలు పెట్టుకున్న శ్రీరాములు:
డోన్ నియోజకవర్గం ప్యాపిలి మండలంలో ఎంపీపీ, జడ్పీటీసీ పదవుల రిజర్వేషన్లు.. పలువురు నేతలను నిరాశలో పడేశాయి. ఎంపీపీ పదవి ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. అధికార పార్టీలో ఎంపీపీ పదవిపై పలువురు నేతలు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఎస్సీకి రిజర్వ్డ్ కావడంతో ఆ పదవిపై ఆశలు పెట్టుకున్న నేతలు లబోదిబోమంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీ నుంచి ఎంపీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు డోన్ మాజీ జడ్పీటీసీ శ్రీరాములు ఆసక్తి చూపడం లేదని ప్రచారం సాగుతోంది. నామినేటేడ్ పదవిపైనే ఆయన ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు కూడా ఆర్ధిక మంత్రి బుగ్గన నామినేటెడ్ పదవిస్తామంటూ శ్రీరాములుకు హామీ ఇచ్చారట. ఇప్పుడు వారిని బుజ్జగించేందుకు బుగ్గన కిందా మీదా పడుతున్నారని అంటున్నారు.

Also Read : స్థానిక సమరం : ఇలా చేస్తే టీడీపీ గెలుపు పక్కా