రాహుల్‌ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై ఏపీలో చర్చ.. రాహుల్ వ్యాఖ్యలను వైరల్ చేస్తోన్న వైసీపీ సోషల్ మీడియా

ఓట్ల చోరీ, ఈవీఎంల ఇష్యూలో సైలెంట్‌గా ఉండటమే బెటర్ అనుకుంటోందట. వరుస కేసులతో పాటు, ఇప్పటికే జగన్‌పై ఉన్న ఈడీ, సీబీఐ కేసుల నేపథ్యంలో కేంద్రం హర్ట్ అయ్యేలా ఏ కామెంట్స్ చేసినా తలనొప్పని భావిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

రాహుల్‌ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై ఏపీలో చర్చ.. రాహుల్ వ్యాఖ్యలను వైరల్ చేస్తోన్న వైసీపీ సోషల్ మీడియా

Updated On : August 9, 2025 / 8:59 PM IST

నవ్యాంధ్రలో కాంగ్రెస్ బలం అంతంతే. విభజన తర్వాత ఏపీలో ముక్కి మూలిగినట్లు ఉంది హస్తం పార్టీ పరిస్థితి. ఎన్నో ప్రయోగాలు చేస్తున్న అనుకున్నంత బౌన్స్ బ్యాక్ మాత్రం అవట్లేదు. అయితే ఇప్పుడు ఆల్‌ ఆఫ్‌ సడెన్‌గా..కాంగ్రెస్‌ అగ్రనేత..లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ సెంట్రిక్‌గా ఏపీలో చర్చ జరుగుతోంది. ఎక్కడ చూసినా రాహుల్ ఇచ్చిన పవర్‌ పాయింట్ ప్రజెంటేషన్‌ మీదే డిస్కషన్ నడుస్తోంది. ఓట్ల గోల్‌మాల్‌ జరిగిందని..బీజేపీని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని టార్గెట్‌ చేస్తూ రాహుల్‌ డైలాగులు పేల్చారు.

ఒకే ఇంట్లో నుంచి వందల ఓట్లు పోల్ అయినట్లు లెక్కలు చూపించడం వింతగా ఉందంటూ రాహుల్‌ చెప్పిన డిటేయిల్స్‌ చర్చకు దారితీశాయి. అనేక రాష్ట్రాలలో ఫలితాలు తీర్పులు తారు మారయ్యేలా ఓట్ల చోరీ జరిగిందని అలిగేషన్ చేశారు. అయితే రాహుల్ పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ను వైసీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు తెగ వైరల్ చేస్తున్నారు. ఏపీలో ఈవీఎంల గోల్‌మాల్‌తోనే కూటమి అధికారంలోకి వచ్చిందని పలువురు వైసీపీ నేతలు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు.

Also Read: కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌పై కాంగ్రెస్‌ సర్కార్ ప్లానేంటి? అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతోందా? బీఆర్ఎస్ అనుమానం ఏంటి?

ఆ మాటకొస్తే పవర్‌ కోల్పోయిన వెంటనే పలువురు వైసీపీ లీడర్లు తమ సోషల్ మీడియా అకౌంట్లలో పోలైన ఓట్లు, లెక్కించిన ఓట్లకు తేడా అంటూ పోస్టులు పెట్టిన దాఖలాలు ఉన్నాయి. వైసీపీ క్యాడర్‌ కూడా ఇదే అభిప్రాయంలో ఉంది. దానికి రాహుల్ వ్యాఖ్యలు తోడు అయ్యాయి.  రాహుల్ ఆరోపణలపై ఏపీ ప్రజల్లో డిస్కషన్ అయితే జరుగుతోంది. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. కేవలం 11 సీట్లు మాత్రమే ఆ పార్టీకి వచ్చాయి. అత ఘోర ఓటమి వైసీపీ పెద్దలకు ఇప్పటికీ మింగుడు పడడం లేదు.

వైసీపీ సోషల్ మీడియా సపోర్ట్
అయితే ఓట్ల చోరీ అంటూ రాహుల్ చేసిన ఆరోపణలు ప్రకంపనలు రేపుతున్నాయి. వైసీపీ అధికారికంగా దీని మీద ఎలాంటి కామెంట్స్ చేయకపోయినా సోషల్ మీడియాలో మాత్రం వైసీపీ అభిమానులు యాక్టివిస్టులు ఘాటుగానే స్పందిస్తున్నారు. ఇలా కూడా జరిగే అవకాశం ఉందా అని పబ్లిక్‌లోనూ చర్చ నడుస్తోంది. అయితే జగన్‌ మాత్రం రాహుల్‌ కామెంట్స్‌పై ఎలాంటి ప్రకటన చేయడం లేదు. చిత్రంగా వైసీపీ క్యాడర్ మాత్రం రాహుల్‌కు ఔట్‌ రైట్‌ సపోర్ట్ చేస్తోంది. ఇదే ఇప్పుడు పొలిటికల్ హాట్ టాపిక్ అయింది.

ఏపీలో ఎన్డీయేను వ్యతిరేకిస్తోంది వైసీపీ. అదే కూటమిలో ఉన్న బీజేపీపై రాహుల్ పోరాటం చేస్తున్నారు. ఏపీలో వైసీపీ అధికారం పోవడానికి బీజేపీతో కలిసి కూటమి పార్టీలు చేసిన ఎలక్షనీరింగే కారణమన్న విమర్శలు కూడా వైసీపీ నుంచే ఉన్నాయి. అందుకే రాహుల్ లేవనెత్తుతున్న పలు అభ్యంతరాలకు వైసీపీ సోషల్ మీడియా సపోర్ట్ చేస్తుందని అంటున్నారు.   సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులు పెడుతున్న కామెంట్స్ సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి. జగన్‌ మాత్రం బీజేపీని, మోదీని పల్లెత్తు మాట అనడం లేదన్న టాక్ నడుస్తోంది. అయితే రాహుల్‌ కామెంట్స్‌ను సమర్థిస్తే బీజేపీ పెద్దలకు కోపం తెప్పించొచ్చు.

అలా అయితే మరిన్ని ఇబ్బందులు తప్పవని భావిస్తోందట వైసీపీ అధినాయకత్వం. ఓట్ల చోరీ, ఈవీఎంల ఇష్యూలో సైలెంట్‌గా ఉండటమే బెటర్ అనుకుంటోందట. వరుస కేసులతో పాటు, ఇప్పటికే జగన్‌పై ఉన్న ఈడీ, సీబీఐ కేసుల నేపథ్యంలో కేంద్రం హర్ట్ అయ్యేలా ఏ కామెంట్స్ చేసినా తలనొప్పని భావిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే దేశంలోని విపక్ష నేతలంతా ఓట్ల గోల్‌మాల్‌, ఈవీఎంలపై తమ వాయిస్ వినిపిస్తున్నా వైసీపీ మాత్రం అధికారికంగా ఎలాంటి స్పందన తెలియజేయడం లేదంటున్నారు.

ఈవీఎంలు వద్దు బ్యాలెట్ పేపర్ పెట్టాలని కోరుతున్న పార్టీలన్నీ లైక్ మైండెడ్‌గా ఇండియా కూటమిలోనే ఉన్నాయి. కానీ ఏపీలో వైసీపీ ఒంటరిగా ఉంది. బీజేపీ పెద్దలతో జగన్‌కు సంబంధాలున్నాయని ప్రచారం జరుగుతున్నా..అధికారికంగా పొత్తు లేదు. పైగా ఏపీలో కూటమిపైనే జగన్‌ పోరాడుతున్నారు. రాహుల్‌ గాంధీ కామెంట్స్‌ మీద వైసీపీ క్యాడర్ సానుకూలంగా రియాక్ట్ కావడం అయితే కొత్త చర్చకు తెరలేపింది.