Sajjala Ramakrishna Reddy : వైసీపీ దూకుడు.. విజయవాడలో మూడు స్థానాలకు అభ్యర్థులు ఖరారు, ఎవరెవరంటే..
ఈ ముగ్గురిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు సజ్జల రామకృష్ణారెడ్డి. పవన్ ఏం చేస్తాడో.. Sajjala Ramakrishna Reddy
Sajjala Ramakrishna Reddy – YSRCP : ఏపీలో అప్పుడే ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. పార్టీల మధ్య పొలిటికల్ వార్ తారస్థాయికి చేరింది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. యాత్రలు, సందర్శనల పేర్లతో నాయకులు ఇప్పటికే ప్రజల మధ్యన ఉన్నారు. వరుస కార్యక్రమాలతో ఓటర్లకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే, అధికార పార్టీ వైసీపీ మరింత దూకుడు చూపింది. ఏకంగా అభ్యర్థులనే ఖరారు చేసి ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల పేర్లను కూడా అధికార పార్టీ ప్రకటించేసింది.
విజయవాడలో మూడు అసెంబ్లీ స్థానాలకు వైసీపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. వచ్చే ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్, విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి అవినాశ్, విజయవాడ సెంట్రల్ నుంచి మల్లాది విష్ణులు పోటీ చేస్తారని ఆయన చెప్పారు. ఈ ముగ్గురిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. (Sajjala Ramakrishna Reddy)
పశ్చిమ నియోజకవర్గంలో రూ.3.5 కోట్లతో నిర్మించిన గణపతిరావు రోడ్డు కెటి రోడ్లను ప్రారంభించారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్. అనంతరం వెలంపల్లి శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకల్లో సజ్జల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముగ్గురి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. అదే సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై నిప్పులు చెరిగారు సజ్జల.
”పుంగనూరులో చంద్రబాబు వ్యవహరించిన తీరు బాధాకరం. సభ్య సమాజంలో బాధ్యత కలిగిన ఏ మనిషి కూడా చంద్రబాబులా వ్యవహరించడు. నేరప్రవృత్తి కలిగిన సినిమా విలన్ మాత్రమే అలా చేయగలడు. ప్రాజెక్టుల సందర్శన చేయొచ్చు. ఎవరూ కాదనడం లేదు. గొడవలు రేపడానికి పులివెందులలో ట్రై చేశాడు. కుదరలేదు. అందుకే పుంగనూరులో దారి మార్చి గొడవ సృష్టించాడు. పోలీసులపై ఓపెన్ అటాక్ చేశాడు. కొంతమంది టీడీపీ కార్యకర్తలు చనిపోవాలని చంద్రబాబు కోరుకున్నాడు. కానీ పోలీసులు సంయమనంతో ఉన్నారు కాబట్టే ఎవరూ చనిపోలేదు.
మా పార్టీలో అంతా ఓపెన్ గా ఉంటుంది. ఎలాంటి సీక్రెట్స్ ఉండవు. వీలైనంత వరకూ అందరినీ కలుపుకునే పనిచేస్తాం. చంద్రబాబుది దివాలాకోరుతనం. మేం రిజెక్ట్ చేసినోళ్లను తనతో తిప్పుకుని విజయం సాధించానని గొప్పలు పోతుంటాడు. మేం వదిలేసిన చెత్తను పోగేసుకుని తన విజయంగా చంద్రబాబు చెప్పుకుంటాడు. సీఎం సీటు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానంటాడు పవన్ కల్యాణ్. ఎన్నిచోట్ల పోటీ చేస్తాడో పవన్ చెప్పాలి. లేదా తన కొడుకు వల్ల కావడం లేదు అందుకే పవన్ కు మద్దతిస్తున్నా అని చంద్రబాబైనా చెప్పాలి. పవన్ ఏం చేస్తాడో ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి. రాజకీయాల్లో సీరియస్ గా చిత్తశుద్ధితో ఉండాలనే మేం కోరుకుంటున్నాం.
చంద్రబాబు, లోకేశ్ ఐదేళ్లలో ఏం చేశారో చెప్పలేని స్థితిలో ఉన్నారు. వాళ్లు రాష్ట్రానికి చేసింది నష్టమే తప్ప లాభం లేదు. మేం చేసింది చెప్పి ఓట్లేయమని ప్రజల వద్దకు వెళ్తున్నాం. చంద్రబాబు వద్ద చెప్పడానికి ఏమీ లేదు” అని సజ్జల విమర్శించారు.