వైసీపీ కార్యకర్తల ఫ్లెక్సీలు… అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేసిన కార్యకర్తలు!
మరికొందరు పార్టీని గాలికి వదిలేసి..సొంత పనులు చూసుకుంటున్నారట.

అధికారంలో ఉన్నప్పుడు పార్టీ పదవుల్ని అనుభవించారు. ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు. అపోజిషన్‌లోకి వచ్చేసరికి ముఖం చాటేస్తున్నారు. ఇది ఏపీలో వైసీపీ నేతల తీరు అంటున్నారు ఆ పార్టీ కార్యకర్తలు. కష్టకాలంలో తమకు అండగా నిలబడాల్సింది పోయి..సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోవడం ఏంటని గుస్సా అవుతున్నారు. ఏకంగా ఫ్లెక్సీలు వేసి తమ అసంతృప్తి, ఆవేదనను వెళ్లగక్కుతున్నారు ఫ్యాన్ పార్టీ ఫ్యాన్స్. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం అల్లూరులో వైసీపీ ఫ్లెక్సీలు కలకలం రేపాయి.
జగనన్నా..మాకు దిక్కెవరన్నా అంటూ ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. కావలి నియోజకవర్గంలో మొత్తానికి మొత్తంగా వైసీపీ ఖాళీ అవుతోందట. దాంతో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై లోకల్ లీడర్లు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నారట. రామిరెడ్డిపై ముఖ్య అనుచరులే రివర్స్ అవుతున్న పరిస్థితి ఉందట. రామిరెడ్డి అవినీతి, అక్రమాలు, అరాచకాలు అంటూ ఈ మధ్యే ఆయన ముఖ్య అనుచరుడు సుకుమార్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి ఆరోపణలు, విమర్శలు చేయడం సంచలనంగా మారింది.
Also Read: ఆర్సీబీకి నోటీసులు జారీ చేయనున్న బెంగళూరు అర్బన్ డిప్యూటీ కమిషనర్
అంతేకాకుండా రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డికి చెందిన నలుగురు ముఖ్య అనుచరులు, శ్రేణులు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారట. ఈ నేపథ్యంలోనే జూన్ 4న వైసీపీ అధినేత జగన్ ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు కావడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కావలి రూరల్ మండలంలో కూడా ప్రజాప్రతినిధులు, మత్స్యకార నేతలంతా సమావేశమై చర్చించారట. వైసీపీలో పరిస్థితులు బాలేవని, కనీసం పట్టించుకునే దిక్కుకూడా లేదని వెంటనే టీడీపీలోకి వెళ్లిపోవాలని వారు డిసైడ్ అయ్యారట.
తమ పరిస్థితి ఏంటో తెలియని డైలమా
ఇలా అందరూ పార్టీని వీడుతుండటంతో జగన్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు..కొందరు ఆవేదనతో ఫ్లెక్సీలు పెట్టారట. ఈ క్రమంలో వైసీపీలో ఉన్న అతికొద్ది మాత్రం తమ పరిస్థితి ఏంటో తెలియని డైలమాలో పడ్డారట. పదిహేనేళ్ల పాటు పార్టీ జెండా మోసామని, కనీసం పట్టించుకునే వారు లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట కార్యకర్తలు.
ఓ వైపు పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి రిమాండ్‌లో ఉండగా..మరోవైపు కావలిలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కనీసం ఫోన్‌లో కూడా స్పందింరని కార్యకర్తలు వాపోతున్నారట. అందుకే తమ ఆవేదనను, ఆగ్రహాన్ని ఎలా తెలియజేయాలో తెలియక పార్టీ అధినేత జగన్‌ను ప్రశ్నిస్తూ అల్లూరు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారని అంటున్నారు.
ఒక్క కావలిలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో వైసీపీకి ఇంచార్జ్‌లు లేరట. ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో ఏకంగా 164 మంది నేతలు ఓడిపోవడంతో ఇందులో చాలామంది కూటమి పార్టీల్లోకి జంప్ అయ్యారు. మరికొందరు పార్టీని గాలికి వదిలేసి..సొంత పనులు చూసుకుంటున్నారట. దీంతో నియోజకవర్గంలో పెద్దదిక్కు లేకుండా పోయారని క్యాడర్ ఆవేదన చెందుతోందట.
కూటమి ప్రభుత్వ విధానాలపై ప్రశ్నించాలని ఉన్నా..ఆపద వస్తే అండగా నిలిచే నాయకుడు లేరని అంటున్నారు లోకల్ లీడర్లు, కార్యకర్తలు. అధినేత త్వరగా స్పందించి..పార్టీ కోసం, కార్యకర్తల కోసం పనిచేసే నేతలతో అన్ని నియోజకవర్గాలకు ఇంచార్జ్‌లను నియమించాలని కోరుతున్నాయి వైసీపీ శ్రేణులు.