Rajanagaram Race Gurralu : వైసీపీ వర్సెస్ జనసేన.. రాజానగరంలో హోరాహోరీ సమరం

రాజానగరం నియోజకవర్గంలో అసెంబ్లీ ఫైట్‌ చాలా ఇంట్రస్టింగ్‌గా మారింది. ప్రత్యర్థులుగా తలపడుతున్న ఇద్దరికి ఒకరి శక్తి ఇంటో ఇంకొకరి బాగా తెలియడం... ఇద్దరి సామాజిక నేపథ్యాలు ఒక్కటే కావడంతో విజయంపై ఎవరికి వారే ధీమాగా కనిపిస్తున్నారు.

Rajanagaram Race Gurralu : వైసీపీ వర్సెస్ జనసేన.. రాజానగరంలో హోరాహోరీ సమరం

Rajanagaram Race Gurralu

Rajanagaram Race Gurralu : ఆ ఇద్దరు ఒకప్పుడు ఒకేగూటి పక్షులు.. ఇప్పుడు ప్రత్యర్థులు.. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఒకరికొకరు అన్నట్లు చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన ఆ ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులుగా ఎందుకు మారారు? ఆ ఇద్దరి మధ్య రాజకీయ వైరం ఎక్కడ మొదలైంది? గోదావరి తీరంలో హీట్‌పుట్టిస్తున్న రాజానగరం పొలిటికల్‌ స్టోరీలో ట్విస్టులేంటి?

ఉగ్ర గోదావరిలా రాజకీయం..
సాధారణంగా గోదావరి ఎంత ప్రశాంతంగా ఉంటుందో.. అక్కడి రాజకీయం అంతే ఆసక్తికరంగా ఉంటుంది. కానీ, ఎన్నికల సమయంలోనే ఇక్కడి రాజకీయం ఉగ్ర గోదావరిలా మారిపోతుంటుంది. తీవ్రస్థాయి రాజకీయ యుద్ధంతో నేతలు ప్రత్యర్థులపై విరుచుకుపడటం గోదావరి జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇందుకు రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గం చక్కని ఉదాహరణ. ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ, జనసేన మధ్య ఎన్నికల యుద్ధం పరాకాష్టకు చేరుకుంది.

బత్తుల విజయానికి కంకణం కట్టుకున్న పవన్..
ముఖ్యంగా జనసేన ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజానగరం ఒకటి. జనసేనాని పవన్‌ ప్రకటించిన తొలి రెండు సీట్లలో రాజానగరం ఒకటి అంటే ఆ పార్టీకి రాజానగరం ఎంతటి ప్రాధాన్యమో వేరేగా చెప్పాల్సిన పనిలేదు. దీనికి కారణం కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉండటమే కాకుండా, ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న బత్తుల బలరామకృష్ణ కూడా మరో కారణం. గోదావరి జిల్లాల్లో గట్టి పట్టున్న జక్కంపూడి కుటుంబాన్ని సవాల్‌ చేస్తున్న బత్తుల బలరామకృష్ణను గెలిపించాలని కంకణం కట్టుకున్నారు జనసేనాని పవన్‌కల్యాణ్‌.

జక్కంపూడి కుటుంబానికి సవాల్‌..
వాస్తవానికి జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ… మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు అనుచరుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. బత్తుల బలరామకృష్ణ గతంలో వైసీపీలో పనిచేశారు. ఆ పార్టీ తరఫున జడ్పీటీసీ సభ్యుడిగా పనిచేశారు. కానీ, ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో విభేదించి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. జనసేనలో చేరి… ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో నిలిచి జక్కంపూడి కుటుంబానికి సవాల్‌ విసురుతున్నారు. ఆర్థికంగా బలమైన నేత కావడం, క్షేత్రస్థాయిలో పనిచేసి ఉండటం వల్ల బలరామకృష్ణ నియోజకవర్గంలో గట్టి ప్రభావం చూపిస్తున్నట్లు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

అలా.. పవన్ దృష్టిని ఆకర్షించిన బలరామకృష్ణ..
వైసీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరినప్పటి నుంచి రాజానగరం నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు పలు కార్యక్రమాలను చేపట్టారు బలరామకృష్ణ.. క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి పార్టీ కార్యక్రమాలతోపాటు నియోజకవర్గ సమస్యలపై పోరాడుతూ అందరికీ దగ్గరయ్యారు. గత మూడేళ్లుగా జనసేన క్యాడర్‌కు అందుబాటులో ఉంటూ… పార్టీని బలోపేతం చేయడంతో జనసేనాని పవన్‌ దృష్టిని ఆకర్షించారు బలరామకృష్ణ. అందుకే రాష్ట్రంలో జనసేన పోటీ చేయబోయే నియోజకవర్గాల్లో తొలిసారి రాజానగరం పేరునే ప్రకటించారు పవన్‌.

ఎమ్మెల్యే రాజాపై రాజీలేని పోరాటం..
ఇక ఎమ్మెల్యే రాజాపై రాజీలేని పోరాటం చేయడం ద్వారా క్యాడర్‌లో ఆత్మస్థైర్యం నింపారు. తన సొంత ప్రయోజనాల కోసం మాత్రమే ఎమ్మెల్యే పని చేస్తున్నారని ఆరోపిస్తున్న బలరామకృష్ణ… గతంలో తాను ఆ పార్టీలో ఉండగా, కనీసం తన స్వగ్రామంలో మంచినీటి పథకం కూడా నిర్మించలేకపోయానని నిస్సహాయత వ్యక్తం చేశారు. అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాను వైసీపీని వీడి.. జనసేనలో చేరానని.. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే నియోజకవర్గ ప్రధాన సమస్యలు పరిష్కరిస్తానని హామీనిస్తున్నారు బత్తుల బలరామకృష్ణ.

జనసేనను గెలిపించే బాధ్యతను తీసుకున్న టీడీపీ నేత..
పొత్తుల్లో భాగంగా రాజానగరం… జనసేనకు దక్కుతుందా? అనే మీమాంస తొలుత ఉండేది. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి సైతం రాజానగరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి ఎంతగానో ప్రయత్నించారు. కానీ, జనసేనాని పవన్‌ చాయిస్‌గా తొలుత రాజానగరాన్ని కోరడంతో టీడీపీ కాదనలేకపోయింది. అంతేకాకుండా… టీడీపీ అధినేత చంద్రబాబు కష్టాల్లో ఉండగా, ఆపన్నహస్తం అందించిన జనసేనాని కోరికను మన్నించి రాజానగరంలో జనసేనను గెలిపించే బాధ్యతను తీసుకున్నారు టీడీపీ నేత బొడ్డు వెంకటరమణ చౌదరి. పొత్తు ధర్మం కింద టీడీపీ కూడా సహకరిస్తుండటంతో ప్రచారంతోపాటు ఎన్నికల వ్యూహంలో దూసుకుపోతున్నారు జనసేన అభ్యర్థి బలరామకృష్ణ.

తీవ్ర పోటీని ఎదుర్కొంటున్న రాజా..
ఇక తల్లిదండ్రుల రాజకీయ వారసత్వంతో గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన జక్కంపూడి రాజా ఈ ఎన్నికల్లో తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నారు. 2009లో రాజానగరం నియోజకవర్గం ఏర్పడగా, 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. ఇక 2014లో జక్కంపూడి రాజా తల్లి విజయలక్ష్మి పోటీ చేసి ఓడిపోగా, 2019 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి ఘన విజయం సాధించారు రాజా. గత ఐదేళ్లుగా నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా, సొంత మనుషులు దూరం కావడం, వారే ప్రత్యర్థులుగా ఇప్పుడు పోటీలో ఉండటంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది.

ఎమ్మెల్యే రాజాను టెన్షన్ పెడుతున్న సమస్యలు..
సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన ఎమ్మెల్యే రాజా… కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఐతే పార్టీలో ఎంపీ మార్గాని భరత్‌తో విభేదాలు, స్థానిక క్యాడర్‌తో సమన్వయ లేమి, గంజాయి, బ్లేడ్‌ బ్యాచులకు నియోజకవర్గం అడ్డాగా మారిపోయిందనే విమర్శలతో ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొంటున్నారు ఎమ్మెల్యే. ఐతే గడపగడపకు కార్యక్రమం విజయవంతం చేయడంలో నూటికి నూరు మార్కులు పొందారు ఎమ్మెల్యే. దీంతో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని సీఎం జగన్‌ వద్ద మార్కులు కొట్టేశారు ఎమ్మెల్యే.

ఇద్దరిలో పైచేయి ఎవరిదో?
మొత్తానికి రాజానగరం నియోజకవర్గంలో అసెంబ్లీ ఫైట్‌ చాలా ఇంట్రస్టింగ్‌గా మారింది. ప్రత్యర్థులుగా తలపడుతున్న ఇద్దరికి ఒకరి శక్తి ఏంటో ఇంకొకరి బాగా తెలియడం.. ఇద్దరి సామాజిక నేపథ్యాలు ఒక్కటే కావడంతో విజయంపై ఎవరికి వారే ధీమాగా కనిపిస్తున్నారు. ఐతే నియోజకవర్గంలో కాపు ఓట్లకు సమానంగా కమ్మ సామాజికవర్గం ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తుంటుంది. గత ఎన్నికల్లో మినహా, మిగిలిన రెండుసార్లు టీడీపీ విజయం సాధించడం, ఇప్పుడు టీడీపీ-జనసేన ఏకతాటిపై పనిచేయడం వల్ల కూటమి అభ్యర్థికి అడ్వాంటేజ్‌గా భావిస్తున్నారు. కానీ, ఐదేళ్లుగా తాను చేసిన సేవలే గెలిపిస్తాయన్న ధీమాతో ఎమ్మెల్యే కూడా విజయంపై గట్టినమ్మకంతో ఉన్నారు. మరి ఈ ఇద్దరిలో ఎవరిది పైచేయి అవుతుందో..? ఓటర్లు ఎవరిని ఆదరిస్తారో వేచిచూడాలి.

Also Read : టీడీపీ వర్సెస్ వైసీపీ.. ముక్కంటి ఇలాకాలో హోరాహోరీ