సీఎం జగన్ ‘మేమంతా సిద్దం’ బస్సు యాత్ర షెడ్యూల్ ప్రకటన

మేమంతా సిద్దం పేరుతో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర చేయడానికి రెడీ అయ్యారు.

సీఎం జగన్ ‘మేమంతా సిద్దం’ బస్సు యాత్ర షెడ్యూల్ ప్రకటన

CM Jagan Memanta Siddham bus yatra schedule

Updated On : March 19, 2024 / 3:38 PM IST

Memanta Siddham Bus Yatra: సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర మొదటి మూడు రోజుల షెడ్యుల్‌ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ నెల 27న ఇడుపులపాయ నుంచి మేమంతా సిద్దం పేరుతో బస్సుయాత్రకు శ్రీకారం చుడతారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకూ బస్సు యాత్ర కొనసాగుతుందని చెప్పారు. నోటిఫికేషన్ వచ్చాక ఎన్నికల ప్రచార సభలు ఉంటాయని వెల్లడించారు. ఎన్నికల సమరానికి కార్యకర్తలను సన్నద్ధం చేయడానికి బస్సుయాత్ర చేపడుతున్నట్టు చెప్పారు.

”27 తేదీ నుంచి జగన్ పూర్తిగా యాత్రలోనే ఉంటారు. Holidays వచ్చినా యాత్రలోనే ఉంటారు. మొదటి రోజు ప్రొద్దుటూరులో మేమంతా సిద్దం సభ ఉంటుంది. బస్సు యాత్రలో రోజుకి ఒక సభ ఉంటుంది. ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం. ఉదయం సమయంలో వివిధ రంగాలకు చెందిన ప్రజలతో ఇంటరాక్షన్ ఉంటుంది. లంచ్ తరువాత పార్టీ నేతలతో సమావేశాలు ఉంటాయి. సాయంత్రం బహిరంగ సభ ఉంటుంది.

27వ తేది మొదటి రోజు కడప పార్లమెంట్ పరిధిలోని ప్రొద్దుటూరులో సభ నిర్వహిస్తాం. 28వ తేది రెండవ రోజు నంద్యాలలో సభ ఉంటుంది. 29 గుడ్ ఫ్రైడే బస్సు యాత్రకు సెలవు. 30వ తేది మూడవ రోజు కర్నూల్ పార్లమెంట్ పరిధిలో ఎమ్మిగనూరులో సభ ఉంటుంద”ని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.