అడుగడుగునా బలగాలు, కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్.. ఏపీలో కౌంటింగ్‌కు ఈసీ భారీ ఏర్పాట్లు

ఏపీ వ్యాప్తంగా కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు పోలీసులు.

అడుగడుగునా బలగాలు, కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్.. ఏపీలో కౌంటింగ్‌కు ఈసీ భారీ ఏర్పాట్లు

Updated On : May 31, 2024 / 5:30 PM IST

Ap Election Counting : ఏపీలో కౌంటింగ్ కు భారీగా ఏర్పాట్లు చేస్తోంది ఈసీ. రికార్డు స్థాయిలో కేంద్ర బలగాలు మోహరించాయి. కౌంటింగ్ సందర్భంగా అల్లర్లు జరిగే అవకాశం ఉంని భావిస్తున్న పోలీసులు.. కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ విధించారు. మరోవైపు ఏపీ వ్యాప్తంగా కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు పోలీసులు.

కౌంటింగ్ సందర్భంగా రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది ఈసీ. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేశారు. ఈవీఎంలు భద్రపరిచిన కేంద్రాలను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. రిటర్నింగ్ అధికారులు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తున్నారు. పోలింగ్ సమయంలో, పోలింగ్ తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకున్న అవాంఛనీయ సంఘటనల నేపథ్యంలో మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్రం నుంచి కూడా అదనపు బలగాలు ఏపీకి వచ్చాయి. కౌంటింగ్ కోసం రికార్డు స్థాయిలో కేంద్ర బలగాలను మోహరించారు.

అన్ని కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ పెట్టారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర గుమికూడకూడదు. ముఖ్యంగా పల్నాడు, అనంతపురం, కడప..ఎక్కడెక్కడ అయితే పోలింగ్ రోజున, పోలింగ్ తర్వాత హింసాత్మక ఘటనలు జరిగాయో.. ఆయా ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. కౌంటింగ్ రోజున హింస జరిగే అవకాశం ఉందని అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం మరింత అలర్ట్ అయ్యింది. శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్ట ఏర్పాట్లు చేసింది. పెద్ద సంఖ్యలో కేంద్ర బలగాలను రంగంలోకి దించింది.

Also Read : ఓట్ల లెక్కింపు ఎలా చేస్తారు? టేబుల్స్ ఎందుకు? రౌండ్స్ అంటే? కౌంటింగ్ ప్రక్రియపై 10టీవీ ఎక్స్‌క్లూజివ్