Pawan Kalyan : ఇదే స్ఫూర్తిని సార్వత్రిక ఎన్నికల్లో కూడా కొనసాగించాలి, పి.గన్నవరం జనసేనదే- పవన్ కల్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నాయకులు దౌర్జన్యాలు, అక్రమాలకు పాల్పడి కనీసం నామినేషన్ వేసే పరిస్థితి కూడా లేకుండా చేశారు.

Pawan Kalyan
Pawan Kalyan : పి.గన్నవరం నియోజకవర్గం జనసేనదే అని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విశ్వాసం వ్యక్తం చేశారు. జనసేన కార్యకర్తలు స్థానిక ఎన్నికల్లోనే సత్తా చాటారని, సార్వత్రిక ఎన్నికల్లోనూ అదే స్ఫూర్తిని కొనసాగించాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. పి.గన్నవరం నియోజకవర్గం నేతలతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పి.గన్నవరం నియోజకవర్గం జనసేన ఇంఛార్జ్ గిడ్డి సత్యనారాయణకు ఎన్నికల నియమావళి, నిబంధనలతో కూడిన పత్రాలను అందజేశారు పవన్ కల్యాణ్.
‘స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నాయకులు దౌర్జన్యాలు, అక్రమాలకు పాల్పడి కనీసం నామినేషన్ వేసే పరిస్థితి కూడా లేకుండా చేశారు. వాటిని తట్టుకొని పి.గన్నవరం నియోజకవర్గంలో జనసేన నాయకులు అంతా ఒక మాట మీద నిలబడి స్థానిక రాజకీయ పరిణామాలకు అనుగుణంగా ఇతర పక్షాలతో కలసి సత్తా చాటారు. ఇదే స్ఫూర్తిని సార్వత్రిక ఎన్నికల్లో కూడా కొనసాగించాలి. పి.గన్నవరం నియోజకవర్గం కచ్చితంగా జనసేనదే’ అని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు.
శనివారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పి.గన్నవరం నియోజకవర్గం నేతలతో పవన్ సమావేశం నిర్వహించారు. “పి.గన్నవరం నియోజకవర్గానికి స్థానిక ఎన్నికల సమయంలో పూర్తి స్థాయి ఇంఛార్జ్ లేకపోయినా అక్కడి పార్టీ నేతలు, వీర మహిళలు, జన సైనికులు ఒకే తాటి మీద నిలిచారు. పార్టీ విధివిధానాలను అనుసరించారు. ప్రతి కార్యక్రమాన్నీ విజయవంతం చేశారు. ఈ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు అనుసరించిన విధానం అందరికీ ఆదర్శం. రాబోయే ఎన్నికలు రాష్ట్రం దశదిశను నిర్దేశించేవి. ప్రతి స్థానం కీలకమే” అని పవన్ కల్యాణ్ అన్నారు.
Also Read : ఏపీ రాజకీయాల్లో హాట్ సీటుగా మారిన ఆ అసెంబ్లీ సెగ్మెంట్.. ఎందుకో తెలుసా?