Tirumala Rush: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. కొండపై ఎన్ని లక్షల మంది ఉన్నారంటే.. ఆ వాహనాలకు నో ఎంట్రీ..

మాడవీధులు, ఔటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్ అన్నీ భక్తులతో నిండిపోయాయి. గ్యాలరీల్లోకి వెళ్లేందుకు భక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నా సాధ్యం కావడం లేదు.

Tirumala Rush: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. కొండపై ఎన్ని లక్షల మంది ఉన్నారంటే.. ఆ వాహనాలకు నో ఎంట్రీ..

Updated On : September 28, 2025 / 6:59 PM IST

Tirumala Rush: తిరుమలకు భక్తులు పోటెత్తారు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన గరుడ వాహన సేవను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు క్యూ కట్టారు. దీంతో మాడవీధుల్లోని గ్యాలరీలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గరుడ సేవను కనులారా వీక్షించి తరించేందుకు భక్తులు భారీగా తిరుమలకు తరలివచ్చారు.

సాయంత్రం 6.30 గంటలకు గరుడ వాహన సేవ ప్రారంభమైంది. గరుడ వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. తిరుమల మొత్తం కూడా జనసంద్రంగా మారిపోయింది. మాడవీధుల్లోని గ్యాలరీలన్నీ ఫుల్ అయిపోయాయి. వెలుపల ఉన్న భక్తులు కూడా గ్యాలరీల్లోకి వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే గ్యాలరీలలో దాదాపుగా 2లక్షల మంది భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. బయట మరో 70వేల మంది భక్తులు వేచి ఉన్నారు.

మొత్తంగా 3లక్షల మంది భక్తులు తిరుమలకు వచ్చి ఉంటారని అంచనా వేస్తున్నారు. వీరందరికీ గరుడ సేవ దర్శనం కల్పించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. నాలుగు కార్నర్లలో క్యూలైన్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా భక్తులను లోపలికి పంపేందుకు చర్యలు చేపట్టారు. మాడవీధులు, ఔటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్ అన్నీ భక్తులతో నిండిపోయాయి. గ్యాలరీల్లోకి వెళ్లేందుకు భక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నా సాధ్యం కావడం లేదు.

గరుడ సేవ రోజు స్వామి వారిని దర్శించుకుంటే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే, బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తారు. అటు పోలీసులను భారీగా మోహరించారు. దాదాపుగా 5వేల మంది పోలీసులు విధుల్లో ఉన్నారు. భక్తుల రద్దీని క్రమబద్దీకరిస్తున్నారు. సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమైన గరుడ సేవ అర్థరాత్రి వరకు కొనసాగుతుంది. అప్పటివరకు భక్తులందరికీ గరుడ సేవ దర్శనం లభిస్తుంది. శ్రీవారి ఆలయం ముందు దర్శనం పూర్తవుతుంది.

అటు 4వేల వాహనాలతో తిరుమల పార్కింగ్ ప్రాంతాలు పూర్తిగా నిండిపోయాయి. దీంతో ప్రైవేట్ వాహనాలను కొండపైకి అనుమతించడం లేదు. అలిపిరి వద్దే ఆపేస్తున్నారు. ఆర్టీసీ బస్సులను మాత్రమే పోలీసులు కొండపైకి అనుమతిస్తున్నారు.

Also Read: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ.. చిరంజీవిపై బాలకృష్ణ వ్యాఖ్యల ప్రస్తావన..!