Mahashivratri 2025 : మహాశివరాత్రి విశిష్టత ఏంటి.. ఉపవాసం, జాగరణ ఎందుకు చేయాలి? అభిషేకం ఎప్పుడు చేయాలి?
అభయాన్ని ఇచ్చే ఆ ఆభయంకరుడు మనకు దగ్గర కావాలంటే ఇది అద్భుతమైన ముహూర్తం.

Maha Shivratri 2025: శివ భక్తులు ఎంతగానో ఎదురుచూస్తున్న మహా శివరాత్రి పర్వదినానికి ఘడియలు సమీపించాయి. ఇప్పటికే శివరాత్రి వేడుకకు పలు దేవాలయాలు అంగరంగ వైభవంగా ముస్తాబయ్యాయి. ఇక ఈ పండగ రోజున ఓం నమ: శివాయ, హర హర మహాదేవ శంభో శంకర మంత్రాలతో శివాలయాలు మార్మోగుతాయి.
ఇక శివరాత్రి అంటే శివయ్యకు పూజలు, అభిషేకాలతో పాటు ఉపవాసం, జాగరణ తప్పనిసరి. అయితే ఉపవాసం, జాగరణ ఎందుకు చెయ్యాలి? వాటి ప్రాముఖ్యత ఏంటి? జాగరణ ఏ విధంగా చేయాలి? ఉపవాసం, జాగరణ ఉండే వారు ఎలాంటి నియమాలు పాటించాలి? ఆధ్యాత్మికవేత్త రామకృష్ణమూర్తి మాటల్లో తెలుసుకుందాం..
”మహాశివరాత్రి అనేది అద్భుతమై ముహూర్తం. ఎందుకంటే.. సూర్య చంద్రుల గమనాన్ని బట్టి ఆ గ్రహాల ప్రభావం ప్రజల మీద ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్న రుషులు.. ఎలాంటి కార్యాచరణ చేయాలో మనకు తెలియజేశారు. ప్రతి నెలలో సంధ్యా సమయం మాస శివరాత్రి. సంవత్సరానికి సంధ్యా సమయం మహాశివరాత్రి. కనుక ఈ అద్భుతమైన ముహూర్తాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే.. ఉపవాసం, జాగరణ, అభిషేకం, అర్చన ఇవన్నీ చేయాలి.
Also Read : ఆ జబ్బులున్న వారు ఉపవాసం ఉండొచ్చా? ఫాస్టింగ్ తర్వాత వెంటనే తినాల్సిన ఆహారం ఏంటి..
మళ్లీ జన్మ లేకుండా చేసుకోగల అవకాశం 84 లక్షల జీవరాశుల్లో కేవలం మానవుడికి మాత్రమే ఉంది. ఇలాంటి అద్భుతమైన ముహూర్తాన శివార్చన చేయడం ద్వారా ఆయనను చేరుకోవచ్చు. వెయ్యి గోవులలో ఒక దూడను వదిలేస్తే.. ఆ దూడ తన తల్లిని వెతుక్కుంటూ ఏ విధంగా వెళ్తుందో.. మనిషి చేసిన కర్మల ఫలితం కూడా నిన్ను అలానే వెంటాడుతుంది. ఎన్ని జన్మలకైనా వెంటాడుతుంది. దానికి పరిష్కారం కూడా చెప్పింది పురాణం. అదే శివరాత్రి రోజున చేసే ఉపవాసం.
ఉపవాసం అంటే దగ్గరగా కూర్చోవడం. ఆ పరమేశ్వరుడికి దగ్గరగా కూర్చోవాలి. ఎవరి వల్లనైతే ఈ సకల చరాచర సృష్టి వచ్చిందో, ఎవరి మహత్తు వల్లనైతే నువ్వు నీ కర్మనంతా క్షయం చేసుకోవచ్చో.. అలాంటి సదాశివుడిని స్మరించుకోవాలి. ఉపవాసం అంటే కేవలం ఆహారం విసర్జించటమే కాదు.. ఇంద్రియాలు అన్నింటికీ ఉన్నటువంటి భోగము విసర్జించాలి.
కంటికి.. దృశ్యం ఆహారం, చెవికి.. శబ్దం ఆహారం, చర్మానికి.. స్పర్శ ఆహారం.. ఇలా ఇంద్రియాలు అన్నింటిని శివుడి ఆలోచనలతో, శివుడి శబ్దంతో, శివుడి స్పర్శతో పునీతం చేసుకోగలిగితే ఈ కణాలలో నిక్షిప్తమైన కర్మఫలాలన్నీ ప్రక్షాళన అయిపోతాయి. అందుకోసమే ఉపవాసం చేయాలి.
అభయాన్ని ఇచ్చే ఆ ఆభయంకరుడు మనకు దగ్గర కావాలంటే ఇది అద్భుతమైన ముహూర్తం. ఈ శివరాత్రి రోజున జాగరణ ద్వారా లింగోద్భవ సమయంలో ఆయనను అర్చిస్తే.. ఆయనకు దగ్గరవుతారు. ఆధునిక విజ్ఞానం ఏం చెబుతుంది అంటే.. కేవలం ఈ ముహూర్తంలో భూమి యొక్క ఆకర్షణ శక్తి సంవత్సరంలోని మిగతా అన్ని రోజుల కంటే అత్యంత తక్కువగా ఉంటుంది. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుదామని అనుకుంటున్న సమయంలో శరీరాన్ని తేలిక చేసుకున్నావ్ ఉపవాసం ద్వారా.
Also Read : మహాశివరాత్రి రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయొద్దు.. ఏరి కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్టే!
జాగరణ ద్వారా, ధ్యానం ద్వారా ఆయనను చేరుకునే ప్రయత్నమే శివరాత్రి రోజున మనం చేసే ఉపవాసము, జాగరణ. దీంతో పాటు కచ్చితంగా అభిషేకం చేయాలి. షట్కాలాలలో చేయాలి. కుదరకపోతే లింగోద్భవ సమయంలో చేయాలి. ఆయన అంశం నుంచి మనం వచ్చాం. మళ్లీ ఆయన దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేయాలి.
ఆ ప్రయత్నంలో భాగంగానే ఉపవాసం, జాగరణ, అభిషేకం, అర్చన, నామస్మరణ.. మీకు ఏది వస్తే అది చేయండి. ఆయనను అర్చించాలంటే మాకు ఈ మంత్రాలన్నీ రావు అంటే.. నమ:శివాయ అని అనుకుంటే చాలు.. చెంబుడు నీళ్లు పోస్తే కుష్, చిటికెడు భస్మం ఇస్తే బస్.. మట్టితో లింగాన్ని చేసి దాని మీద ఒక బిల్వ దళం వేసి నమ:శివాయ అనుకుంటే చాలు” అని ఆధ్యాత్మికవేత్త రామకృష్ణమూర్తి తెలిపారు.
”శివుడిని అర్చించాలంటే నువ్వు శివుడిగా మారాలి. ఇలా శివుడిగా మారుతూ శివార్చన చేయడానికి అద్భుతమైన ముహూర్తమే శివరాత్రి. ఉపవాసం, జాగరణ, అభిషేకం, అర్చన చేసి తరించే ప్రయత్నం చేద్దాం. ఏడాది పాటు నువ్వు ప్రతినిత్యం శివ పూజ చేయడం వల్ల ఏ ఫలితం దక్కుతుందో.. ఆ ఫలితం శివరాత్రి రోజున శివుడిని అర్చించడం ద్వారా దక్కుతుంది.
ఉపవాసం అంటే ఆ రోజున ఏమీ తినకుండా ఉండటం కూడా మంచిది కాదు. శరీరాన్ని ఇబ్బంది పెట్టొద్దు. నీ సామర్ధ్యాన్ని, నీ శక్తిని, నీ అర్హతను బట్టి ఉపవాసం ఉండాలి. శరీరానికి కావాల్సిన ఆహారం తీసుకోవాలి. కఠినంగా ఉపవాసం చేసి ఆరోగ్యం మీదకు తెచ్చుకోవద్దు” అని ఆధ్యాత్మికవేత్త రామకృష్ణమూర్తి సూచించారు.