Magha Vinayaka Chaturthi: జనవరి 22.. మాఘ వినాయక చతుర్థి.. చాలా పవర్‌ఫుల్.. ఇలా చేస్తే సకల శుభాలు కలుగుతాయి..!
మాఘ వినాయక చతుర్ధి రోజున ఎలా పూజ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం.
Magha Vinayaka Chaturthi Representative Image (Image Credit To Original Source)
Magha Vinayaka Chaturthi: మాఘ మాసంలో వచ్చే మాఘ వినాయక చతుర్ధి అని పిలవబడే మాఘ శుక్ల చతుర్ధి తిధికున్న ప్రాధాన్యత ఏంటో, మాఘ మాసంలో వచ్చే వరుణ షష్టికి ఉన్న ప్రాధాన్యత ఏంటో తెలుసుకుందాం. మాఘ మాసం విష్ణుమూర్తికి, సూర్యనారాయణ మూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. మాఘ మాసంలో శుక్ల పక్షంలో చవితిని లేదా చతుర్ధిని.. మాఘ వినాయక చతుర్ధి అంటారు. తిల చతుర్ధి, కుంద చతుర్థి పేర్లతో కూడా పిలుస్తారు. ఇది చాలా శక్తిమంతమైన రోజు అని పండితులు చెబుతున్నారు. జనవరి 22.. గురువారం.. మాఘ శుక్ల చతుర్థి తిథి వచ్చింది.
ఈ మాఘ శుక్ల చతుర్ధిని తిల చతుర్ధి అని పిలుస్తారు. ఆరోజు తిలలు అంటే నువ్వులు దానం ఇస్తే కోటి సార్లు తిలలు దానం చేసిన ఫలితం కలుగుతుంది. మామూలు సమయంలో నువ్వులు దానం ఇచ్చిన ఫలితం కంటే కోటి రెట్లు ఎక్కువ ఫలితం కలుగుతుంది. అది తిల చతుర్ధికి ఉన్న ప్రాధాన్యత. దేవాలయంలో నువ్వులు దానం ఇవ్వడం వల్ల మామూలు సమయంలో ఇచ్చిన నువ్వుల దానం కంటే కోటి రెట్లు ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు.
మాఘ శుక్ల చవితి తిధిని కుంద చవితి లేదా కుంద చతుర్థి అనే పేర్లతో పిలుస్తారు. కుంద పుష్పములు అంటే మల్లె పువ్వులు. మల్లె పూలతో ఈశ్వరుడిని పూజించేటటువంటి చవితి కనుక దీన్ని కుంద చతుర్ధి అంటారు. ఆరోజు పగలు ఉపవాసం ఉండి సాయంత్రం ఈశ్వరుడి శివ లింగ స్వరూపానికి కానీ ఈశ్వరుడి ఫోటోకి కానీ మల్లె పూలతో పూజ చేయండి. శివుడికి చిమ్మిలి నైవేద్యం పెట్టండి. దాని వల్ల జీవితంలో దంపతుల మధ్య గొడవలు ఉండవని, మంచి జీవిత భాగస్వామి లభిస్తుందని పండితులు తెలిపారు. కుటుంబ జీవితం బాగుండాలంటే జనవరి 22న మల్లెపూలతో శివుడిని పూజించాలన్నారు.
విఘ్నాలన్నీ తొలగిపోతాయి..
మాఘ శుక్ల చవితి తిథికి మరో గొప్ప ప్రత్యేకత కూడా ఉంది. దీన్ని మాఘ వినాయక చతుర్ధి అనే పేరుతో పిలుస్తారు. మాఘ వినాయక చతుర్ధి సంద్భంగా ఎలాంటి విధివిధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం వినాయకుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల పనులన్నీ సులభంగా పూర్తవుతాయో, ఆటంకాలన్నీ తొలగిపోతాయో, విఘ్నాలు ఉండవో, మాఘ వినాయక చతుర్ధి రోజున ఎలా పూజ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం.
జనవరి 22న గురువారం మాఘ వినాయక చతుర్ధి వచ్చింది. మాఘ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే చవితి లేదా చతుర్ధిని మాఘ వినాయక చతుర్థి అంటారు. సహజంగా వినాయకుడు భాద్రపద మాసంలో శుక్ల పక్షంలో వచ్చే చవితి రోజున పుట్టాడని, ఆ రోజు మనం అంతా వినాయక చవితి చేసుకుంటాం. అయితే, భాద్రపద మాసంలో మహిళలు రజస్వల దోషాల వల్ల, ఏటి సూతకాల దోషాల వల్ల, మైల వల్ల కానీ ఏ ఇతర ఆరోగ్య, వృత్తిపరమైన కారణాల వల్ల కానీ.. వినాయక చవితి రోజు వినాయకుడి పూజ చేసుకోలేని వాళ్లు.. వరసిద్ధి వినాయకు వ్రతకల్పం చేసుకోలేని వాళ్లు.. ఆ రోజున వినాయకుడిని పూజిస్తే ఎంతటి అద్భుతమైన ఫలితం కలుగుతుందో.. అంతే ఫలితం రావాలంటే మాఘ వినాయక చతుర్ధి రోజున వినాయకుడిని పూజించాలి. అందుకే, మాఘ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే చవితి లేదా చతుర్ధిని మాఘ వినాయక చతుర్ధి అనే పేరుతో పిలుస్తారు. ఇది కూడా వినాయక చవితే.
పూజా విధానం..
ఇంట్లో గణపతి విగ్రహం లేదా ఫోటో ఉంటే గంధం, కంకుమ బొట్లతో అలంకరణ చేయాలి. ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. గణపతికి కొబ్బరి నూనె దీపం, 5 వత్తుల దీపం ఇష్టం. అలాగే గణపతికి ఎర్రటి పూలు, ఎర్రటి వస్త్రాలు అంటే ఇష్టం. ఎర్రటి వస్త్రాలు ధరించి ఎర్ర మందార పూలతో ఎర్ర గులాబీలతో గణపతిని పూజించాలి. గణపతి 108 నామాలు చదువుకోవాలి. అది చదువుకోలేని వాళ్లు గం గణపతయే నమ: అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. గణపతికి ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పించండి.
ఇలా పూజిస్తే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. పూజ సమయంలో రెండు మంత్రాలను కచ్చితంగా చదువుకోవాలి. గం క్షిప్రసాదాయ నమ:, వక్రతుండాయ హుం.. ఒక్కో మంత్రాన్ని 21సార్లు చదువుకోవాలి. మీ పనుల్లో ఏడాది పాటు ఆటంకాలు ఉండవు. కోరికలు తొందరగా నెరవేరతాయి. సంకటనాసిక గణేశ స్తోత్రం చదవటం లేదా వినటం చేయాలని పండితులు తెలిపారు.
NOTE: ఈ విషయాలలో పేర్కొన్న అభిప్రాయాలు, ఆచారాలు పూర్తిగా హిందూ సంప్రదాయాలు, విశ్వాసాలు, సాంస్కృతిక భావనల ఆధారంగా మాత్రమే ఇచ్చాం. కేవలం సమాచారం, సాంస్కృతిక అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. సంపద, దారిద్ర్యం లేదా వ్యక్తిగత ఫలితాల విషయంలో వీటిని సలహాలుగా లేదా హామీగా పరిగణించకూడదు.
