Vasant Panchami: నేడే వసంత పంచమి.. ఈ శక్తిమంతమైన మంత్రాన్ని చదివితే.. విద్యలో మీ పిల్లలకు తిరుగుండదు..!
వసంత పంచమి రోజున ఇంట్లో సరస్వతి దేవి ఫోటో ముందు ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 9 ఒత్తులు వేసి దీపం వెలిగించాలి.
Vasant Panchami Representative Image (Image Credit To Original Source)
Vasant Panchami: జనవరి 23న వసంత పంచమి (శ్రీ పంచమి).. వసంత పంచమికున్న ప్రాధాన్యత ఏంటి? ఈ సందర్భంగా సరస్వతి దేవిని ఏ విధంగా పూజిస్తే ఏడాది మొత్తం సరస్వతి దేవి అనుగ్రహం కలుగుతుంది? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే అద్భుత ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం..
మాఘ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే పంచమి తిథిని శ్రీ పంచమి లేదా వసంత పంచమి పేరుతో పిలుస్తారు. ఇది సరస్వతి దేవి ఆవిర్భావ దినం. దీన్ని సరస్వతి దేవి జన్మదినంగా మనం జరుపుకుంటాం. వేదాల ప్రకారం.. దేవతలు వాగ్దేవిని సృష్టించిన రోజు వసంత పంచమి. మాఘ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే పంచమి రోజున దేవతలంతా సరస్వతి దేవిని ప్రార్థిస్తే దేవతలందరికి సరస్వతి దేవి దర్శనం ఇచ్చిన రోజు వసంత పంచమి. సరస్వతి దేవి పుట్టిన రోజు అంటే ఆ రోజు సరస్వతి దేవి పుట్టిందని అర్థం కాదు. సరస్వతి దేవి ఎప్పటినుంచో వేదాలకు పూర్వం నుంచే ఉంది. కానీ దేవతలందరి ప్రార్థన మేరకు దేవతలకు దర్శనం ఇచ్చి భూలోకంలో సరస్వతి దేవి అనుగ్రహాన్ని ప్రారంభించిన రోజు వసంత పంచమి.
వసంత పంచమి రోజున సరస్వతి దేవిని పూజిస్తే సంవత్సరం మొత్తం సరస్వతి దేవి అనుగ్రహంతో ఇంట్లో పిల్లలు విద్యలో బాగా రాణిస్తారు. జ్ఞాపకశక్తి, మేధాశక్తి, తెలివితేటలు పెరుగుతాయి.
వసంత పంచమి రోజున సరస్వతి దేవిని పూజించే విధానం..
సర్వశుక్లా సరస్వతి.. సరస్వతి దేవి తెల్లటి ప్రకాశంలో వర్ణిస్తుంది. కాబట్టి మీ ఇంట్లో సరస్వతి దేవి ఫోటోకి తెల్లటి పూల మాలికలు అలంకరించాలి. తెల్లటి పుష్పాలతో సరస్వతి దేవిని పూజించాలి. మల్లెపూలు, జాజి పూలు, నందివర్దనం.. ఇలా తెల్లటి పుష్పాలతో పూజించాలి. సరస్వతి దేవికి చాలా ఇష్టమైన దీపం 9 ఒత్తుల దీపం.
వసంత పంచమి రోజున ఇంట్లో సరస్వతి దేవి ఫోటో ముందు ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 9 ఒత్తులు వేసి దీపం వెలిగించాలి. అలాగే సరస్వతి దేవికి తెల్లటి పదార్ధాలు నైవేద్యంగా సమర్పించాలి. పాలు, పెరుగు, వెన్న, పటిక బెల్లం, తెల్ల బెల్లం, కొబ్బరి బోండం నీళ్లు, లేత కొబ్బరి, చెరుకు ముక్కలు, తేనె.. ఇందులో ఏదైనా సరస్వతి దేవికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇలా చేయడం వల్ల సరస్వతి దేవి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది.
ఈ శక్తిమంతమైన మంత్రాన్ని 21సార్లు చదువుకోవాలి..
పూజ, దీపారాధన అయ్యాక ఒక శక్తిమంతమైన మంత్రాన్ని 21సార్లు చదువుకోవాలి. ”ఓం ఐం సరస్వత్యై నమ:”. ఈ మంత్రాన్ని 21సార్లు చదివితే సంవత్సరం మొత్తం సరస్వతి దేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. వసంత పంచమి రోజున ఒక స్తోత్రాన్ని చదివినా, విన్నా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. దాని పేరే సరస్వతి కవచం. ఈ సరస్వతి కవచానికి విశ్వ జయం పేరు ఉంది. ఈ విశ్వం మొత్తాన్ని జయించే శక్తి రావాలంటే, తెలివితేటలు లభించాలంటే సరస్వతి కవచాన్ని శ్రీపంచమి రోజున చదవటం కానీ వినటం కానీ చేయాలి.
మతిమరుపు ఎక్కువగా ఉన్న వారు, జ్ఞాపకశక్తి తక్కువగా ఉన్న వారు.. మతిపరుపు తగ్గటానికి, జ్ఞాపకశక్తి పెరిగేందుకు అన్ని విద్యలు నేర్చుకోవటానికి శ్రీపంచమి రోజున సరస్వతి కవచాన్ని చదవండి లేదా వినండి. వాల్మీకి కూడా అంత గొప్ప వాడు అయ్యాడంటే కారణం సరస్వతి కవచాన్ని చదవడమేనని పురాణ గ్రంథాల్లో చెప్పారు. అందుకే దీనికి విశ్వ జయం అనే పేరు వచ్చింది. సరస్వతి కవచం చదవలేని వాళ్లు, వినలేని వాళ్లు దానికి ప్రత్యామ్నాయంగా సరస్వతి ద్వాదశ నామ స్తోత్రాన్ని అయినా చదవటం కానీ వినటం కానీ చేయాలి.
వసంత పంచమి రోజున తల్లిదండ్రులు పాటించాల్సిన సులభమైన పరిహారం..
ఏ స్తోత్రాలు చదువుకోలేని వాళ్లు ఓం ఐం సరస్వత్యై నమ: అనే మంత్రం చదువుకున్న సరస్వతి దేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే విద్యార్థులు చదువుల్లో బాగా రాణించాలంటే శ్రీపంచమి రోజున తల్లిదండ్రులు పాటించాల్సిన సులభమైన పరిహారం ఉంది. ఒక గ్లాసులో నీళ్లు తీసుకుని, ఆ నీళ్ల మీద అరచేయి (నాలుగు వేళ్లు) ఉంచి, ఓం ఐం వాణ్యై స్వాహా అనే మంత్రం 108 సార్లు చదివి ఆ నీళ్లు మీ పిల్లలతో తాగించాలి. 108 సార్లు చదవలేకపోతే 54 సార్లు, అది కూడా చదవలేకపోతే 21సార్లు చదవాలి. ఇందులో ఐం అంటే సరస్వతి దేవి బీజాక్షరం. ఆ మంత్రించిన నీళ్లు తాగటం వల్ల పిల్లల మేధాశక్తి పెరుగుతుంది. చదువులో బ్రహ్మాండంగా రాణిస్తారు. శ్రీ పంచమి రోజున అన్నదానం లేదా వస్త్రదానం లేదా పుస్తక దానం చేసినా.. సరస్వతి దేవి సంపూర్ణ అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావొచ్చు.
NOTE: ఈ విషయాలలో పేర్కొన్న అభిప్రాయాలు, ఆచారాలు పూర్తిగా హిందూ సంప్రదాయాలు, విశ్వాసాలు, సాంస్కృతిక భావనల ఆధారంగా మాత్రమే ఇచ్చాం. కేవలం సమాచారం, సాంస్కృతిక అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. సంపద, దారిద్ర్యం లేదా వ్యక్తిగత ఫలితాల విషయంలో వీటిని సలహాలుగా లేదా హామీగా పరిగణించకూడదు.
