మొన్ననే డీఏ పెంపు.. ఇప్పుడు మరో శుభవార్త.. ఈసారి హెల్త్ స్కీమ్‌పై, 15 ఏళ్లలో ఎన్నడూలేని విధంగా.. ఇక కార్పొరేట్ ఆసుపత్రుల్లో..
క్యాష్‌లెస్ చికిత్స సులభతరం అవుతుంది. ఆసుపత్రులు ప్యాకేజీ రేట్లను వాస్తవికంగా పరిగణించి సీజీహెచ్‌ఎస్ కార్డు హోల్డర్లకు చికిత్స అందిస్తాయి.

Hospital
CGHS: లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మరో శుభవార్త చెప్పింది సర్కారు. ఇటీవల డీఏ పెంపు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (సీజీహెచ్‌ఎస్)లో కీలక సంస్కరణలు చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం అమలు చేసే ఆరోగ్య భద్రతా పథకమే సీజీహెచ్‌ఎస్.
సుమారు 2,000 వైద్య విధానాల (మెడికల్ ప్రొసీజర్స్) రివైజ్డ్ ప్యాకేజ్ రేట్లను ప్రభుత్వం ప్రకటించింది. ఇవి అక్టోబర్ 13 నుంచే అమల్లోకి వస్తాయి. గత 15 సంవత్సరాల్లో ఇంత పెద్ద మొత్తంలో రివైజ్డ్ చేయడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు ఉన్న పాత రేట్లు ఉద్యోగులు మాత్రమే కాక ఆసుపత్రులకు కూడా ఇబ్బందులు సృష్టించాయి. (CGHS)
ఈ మార్పులు ఎందుకు చేశారు?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు సీజీహెచ్‌ఎస్ కార్డుతో ప్రైవేటు ఆసుపత్రుల్లో క్యాష్‌లెస్ చికిత్స పొందవచ్చు. సీజీహెచ్‌ఎస్ కింద చికిత్స అందించే జాబితాలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రులు సాధారణంగా క్యాష్‌లెస్ చికిత్స అందించడంలో పలు సమస్యలు ఎదుర్కొనేవి. చాలా మంది రోగులు చికిత్స కోసం పెద్ద మొత్తంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో ముందే డబ్బులు చెల్లించాల్సి వచ్చేది. రీయింబర్స్‌మెంట్ కోసం కొన్ని నెలల వరకు వేచి ఉండాల్సిన పరిస్థితులు ఎదుర్కొనేవారు.
కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్యాకేజీ రేట్లు పాతవని, అవి తక్కువగా ఉన్నాయని ఆసుపత్రులు వాదించాయి. అలాగే, క్యాష్‌లెస్ చికిత్స అందించాక ప్రభుత్వం నుంచి సమయానికి చెల్లింపులు రావడం లేదని చెప్పేవి. దీంతో, చాలా ఆసుపత్రులు లబ్ధిదారులకు క్యాష్‌లెస్ సేవలను నిలిపివేసిన ఘటనలు ఉన్నాయి.
2025 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జాతీయ ఫెడరేషన్ (GENC) ఈ సమస్యలను ప్రభుత్వం వద్దకు తీసుకెళ్లింది. ఆసుపత్రుల్లో క్యాష్‌లెస్ సేవలు సరిగ్గా అందకపోతుండడంతో ఉద్యోగులు, పెన్షనర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పింది. అత్యవసర పరిస్థితుల్లో కూడా చికిత్స అందడం లేదని తెలిపింది.
Also Read: మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? Vivo V50e 5Gపై అద్భుతమైన ఆఫర్.. కొంతకాలం మాత్రమే..
కొత్త సంస్కరణలో ఏముంది?
ప్రభుత్వం సుమారు 2,000 వైద్య విధానాలకు కొత్త రేట్లు నిర్ణయించింది. ఇవి పట్టణ వర్గం (టైర్-I, టైర్-II, టైర్-III), ఆసుపత్రి క్వాలిటీ (NABH ఆమోదం వంటి) ఆధారంగా ఉంటాయి. NABH అంటే ఆసుపత్రుల నాణ్యత, సేఫ్టీ ప్రమాణాలకు గుర్తింపు ఇచ్చే సంస్థ
- టైర్-II పట్టణాల్లో ప్యాకేజీ రేట్లు బేస్ రేట్ల కంటే 19 శాతం తక్కువ.
- టైర్-III పట్టణాల్లో ప్యాకేజీ రేట్లు బేస్ రేట్ల కంటే 20 శాతం తక్కువ.
- NABH ఆమోదిత ఆసుపత్రులు సేవలను బేస్ రేట్లలో అందిస్తాయి.
- NABH ఆమోదంలేని ఆసుపత్రులు 15 శాతం తక్కువ రేట్లు పొందుతాయి.
- 200కి మించి బెడ్లు ఉన్న సూపర్ స్పెషల్‌టీ ఆసుపత్రులు 15 శాతం ఎక్కువ రేట్లు పొందుతాయి.
ఉద్యోగులకు ఎలా లాభం?
- క్యాష్‌లెస్ చికిత్స సులభతరం అవుతుంది. ఆసుపత్రులు ప్యాకేజీ రేట్లను వాస్తవికంగా పరిగణించి సీజీహెచ్‌ఎస్ కార్డు హోల్డర్లకు సేవలు అందిస్తాయి.
- ముందస్తు చెల్లింపులు తగ్గుతాయి. ఆసుపత్రుల్లో రోగులు పెద్ద మొత్తంతో డబ్బు ముందే చెల్లించే అవసరం తగ్గుతుంది.
- రీయింబర్స్‌మెంట్ సమస్యలు తగ్గుతాయి. డబ్బు నెలల పాటు నిలిచే సమస్య తగ్గుతుంది.
- మెరుగైన వైద్య సేవలు అందుతాయి. కార్డు హోల్డర్లు సీజీహెచ్‌ఎస్ సదుపాయం ఉన్న ఆసుపత్రుల్లో సమస్యలు లేకుండా చికిత్స పొందవచ్చు.
- వైద్య పరిశ్రమ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించింది.