భలే మంచి చౌక బేరం.. చికెన్ కిలో రూ.30

  • Published By: chvmurthy ,Published On : March 11, 2020 / 05:06 AM IST
భలే మంచి చౌక బేరం.. చికెన్ కిలో రూ.30

Updated On : March 11, 2020 / 5:06 AM IST

చికెన్ వ్యాపారస్తుల మధ్య పోటీ ఆ ఊరి జనానికి పండుగ తెచ్చింది. పప్పన్నం మానేసిన జనాలు రోజూ చికెన్ కర్రీతో మృష్టాన్నభోజనం లాగించేస్తున్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం  కె నాగులా పురంలో  కిలో రూ.30లకే చికెన్ అమ్ముతున్న విషయం ఇప్పుడు జిల్లావ్యాప్తంగా  సంచలన వార్త అయ్యింది. 

మంగళవారం మార్చి10వ తేదీన కె.నాగలాపురంలో సుంకులమ్మ జాతర జరుగుతోంది. భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. చికెన్‌ కిలో రూ.30లకే అమ్ముతున్న విషయం తెలియడంతో కోడి కూర కోసం చికెన్‌ షాపుల దగ్గర క్యూ కట్టారు. బహిరంగ మార్కెట్లో కిలో చికెన్‌ ధర రూ100లు పలుకుతోంది. హోల్‌సెల్‌ చికెన్‌ ధర వ్యాపారస్తులు రూ.46లకు వ్యాపారులకు సరఫరా చేస్తున్నారు. కానీ ఇక్కడ కిలో చికెన్ రూ.30లకే అమ్ముతున్నారు.

విషయం ఏమిటంటే వాహిద్‌ అనే హోల్‌సెల్‌ వ్యాపారికి గూడూరులో కోళ్లఫారం ఉంది. ఉళ్లో ఉన్న చికెన్ వ్యాపారస్తులు వాహిద్ దగ్గర కోళ్లను తీసుకోకపోతే ఆ గ్రామాల్లో పోటీగా వ్యాపారం పెట్టి తక్కువ ధరకు చికెన్ అమ్మి ఇతరుల వ్యాపారాలను దెబ్బతీసే పనులు చేస్తున్నాడు. 

గతంలో ప్యాలకుర్తి గ్రామంలో కూడా ఇదే విధంగా చికెన్‌ వ్యాపారస్తుల మధ్య పోటీ పెట్టాడు. నాలుగైదు రోజులుగా కె.నాగలాపురంలో కిలో రూ.40లకే చికెన్‌ అమ్మేందుకు దుకాణం తెరిచాడు. సదరు పోటీదారుడిని దెబ్బతీసేందుకు గ్రామంలో చికెన్‌ వ్యాపారస్తులు కిలో రూ.30లకే చికెన్‌ అమ్మడం మొదలు పెట్టడంతో చికెన్‌ ప్రియుల పంట పండింది.  

మార్కెట్లో కిలో కూరగాయలు ఏది చూసుకున్నా30, 40 రూపాయల పైమాటగానే ఉంది.  కోడిగుడ్లు కూడా డజను రూ.60లు పలుకుతోంది. అంతకంటే తక్కువకే చికెన్ దొరుకుతుంటే ప్రజలు కోడి కూర కోసం క్యూ కట్టారు. కె.నాగలాపురంలో మహమ్మద్‌బాషా అనే చికెన్‌ వ్యాపారి మంగళవారం నాడు దాదాపు 500కిలోలకు పైగా చికెన్‌ అమ్మినట్లు చెప్పాడు.

పోటీ వ్యాపారంలో నిలదొక్కునేందుకు నష్టానికైనా వ్యాపారం చేస్తున్నామంటూ మహమ్మద్‌బాషా అనే వ్యాపారి తెలిపారు. ఇద్దరు వ్యాపారుల మధ్య పెరిగిన పోటీ కారణంగా  గ్రామంలోని చికెన్‌ ప్రియులు కోడి కూరకు రుచి మరిగారు. 

See Also | భారత్‌లో పడగ విప్పుతున్న కరోనా : 62 పాజిటివ్ కేసులు