ICUలో ఆర్థిక వ్యవస్థ..ఏ రంగంలో వృద్ధి లేదు – చిదంబరం

  • Published By: madhu ,Published On : February 8, 2020 / 10:17 AM IST
ICUలో ఆర్థిక వ్యవస్థ..ఏ రంగంలో వృద్ధి లేదు – చిదంబరం

Updated On : February 8, 2020 / 10:17 AM IST

దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో ఉంది..ప్రస్తుతం ఐసీయూలో ఉంది..అన్ని రంగాల్లో వృద్ధి లేదు..సబ్ కా సాత్..సబ్ కా వికాస్ కనిపించడం లేదు..కేంద్ర ప్రభుత్వం మానవత్వం లేకుండా ప్రదర్శిస్తోంది..అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ఫైర్ అయ్యారు. కేంద్ర బడ్జెట్ 2020 – 21పై ముఫ్ఖం జాహ్ కళాశాలలో ఓ కార్యక్రమం జరిగింది. దీనికి చిదంబరం హాజరై ప్రసంగించారు.

దేశ చరిత్రలో GDP ఇంతగా పడిపోయిన సందర్భం లేదని వ్యాఖ్యానించారు. అయితే..దీనికి కారణం నోట్ల రద్దుగా ఆయన అభివర్ణించారు. ప్రస్తుతం ఐసీయూలో ఉన్న ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదల వ్యతిరేకమన్నారు. పీఎం కిసాన్ స్కీంకు కూడా కోతలు పెట్టిన విషయాన్ని ఆయన వివరించారు.

అన్ని రంగాల్లో వృద్ధి లేదని, పన్నుల వసూలు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. పూర్తిస్థాయిలో ట్యాక్స్ వసూలు చేయడం లేదని మండిపడ్డారు. జీడీపీ దెబ్బతినడానికి రెండు కారణాలు చెప్పారు చిందంబరం. ఒకటి : నోట్ల రద్దు. రెండు : జీఎస్టీ కారణమన్నారు. ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ కట్టబెట్టారని, ప్రభుత్వం తప్పటడుగులు వేయవద్దని చిదంబరం సూచించారు.