సంక్రాంతి దోపిడీ : ఫ్లైట్ ఎక్కాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే

  • Published By: veegamteam ,Published On : January 9, 2019 / 02:22 PM IST
సంక్రాంతి దోపిడీ : ఫ్లైట్ ఎక్కాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే

రైల్వేలు, బస్సుల యాజమాన్యాలే కాదు విమానయాన సంస్థలు కూడా సంక్రాంతి దోపిడీకి తెరలేపాయి. డిమాండ్ బాగా పెరగడంతో అడ్డగోలుగా దోచుకుంటున్నాయి. ఫ్లైట్ టికెట్ ఛార్జీలను భారీగా పెంచేశాయి. విమానయాన సంస్థలు టికెట్ ప్రైస్‌ని ఏకంగా 10రెట్లు పెంచేశాయి. విమాన ప్రయాణం చేయాలంటే ఆస్తులు అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చాయి. పండగ రద్దీని క్యాష్ చేసుకునేందకు విమానయాన సంస్థలు టికెట్ల రేట్లను అమాంతం పెంచేశాయి. మాములు రోజుల్లో ఉండే ప్రైస్‌పై 10రెట్లు అధికంగా వసూలు చేస్తున్నాయి.

విమాన టికెట్ ధరలు
* హైదరాబాద్-విజయవాడకు టికెట్ ధర రూ.50వేలు
* హైదరాబాద్-బెంగళూరు ధర రూ.70వేలు
* హైదరాబాద్-విశాఖ ధర రూ.40వేలు
* హైదరాబాద్-రాజమండ్రి టికెట్ ధర రూ.40వేలు

సంక్రాంతి ముఖ్యమైన, పెద్ద పండగ. దీంతో హైదరాబాద్ నగరం నుంచి లక్షలమంది సొంతూళ్లకు వెళతారు. ముఖ్యమగా విజయవాడ, విశాఖ, రాజమండ్రి, బెంగళూరు వెళ్లే వాళ్లు ఎక్కువమంది ఉన్నారు. వీరిలో చాలామంది రైళ్లు, ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తారు. అయితే ఇప్పటికే రైళ్లు, బస్సుల్లో టికెట్లు అయిపోయాయి. ఉన్న టికెట్లను కూఢా భారీగా రేటు పెంచేశారు. డబ్బు పోతే పోయింది విమానంలో అయినా ప్రయాణం చేద్దామని అనుకుంటే.. ఇప్పుడు విమానయాన సంస్థలు కూడా షాక్ ఇచ్చాయి. టికెట్ రేట్లను పది రెట్లు పెంచి దిమ్మతిరిగేలా చేశాయి.

కాస్తో కూస్తో జీతం వచ్చే వారు విమాన ప్రయాణం వైపు చూస్తున్నారు. ఈ రద్దీ విమానయాన సంస్థలకు వరంలా మారింది. క్యాష్ చేసుకునే పనిలో పడ్డాయి.హైదరాబాద్ టు విజయవాడ లేదా విశాఖ వెళ్లాలంటే మాములు రోజుల్లో రూ.2,500 నుంచి రూ.3,500 వరకు టికెట్ ధర ఉండేది. మరీ అయితే రూ.4వేల వరకు ఉంటుంది. కానీ ఆ ధరను ఇప్పుడు రూ. 20 నుంచి 30వేల వరకు పెంచేశాయి. 2019, జనవరి 11, 12, 13 తేదీల్లో ఏకంగా టికెట్ ధరలను రూ.20, రూ.30, రూ.40వేల వరకు హైక్ చేశాయి. హైదరాబాద్ టు రాజమండ్రి సాధారణ రోజుల్లో టికెట్ ధర రూ. 3వేలకు మించదు. అలాంటిది ఇప్పుడు రూ.20వేల చేరడం దిమ్మతిరిగేలా చేసింది.

ఇండిగో, ఎయిరిండియా, ట్రూ జెట్, స్పైస్ జెట్ ఇలా ప్రతి సంస్థ సంక్రాంతి రద్దీని క్యాష్ చేసుకుంటున్నాయి. ఏపీకి చెందిన వేలాది మంది హైదరాబాద్, ముంబై, ఫుణె, కేరళ, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అలాంటి వారంతా పండుక్కి సొంతూరుకి వెళ్లాలని అనుకుంటారు. వ్యాపారవేత్తలు, డాక్టర్లు, ప్రొఫెసర్లు, సీఈవోలు వంటి హై ప్రొఫైల్డ్ వ్యక్తులు విమాన ప్రయాణానికి మొగ్గు చూపుతారు. అలాంటి వారు సైతం ఈ ఛార్జీలు చూసి వణికిపోతున్నారు. నలుగురున్న ఫ్యామిలీలతో కలిసి ఫ్లైట్‌లో వెళ్లి రావాలంటే లక్షలు ఖర్చు అవుతున్నాయి.