Parag Agrawal : చాట్‌జీపీటీ, బార్డ్ ఏఐకి పోటీగా కొత్త ఏఐ స్టార్టప్ తీసుకొస్తున్న ట్విట్టర్ మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్..
Parag Agrawal : ఓపెన్ఏఐ చాట్‌జీపీటీ, గూగుల్ బార్డ్ ఏఐకి పోటీగా ట్విట్టర్ మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్ ఇప్పుడు కొత్త ఏఐ స్టార్టప్‌ను నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించి భారీ మొత్తంలో నిధులను కూడా సేకరించినట్టు తెలుస్తోంది.

Former Twitter CEO Parag Agrawal now building an AI startup to compete
Parag Agrawal : ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్ దెబ్బకు కనుమరుగైన భారత సంతతికి చెందిన ట్విట్టర్ మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్ మళ్లీ చర్చనీయాంశంగా మారారు. ట్విట్టర్ (X) కంపెనీ నుంచి మస్క్ తొలగించిన దాదాపు ఒక ఏడాది తర్వాత అగర్వాల్ ఇప్పుడు ఏఐ స్టార్టప్‌తో ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఓపెన్ఏఐ టూల్ చాట్‌జీపీటీ ఏఐ రంగంలో ప్రభంజనం సృష్టించగా, దానికితోడు మరో ఏఐ పోటీదారు అయిన సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సొంత బార్డ్ ఏఐ టూల్ తీసుకొచ్చింది.
Read Also : Amazon Q ChatGPT : ఏఐ చాట్‌జీపీటీకి పోటీగా అమెజాన్ బిజినెస్ ‘క్యూ’ చాట్‌బాట్ వచ్చేసింది..!
ఇప్పుడు ఈ రెండు పాపులర్ ఏఐ టూల్స్‌కు పోటీగా కొత్తగా ఏఐ స్టార్టప్ కంపెనీని స్థాపించేందుకు రెడీ అవుతున్నారు అగర్వాల్. అందిన సమాచారం ప్రకారం.. ట్విట్టర్ మాజీ సీఈఓ ఓపెన్ఏఐ ప్రారంభ పెట్టుబడిదారులలో ఒకరి నుంచి భారీగా నిధులు పొందారు. అంతేకాదు.. తన కొత్త ఏఐ స్టార్టప్ కోసం ఏకంగా 30 మిలియన్ డాలర్ల నిధులను కూడా అందుకున్నారని నివేదిక వెల్లడించింది.
30 మిలియన్ డాలర్ల నిధులు సేకరణ :
ప్రస్తుత ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఎలన్ మస్క్ చేతుల్లోకి వెళ్లిన వెంటనే ఆ మైక్రో బ్లాగింగ్ దిగ్గజం సీఈఓగా ఉన్న పరాగ్ అగర్వాల్ కంపెనీ నుంచి నిష్ర్కమించారు. ఆ తర్వాత నుంచి అగర్వాల్ పేరు ఎక్కడా వినిపించలేదు. ఏడాది తర్వాత మళ్లీ అగర్వాల్ పేరు బయటకు వినిపిస్తోంది. తాజాగా ఇప్పుడు ఒక లేటెస్ట్ స్టార్టప్‌తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోకి అడుగుపెడుతున్నారు.
దీనికి సంబంధించి ప్రారంభ నిధులలో భాగంగా 30 మిలియన్ల డాలర్లను కూడా సేకరించినట్టు ఓ నివేదిక తెలిపింది. ట్విట్టర్‌ను వీడిన తర్వాత నుంచి రాడార్‌లో పనిచేస్తున్న అగర్వాల్ కొత్త వెంచర్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (LLM) క్రియేటర్ల కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

Former Twitter CEO Parag Agrawal
ఇండెక్స్ వెంచర్స్, ఫస్ట్ రౌండ్ క్యాపిటల్ వంటి వెంచర్ క్యాపిటల్ సంస్థల నుంచి ప్రధాన పెట్టుబడుల మద్దతుతో ఖోస్లా వెంచర్స్ నిధులు సమకూర్చినట్లు కనిపిస్తోంది. ఈ గణనీయమైన పెట్టుబడులతో పరిశ్రమలో ఏఐ ఆవిష్కరణను అభివృద్ధి చేసేందుకు అగర్వాల్ ప్రయత్నాలు చేపట్టారు.
ఏఐ స్టార్టప్ కంపెనీకి ఏ పేరు పెట్టనున్నారు? ఏ ప్రొడక్టు రూపొందించనున్నారు అనేదానిపై ఎలాంటి వివరాలు రివీల్ చేయలేదు. చాట్‌జీపీటీ తరహాలో లార్జ్ లాంగ్వేజ్ మోడల్‌పై అగర్వాల్ దృష్టిపెట్టినట్టు పరాగ్ స్టార్టప్ సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
మస్క్ అందుకే తొలగించాడా? :
మస్క్ ట్విట్టర్ పగ్గాలు అందుకున్నవెంటనే కంపెనీలో కోతలు విధించాడు. సీఈఓ స్థాయి నుంచి చిన్న ఉద్యోగుల వరకు దాదాపుపై అందరికి వేటు వేశాడు. ట్విట్టర్ ప్లాట్ ఫారంలో అనేక మార్పులు చేశాడు. కొత్త పాలసీలు అమల్లోకి తీసుకొచ్చాడు. స్వేచ్ఛా ప్రసంగం, చందాల ద్వారా డబ్బు ఆర్జించడం వంటివి ప్రవేశపెట్టాడు.
మస్క్ చర్యలను చాలామంది ఉద్యోగులు విభేదించారు. అయినప్పటికీ కూడా మస్క్ వెనక్కి తగ్గలేదు. నివేదికల ప్రకారం.. సీఈఓగా అగర్వాల్ సరిపోడని మస్క్ భావించాడు. మోడరేషన్ పాలసీల విషయంలో సమర్థవంతంగా నిర్ణయాలను తీసుకోలేడని భావించి ఆయన్ను మస్క్ తప్పించాడు.