Gold Rates Today : బాబోయ్.. వచ్చేవారంలో భారీగా పెరగనున్న బంగారం ధరలు.. అదే జరిగితే చరిత్రలో ఇదే తొలిసారి..!
Gold Rates Today : ట్రంప్ సుంకాల హెచ్చరిక, బలహీనమైన అమెరికా ఆర్థిక వ్యవస్థ మధ్య బంగారం ధర భారీగా పెరుగుతోంది. వచ్చే వారంలో బంగారం ధరలు 3వేల డాలర్ల స్థాయికి చేరుకోవచ్చు.

Gold may hit 3,000 dollars
Gold Rates Today : బంగారం కొంటున్నారా? గోల్డ్ కొనేవారికి షాకింగ్ న్యూస్.. బంగారం ధరలు భారీగా పెరగనున్నాయి. రాబోయే వారాల్లో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఔన్సుకు 3వేల డాలర్లకు చేరుకోవచ్చు. ఇది జరిగితే గోల్డ్ హిస్టరీలో ఇదే ఫస్ట్ టైం అవుతుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విధానాలలో నిరంతర మార్పులు, అమెరికా ఆర్థిక పరిస్థితి దిగజారడం, ప్రపంచ రాజకీయ అనిశ్చితి కారణంగా బంగారం ధరల్లో పెరుగుదల కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు. మార్చి 8, 2025న, స్పాట్ బంగారం ఔన్సుకు $2,908.73 మధ్య ట్రేడవుతోంది. భారత మార్కెట్లో, MCXలో బంగారం 10 గ్రాములకు రూ. 85,820 వద్ద ట్రేడవుతోంది.
గత 4ఏళ్లలో అతిపెద్ద క్షీణత :
ట్రంప్ ప్రభుత్వం ఏప్రిల్ 2 వరకు మెక్సికోను 25శాతం సుంకం నుంచి మినహాయించింది. కొన్ని కెనడియన్ ఉత్పత్తులకు కూడా ఉపశమనం లభించింది. కానీ, అనిశ్చితి అలాగే కొనసాగుతోంది. ఈ పరిస్థితి బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా మారుస్తోంది.
అమెరికాలో వినియోగదారుల వ్యయం 4 ఏళ్లలో అతిపెద్ద క్షీణతను చవిచూసింది. అదనంగా, అమెరికన్ కంపెనీలకు ముడి పదార్థాల ధర కూడా గణనీయంగా పెరిగింది. అయితే, డాలర్ ఇండెక్స్ వరుసగా నాలుగో రోజు 103.76కి పడిపోయింది. నవంబర్ 2024 తర్వాత అత్యల్ప స్థాయిగా చెప్పవచ్చు. డాలర్ బలహీన పడటం వల్ల బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి.
బంగారంపై కేంద్ర బ్యాంకుల ఆసక్తి :
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) ప్రకారం.. ప్రపంచ కేంద్ర బ్యాంకులు జనవరి 2025లో 18 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. సంక్షోభ సమయాల్లో కేంద్ర బ్యాంకులు కూడా బంగారాన్ని సురక్షిత ఆస్తిగా పరిగణిస్తున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ పరిస్థితి మరింత దిగజారి, సుంకాల యుద్ధం కొనసాగితే.. బంగారం ధరలు త్వరలో ఔన్సుకు 3వేల డాలర్లకు చేరుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
ఈ వాతావరణంలో బంగారం కొనేందుకు అవకాశం ఉంటుంది. మొత్తంమీద, అమెరికా ఆర్థిక మందగమనం, డాలర్ బలహీనత, వాణిజ్య యుద్ధం, అనిశ్చితి, కేంద్ర బ్యాంకుల నిరంతర కొనుగోళ్లు దీర్ఘకాలంలో బంగారం ధరలను మరింత పెంచే అవకాశం ఉంది. వచ్చే వారం బంగారం ధరలు రికార్డులను బద్దలు కొట్టవచ్చు. పెట్టుబడిదారులు బంగారం కొనుగోళ్లను సద్వినియోగం చేసుకోవచ్చు.
బంగారం నిల్వలు ఎందుకు పెరుగుతున్నాయి? :
డోనాల్డ్ ట్రంప్ సుంకాల యుద్ధం కారణంగా మార్కెట్లో అనిశ్చితి నెలకొంది. ప్రపంచ బ్యాంకులు, సంస్థాగత పెట్టుబడిదారులు బంగారం కొనుగోళ్లను పెంచారు. అమెరికా ఎన్నికల తర్వాత బంగారు ఇన్వెంటరీ 75శాతం పెరిగింది. అమెరికాలో బంగారం డిమాండ్ పెరగడం లండన్ బంగారు మార్కెట్‌పై ఒత్తిడిని పెంచింది. మొత్తంమీద, బంగారం మార్కెట్లో బంగారం డిమాండ్ వేగంగా పెరుగుతోంది.
దీని కారణంగా ధరల పెరుగుదల, డెలివరీ జాప్యాలు కనిపిస్తున్నాయి. కామెక్స్ లండన్ మార్కెట్లలో బంగారం నిల్వలు పెరగడం వల్ల పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత ఆస్తిగా భావిస్తున్నారని సూచిస్తుంది. అమెరికా విధానాలు, ప్రపంచ సరఫరా, కేంద్ర బ్యాంకుల వ్యూహాలను బట్టి రాబోయే నెలల్లో బంగారం ధరలు మరింత హెచ్చుతగ్గులకు లోనవుతాయి.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా :
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.80,550 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 87,860 వద్ద ట్రేడ్ అవుతోంది. ముంబైలో రూ.79,940, రూ.87,200, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలో రూ. 80,400, 87, 710 ధరల వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
మరోవైపు తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. ప్రధాన భారతీయ నగరాల్లో స్పాట్ మార్కెట్‌లో వెండి ధరలు రూ. 100 పెరిగి కిలోకు 99,200 రూపాయల వద్ద ట్రేడవుతున్నాయి.