వచ్చే ఏడాది బంగారం ధరలు తగ్గే అవకాశం.. ప్రముఖ ఆర్థిక సంస్థ ఏఎన్‌జడ్ కీలక సూచనలు.. ఇప్పుడు కొన్నారో..

దీనికి ప్రధాన కారణం.. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ తగ్గింపు సైకిల్‌ను ముగించడమేనని ఏఎన్‌జడ్ విశ్లేషించింది.

వచ్చే ఏడాది బంగారం ధరలు తగ్గే అవకాశం.. ప్రముఖ ఆర్థిక సంస్థ ఏఎన్‌జడ్ కీలక సూచనలు.. ఇప్పుడు కొన్నారో..

Gold

Updated On : October 18, 2025 / 9:21 PM IST

Gold Price Prediction: బంగారం ధరలు రికార్డుస్థాయిలో పెరిగిపోతున్నాయి. అయితే, వచ్చే ఏడాది జులై నుంచి బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని ప్రముఖ ఆర్థిక సంస్థ ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ బ్యాంకింగ్ గ్రూప్ లిమిటెడ్‌ (ఏఎన్‌జడ్ – ANZ) అంచనా వేసింది.

రాజకీయ, ఆర్థిక అనిశ్చితి ప్రపంచాన్ని చుట్టుముట్టిన నేపథ్యంలో పెట్టుబడిదారులు బంగారాన్ని ఒక సురక్షిత ఆస్తిగా భావించి కొనుగోళ్లు పెంచడంతో ఈ ధరల పెరుగుదల సంభవించింది. అమెరికాలో వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు, బలహీనమైన డాలర్ కూడా పసిడి డిమాండ్‌ పెరగడానికి కారణమయ్యాయి. (Gold Price Prediction)

ప్రస్తుత మార్కెట్ పరిస్థితి

స్పాట్ గోల్డ్ 0.4 శాతం పెరిగి ఔన్స్‌కు $4,224.79 వద్ద నిలిచింది. ఇది అంతకుముందు $4,225.69 రికార్డు గరిష్ఠాన్ని తాకింది. డిసెంబర్ డెలివరీకి సంబంధించిన యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా 0.9 శాతం ఎగబాకి ఔన్స్‌కు $4,239.70కి చేరుకున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు బంగారం ధర ఏకంగా 61 శాతం పెరగడం గమనార్హం.

Also Read: కవిత కొడుకు రాజకీయాల్లోకి ఎంట్రీ? కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసిన కవిత.. బంద్‌లో ఎందుకు పాల్గొన్నాడంటే?

భవిష్యత్తులో బంగారం ధర

అనిశ్చితి నెలకొన్న పరిస్థితుల్లో బంగారాన్ని ఎప్పుడూ సురక్షిత ఆస్తిగానే పరిగణిస్తారు. తక్కువ వడ్డీ రేట్ల వాతావరణం ఇప్పుడు దీనికి మరింత సానుకూలంగా మారింది. ఏఎన్‌జడ్ తాజాగా విడుదల చేసిన అంచనాల ప్రకారం.. బంగారం ధర ఈ సంవత్సరం చివరికి ఔన్స్‌కు $4,400కి చేరుకుంటుంది. అంతేకాకుండా, 2026 జూన్ నాటికి ఇది $4,600 గరిష్ఠ స్థాయిని తాకే అవకాశం ఉంది.

అయితే, ఆ తర్వాత ఆరు నెలల్లో ధరలు తగ్గే అవకాశం ఉందని రాయిటర్స్ పేర్కొంది. దీనికి ప్రధాన కారణం.. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ తగ్గింపు సైకిల్‌ను ముగించడమేనని ఏఎన్‌జడ్ విశ్లేషించింది.

ఏఎన్‌జడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఫెడరల్ రిజర్వ్ స్వతంత్రతపై ఆందోళనలు, రాజకీయ అనిశ్చితి, వాణిజ్య సుంకాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అప్పుల భారాలు ఇవన్నీ కలిసి బంగారంలో పెట్టుబడులను కొనసాగిస్తాయి. అంటే, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఈ పరిస్థితుల వల్ల దీర్ఘకాలంలో బంగారం ఒక ఆకర్షణీయమైన పెట్టుబడిగా కొనసాగుతుందని ఈ నివేదిక సూచిస్తోంది.

ఏఎన్‌జడ్ అంచనా ప్రకారం.. వెండి ధర కూడా 2026 మధ్య నాటికి ఔన్స్‌కు $57.50 చేరే అవకాశం ఉంది. అయితే, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కఠిన వడ్డీ విధానంతో ముందుకు సాగితే లేదా అమెరికా ఆర్థిక వృద్ధి అంచనాల కంటే బలంగా ఉంటే, బంగారం ధరకు తగ్గుదల ప్రమాదం ఉందని ఏఎన్‌జడ్ హెచ్చరించింది.