Green Building: హరిత భవనాలతో 20 నుంచి 30 శాతం విద్యుత్ ఆదా
గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో ఇంటిని నిర్మిస్తే విద్యుత్, నీటి ఆదాతో పాటు పర్యావరణ పరిరక్షణతో ఆరోగ్యంగా జీవించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Green Building Trend Sustainable Real Estate Rise In Hyderabad
Green Building Trend: ప్రపంచ వ్యాప్తంగా కాలుష్యం రోజురోజుకీ పెరిగిపోతుంది. వాతావరణంలోనూ అనేక మార్పులు కనిపిస్తున్నాయి. పలు నగరాల్లో.. మొత్తం కాలుష్యంలో నిర్మాణం, ఇన్‌ఫ్రా రంగ వ్యర్థాల నుంచే 40శాతం కాలుష్యం వస్తోందని పలు సంస్థల నివేదికలు చెబుతున్నాయి. దీంతో బిల్డర్లు ప్రత్యామ్నాయంగా గ్రీన్ బిల్డింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో ఇంటిని నిర్మిస్తే విద్యుత్, నీటి ఆదాతో పాటు పర్యావరణ పరిరక్షణతో ఆరోగ్యంగా జీవించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
నిర్మాణ సమయంలో ఒక రకమైన కాలుష్యం వెదజల్లుతుంటే, భవనం పూర్తయి వినియోగంలోకి వచ్చాక ఏసీలు, విద్యుత్తు వాడకం పెరుగుదలతో మరో రకమైన కాలుష్య ఉద్గారాలు వెలువడుతున్నాయి. అయితే నిర్మాణాల నుంచి వెలువడుతున్న 40 శాతం కాలుష్య ఉద్గారాలను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవచ్చని చెబుతోంది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. ఈ క్రమంలోనే ఈ సంస్థ హరిత భవనాలను ప్రోత్సహిస్తోంది. గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలను పాటించే నిర్మాణ ప్రాజెక్టులకు రేటింగ్ ఇస్తోంది.
50 శాతం వరకు నీటి ఆదా
నిర్మాణ సంస్థ చేసుకున్న దరఖాస్తులో పొందుపర్చే అంశాల ఆధారంగా ఐజీబీసీ పాయింట్లను కేటాయిస్తోంది. ప్రాజెక్టును బట్టి సిల్వర్, గోల్డ్, ప్లాటినమ్ రేటింగ్ ఇస్తారు. పెద్ద నిర్మాణ ప్రాజెక్టు భవనాలపై పడిన నీటిని నిల్వ చేసుకునేలా భారీ ట్యాంకులను భూగర్భంలో నిర్మిస్తున్నాయి. బోర్ వెల్స్ రీఛార్జ్ అయ్యేలా, ఇంజెక్షన్ వెల్స్, ఇంకుడుగుంతలను నిర్మిస్తున్నారు. గృహ అవసరాలకు వినియోగించే నీటిని తిరిగి ఉపయోగించుకునేలా మురుగు శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇలా హరిత భవన ప్రమాణాలతో నిర్మించిన ప్రాజెక్టుల్లో 30 నుంచి 50 శాతం వరకు నీటిని ఆదా చేయవచ్చు.
Also Read: ట్రెండీగా కలల సౌధం.. తక్కువ బడ్జెట్లోనే అధిక మన్నికతో ఇంటీరియర్
హరిత భవనాల వైపు మొగ్గు
నిర్మాణాలు అనేవి కూడా గ్లోబల్ వార్మింగ్‌కి కారణం. సిమెంట్, స్టీల్ పర్యావరణంలో చాలా ముఖ్య భాగం. అందుకే భవనాన్ని నిర్మించే వారందరూ ఇప్పుడు గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ద్వారా ఎంతో బాధ్యతతో హరిత భవనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా దీనిపై ఇండస్ట్రీ బాడీ క్రెడాయ్.. ఆల్ ఇండియా లెవల్‌లో దీనిపై ఫోకస్ పెట్టింది. గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో ప్రాపర్టీలను డెవలప్ చేయాలని నిర్ణయించింది. దీనివల్ల పవర్, వాటర్ ఆదా అవుతుందని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
Also Read: ఆఫీస్ స్పేస్ డెవలప్‌మెంట్‌లో హైదరాబాద్ దూకుడు.. చెన్నై తర్వాత మనమే
కాలుష్యానికి చెక్
రాబోయే రోజుల్లో గ్రీన్ బిల్డింగ్ నిర్మాణానికి ఎక్కువ ఖర్చు చేసే అవకాశం రాకపోవచ్చని ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. గ్రీన్ బిల్డింగ్ నార్మ్స్‌తో ప్రాపర్టీలను డెవలప్ చేస్తే నిర్మాణ సమయంలో వ్యయం కాస్త ఎక్కువ అయినా.. మెయింటనెన్స్ సమయంలో ఖర్చు భారీగా తగ్గుతుంది. ఇక గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ లో అన్ని ప్రమాణాలను పాటిస్తే వాయు, నీటి కాలుష్యంతో పాటు శబ్ధకాలుష్యం సైతం తగ్గించవచ్చు. మొత్తంమ్మీద హరిత భవనాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని రియల్ ఎస్టేట్ రంగ సంస్థలు కోరుతున్నాయి.