Housing Prices: సొంతింటి కల.. ఇళ్ల ధరలు పైపైకి.. అంతకంతకు పెరుగుతున్న ధరలు
భూముల విలువ పెరగడంతో పాటు నిర్మాణ వ్యయం పెరగడంతో క్రమంగా గృహాల ధరలు పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా గత మూడేళ్లలో నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది.

Housing prices may rise as construction cost jumps in Hyderabad
construction cost jump: సొంతిళ్లు కట్టుకోవాలని, లేదంటే కొనుక్కోవాలని ప్రతి ఒక్కరూ ఆశపడుతున్నారు. అంతేకాదు ఇళ్లు కట్టుకోవడానికో, లేదంటే కట్టిన ఇళ్లు, అపార్ట్ మెంట్‌లో ఫ్లాట్ కొనుక్కునేందుకో ప్రయత్నిస్తున్నారు. అయితే సామాన్య, మధ్యతరగతి వారి ఇళ్లు కొనుక్కునే అవకాశాలు మెల్ల మెల్లగా సన్నగిల్లుతున్నాయి. అందుకు ప్రధాన కారణం ఇళ్ల ధరలు పెరగడమే. భూముల విలువ పెరగడంతో పాటు నిర్మాణ వ్యయం పెరగడంతో క్రమంగా గృహాల ధరలు పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా గత మూడేళ్లలో నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. కార్మికుల కూలీ నుంచి మొదలు సిమెంట్, స్టీల్, కాంక్రీట్, అల్యూమినియం, కాపర్, డీజిల్ ధరల పెరుగుదలతో నిర్మాణ వ్యయం సగటున మూడేళ్లలో 30 శాతం పైగా పెరిగిందని నిర్మాణదారులు చెబుతున్నారు.
మూడేళ్లలో 16 శాతం పెరిగిన సిమెంట్ ధర
హైదరాబాద్ సహా బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో నైపుణ్యం కలిగిన నిర్మాణ కూలీలకు ఇచ్చే రోజువారీ సగటు కూలీ 900 రూపాయలు. నైపుణ్యం లేని వారికి రూ.700 ఇస్తున్నారు. ఇక కీలకమైన స్టీల్, సిమెంట్ ధరలు విపరీతంగా పెరిగాయి. సిమెంట్ ధరలు మూడేళ్లలో 16 శాతం పెరిగాయి. ఒక దశలో పెరుగుదల గరిష్ఠంగా 39 శాతం వరకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. గత ఏడాది చివర్లో కొంతమేర ధరలు తగ్గడంతో నిర్మాణం రంగం ఊపిరిపీల్చుకుంది. 53 గ్రేడ్ సిమెంట్ మెట్రిక్ టన్నుకు 2020 ప్రారంభంలో 5 వేల 120 రూపాయలు ఉంటే 2021 నాటికి 7 వేల వంద రూపాయలకు చేరింది. గత ఏడాది చివరినాటికి ధర 5 వేల 960 రూపాయలకు తగ్గిందని జేఎల్‌ఎల్ తమ తాజా నివేదికలో పేర్కొంది.
మూడేళ్లలో భారీగా పెరిగిన స్టీల్ రేటు
ఇక స్టీల్ ధరలు మూడేళ్లలో భారీగా పెరిగాయి. మూడేళ్ల క్రితం టన్ను 42 వేల 480 రూపాయలుగా ఉన్న రీఇన్‌ఫోర్స్‌మెంట్ స్టీల్ ఏకంగా 43 శాతం పెరిగి గత ఏడాది ఆఖరు నాటికి 60 వేల 717 రూపాయలకు చేరింది. ఓ దశలో స్టీల్ ధర టన్నుకు 67వేల రూపాయల వరకు వెళ్లిన సందర్భాలున్నాయి. హైరైజ్ అపార్ట్ మెంట్స్ ట్రెండ్ వచ్చాక కాంక్రీట్ వినియోగం బాగా పెరిగింది. ఎం25, ఎం30, ఎం35 గ్రేడ్ రకం కాంక్రీట్ ధరలు 2020లో ఒక క్యూబిక్ మీటర్‌కు 5 వేల 12 రూపాయలుగా ఉండేవి. గత ఏడాది చివరి నాటికి 11 శాతం ధర పెరిగి 5 వేల 553 రూపాయలకు చేరింది. నిర్మాణాల్లో అల్యూమినియం, కాపర్ వినియోగం కూడా ఎక్కువే. భవన నిర్మాణానికి సంబంధించి ఎలక్ట్రికల్ సామగ్రికి ఇవి చాలా కీలకం. మార్కెట్‌లో ప్రస్తుతం వీటి ధరలు భారీగా పెరిగాయి. అల్యూమినియం ధరలు 2020తో పోలిస్తే 2022 ఆఖరు నాటికి 46 శాతం పెరిగాయి. ఇప్పుడు మెట్రిక్ టన్ను అల్యూమినియం లక్షా 86వేల రూపాయలుగా ఉంది.
ఇంధన ధరల పెరుగుదల ప్రభావం కూడా..
మరోవైపు ఇంధన ధరల పెరుగుదల పరోక్షంగా నిర్మాణ వ్యయం పెరగడానికి కారణమవుతోందని జేఎల్ఎల్ నివేదిక చెబుతోంది. సిమెంట్, స్టీల్, కాంక్రీట్, ఇటుకల వంటి నిర్మాణ సామగ్రి వేరేచోట తయారై నిర్మాణ స్థలానికి చేరుకుంటాయి. ఇంధన ధరలు పెరిగితే ఆ ప్రభావం నిర్మాణ వ్యయంపై పడుతుంది. గత మూడేళ్లలో డీజిల్ ధర 30 శాతం మేర పెరిగింది. దీంతో నిర్మాణ సామగ్రి రవాణా ఖర్చులు పెరిగి ఆ ప్రభావం నిర్మాణ వ్యయంపై పడుతోంది.
అంతకంతకు పెరుగుతున్న నిర్మాణ వ్యయం
ప్రస్తుతం మార్కెట్లో అందుబాటు ధరల ఇళ్ల నుంచి మొదలు ఆకాశాన్నంటే హైరైజ్ అపార్ట్ మెంట్స్ వరకు నిర్మిస్తున్నారు. ఆకాశహర్మ్యాల భవనాలను 30 అంతస్తుల కంటే ఎక్కువ నిర్మిస్తున్నట్లయితే నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు 5 వేల 300 నుంచి 6 వేల 300 వరకు అవుతోందని జేఎల్‌ఎల్ లెక్కకట్టింది. నాణ్యంగా, ప్రీమియంగా కట్టే ప్రాజెక్టులలో ఈ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంది.
Also Read: ఇల్లు కొనేటప్పుడు ఏయే అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి?
పదిహేను అంతస్తులపైన కట్టేవాటిలో చదరపు అడుగు నిర్మాణ వ్యయం 3 వేల 800 నుంచి 4 వేల 500 రూపాయలు అవుతుంది. 5 నుంచి 12 అంతస్తులలోపు కట్టే భవనాల్లో చదరపు అడుగుకు 2 వేల 900 నుంచి 3 వేల 300 రూపాయల వ్యయం అవుతుందని జేఎల్ఎల్ చెబుతోంది. అందుబాటు ఇళ్ల నిర్మాణంలో స్టాండ్ లోన్ అపార్ట్‌మెంట్లు ఐదు అంతస్తుల వరకు ప్రతి చదరపు అడుగు నిర్మాణానికి సగటున 2 వేల 200 నుంచి 2 వేల 600 రూపాయల ఖర్చు అవుతుంది.
ఇక విల్లాల్లో గ్రౌండ్ ప్లస్ 2 అంతస్తుల వరకు చదరపు అడుగుకు 4 వేల 300 నుంచి ప్రాజెక్టును బట్టి 12 వేల వరకు వ్యయం అవుతుంది. వాణిజ్య ఆకాశహర్మ్యాల నిర్మాణ వ్యయం గృహ నిర్మాణంతో పోలిస్తే తక్కువగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ చదరపు అడుగు 4 వేల వంద రూపాయల నుంచి 4 వేల 8వందల రూపాయల వరకు ఉంటుంది. నిర్మాణ రంగానికి సంబంధించిన ప్రతీ దాని ధర పెరగడంతో నిర్మాణ వ్యయం కూడా పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.