ఆ డెబిట్, క్రెడిట్ కార్డులు ఆగిపోతాయ్: RBI కొత్త నిబంధనలు

పెరుగుతున్న ఆన్‌లైన్ లావాదేవీలు.. డిజిటల్ ట్రాన్సాక్షన్లను దృష్టిలో పెట్టుకుని ఆర్బీఐ కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకురానుంది. డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగంలో పెరుగుతున్న దుర్వినియోగాన్ని అరికట్టడానికి తగు చర్యలు తీసుకోనుంది. ఈ క్రమంలో క్రెడిట్, డెబిట్ కార్డులను కేవలం ఏటీఎం, పోన్‌లలో మాత్రమే ఉపయోగించుకునే అవకాశం వుంటుందని ఆర్‌బీఐ బుధవారం జారీ చేసిన నోటిఫికేషన్లో వెల్లడించింది.
కార్డుల వినియోగం అంతర్జాతీయ స్థాయా.. లేదా దేశీయ వినియోగమా అనేది నియంత్రించుకునే అధికారాన్ని బ్యాంకులు వినియోగదారులకు అందుబాటులో ఇవ్వాలని ఆదేశించింది. సెంట్రల్ బ్యాంక్ ఓ ప్రకటనలో కొత్త నిబంధనలన్నీ 2020, మార్చి16 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది.
కొత్త నిబంధనల ప్రకారం భారతదేశంలో ఏటీఎం, పాయింట్ ఆఫ్ సేల్ కాంటాక్ట్-బేస్డ్ లాంటి యూజ్ పాయింట్ల వద్ద మాత్రమే అన్ని కార్డులు ఉపయోగించవచ్చు. ఎవరైనా ఆన్‌లైన్ లావాదేవీలు, అంతర్జాతీయ లావాదేవీలు, కాంటాక్ట్‌లెస్ లావాదేవీల కోసం కార్డులను ఉపయోగించకపోతే, సేవలకు వారి కార్డు నిలిపివేస్తారు. మళ్లీ దరఖాస్తు చేసుకుంటేనే కానీ అవి తిరిగి పనిచేయవు.
ఆన్‌లైన్, అంతర్జాతీయ, కాంటాక్ట్‌లెస్ లావాదేవీల కోసం ఎప్పుడూ ఉపయోగించని కార్డులపై ఈ సేవలను తప్పనిసరిగా నిలిపివేస్తామని స్పష్టం చేసింది. ఈ మార్పులకు సంబంధించిన సమాచారాన్ని SMSలేదా e-mail హెచ్చరికల ద్వారా బ్యాంకులు వినియోగదారులకు తెలియజేయాలని RBI సూచించింది. ప్రీపెయిడ్ గిఫ్ట్ కార్డులు, స్మార్ట్ కార్డులకు, ఢిల్లీ మెట్రో, ముంబై మెట్రో, బెంగళూరు మెట్రో లాంటి జాతీయ రవాణాలో ఉపయోగించే కార్డులకు ఈ నిబంధనలు తప్పనిసరి కాదని ఆర్‌బీఐ వివరించింది.