SAS Infra: జీ+57 అంతస్తులతో అపార్ట్ మెంట్.. మన భాగ్యనగరంలోనే!
జనాభా పెరుగుతుంది.. మరోవైపు హైదరాబాద్ లో స్థలాల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో నిర్మాణ సంస్థలు ఇప్పుడు ఆకాశ హర్మ్యాల మీద దృష్టి పెడుతున్నాయి.

Sas Infra
SAS Infra: జనాభా పెరుగుతుంది.. మరోవైపు హైదరాబాద్ లో స్థలాల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో నిర్మాణ సంస్థలు ఇప్పుడు ఆకాశ హర్మ్యాల మీద దృష్టి పెడుతున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు మన భాగ్యనగరంలో జీ+57 అంతస్థులతో అపార్ట్మెంట్స్ నిర్మాణం కానున్నాయి. దక్షిణాదిలోనే ఇదే అత్యంత ఎత్తైన నిర్మాణాలుగా రికార్డ్ కూడా సృష్టించనుంది. ఇప్పటి వరకు 50 అంతస్థులతో బెంగళూరు మొదటి స్థానంలో ఉండగా త్వరలోనే హైదరాబాద్ ఈ స్థానాన్ని ఆక్రమించనుంది.
హైదరాబాద్‌కు చెందిన ఎస్‌ఏఎస్ ఇన్‌ఫ్రా (SAS Infra) ఈ ఆకాశహర్మ్యాలను నిర్మిస్తుంది. కోకాపేటలో 4.5 ఎకరాల స్థలంలో క్రౌన్ పేరిట నిర్మాణం మొదలైన ఈ భవనం ఎత్తు 228 మీటర్లు కాగా ఫ్లోర్‌కు ఒకటే అపార్ట్‌మెంట్ ఉంటుంది. మొత్తం 6,565 చదరపు అడుగులు, 6,999 చ.అ., 8,811 చ.అ.లలో అపార్ట్‌మెంట్ విస్తీర్ణాలుండనున్నాయి. ఇప్పటికే ధర చదరపు అడుగుకు రూ.8,950గా నిర్ణయించగా.. 60–70 యూనిట్లు విక్రయాలు కూడా పూర్తయిందని సాస్ ఇన్‌ఫ్రా (SAS Infra) ప్రతినిధి ఒకరు తెలిపారు.
2025 తొలి త్రైమాసికం నాటికి నిర్మాణం పూర్తి కానున్న ఈ ప్రాజెక్టుతో హైదరాబాద్ నిర్మాణ రంగంలో మరో మెట్టు ఎదిగినగట్లుగా భావిస్తున్నామని నిర్మాణ రంగ నిపుణులు చెప్తున్నారు. కాగా ఇదే సంస్థ ఓఆర్‌ఆర్ టోల్‌ప్లాజా సమీపంలో జీ+42 అంతస్తులలో మరొక ప్రాజెక్ట్ కూడా చేపట్టనున్నట్లు వెల్లడించింది. సాధారణ అపార్ట్మెంట్లతో పోలిస్తే ఈ హైరైజ్ భవనాల నిర్మాణాలపై ప్రభుత్వ పర్యవేక్షణ కూడా ఉండాలని ఈ రంగంలో నిపుణులు అభిప్రాయపడుతున్నారు.