హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ టౌన్‌షిప్స్ నిర్మాణంపై సర్కార్ ఫోకస్

Telangana Govt focus on Satellite Townships in Hyderabad details here
Satellite Township: హైదరాబాద్ సిటీ రోజురోజుకు విస్తరిస్తోంది. ఇప్పటికే నగరం కోటిన్నర జనాభాను క్రాస్ చేసింది. అభివృద్ధిలో భాగంగా ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నా ట్రాఫిక్‌తోపాటు కొన్ని ఇబ్బందులు భాగ్యనగరాన్ని వెంటాడుతున్నాయి. దీంతో హైదరాబాద్‌పై ఒత్తిడి తగ్గించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. భాగ్యనగరం భవిష్యత్ విస్తరణను దృష్టిలో పెట్టుకొని… హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ టౌన్‌షిప్స్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తుంది. రంగారెడ్డి జిల్లా ఫార్మాసిటీ ప్రాంతంలో మెగా టౌన్‌షిప్స్ నిర్మాణంపై ఫోకస్ చేయాలని సర్కార్ డిసైడ్ అయింది.
హైదరాబాద్‌లో ప్రస్తుతం కోటిన్నర జనాభా నివసిస్తున్నారు. ఈ సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉండగా.. సిటీ కూడా ఇంకా విస్తరిస్తోంది. అందుకు తగ్గట్టుగా నగరం చుట్టూ మౌలిక వసతులు కల్పిస్తున్నాయి ప్రభుత్వాలు. హైదరాబాద్‌లో కొన్ని ప్రాంతాలు అనుకున్నదానికంటే ఎక్కువగా అభివృద్ధి చెందగా.. మరికొన్ని ప్రాంతాలు అభివృద్ధికి కాస్త దూరంగా ఉన్నాయి. దీంతో సిటీ నలువైపులా అభివృద్ధి చేసేలా కొంతకాలంగా ప్రణాళికలు జరుగుతున్నాయి. అందులో భాగంగా గత ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో భూములు సేకరించి అన్ని సౌకర్యాలతో లేఅవుట్లు ఏర్పాటు చేసింది.
ఫార్మాసిటీ ప్రాంతంలో మెగా టౌన్‌షిప్స్
భవిష్యత్‌లో హైదరాబాద్‌లో జనాభా పెరిగి తీవ్ర స్థాయిలో ట్రాఫిక్ ఇబ్బందులకు తోడు మౌలిక వసతుల కల్పన అసాధ్యంగా మారే అవకాశముంది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కొత్త ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేయాలని భావిస్తోంది. దీని ద్వారా నగరంలో జీవనశైలి మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఒకేచోట అభివృద్ధంతా కేంద్రీకృతం కాకుండా ప్రాంతాల వారీగా జరుగుతోందనేది ఆలోచన. హైదరాబాద్‌లో ఎదురవుతున్న సమస్యలను గుర్తించిన కొత్త సర్కార్ వాటికి శాశ్వత పరిష్కారాన్ని చూపించేలా ఈ శాటిలైట్ టౌన్‌షిప్‌లపై ఫోకస్ పెట్టింది. రంగారెడ్డి జిల్లా ఫార్మాసిటీ ప్రాంతంలో మెగా టౌన్‌షిప్స్ నిర్మాణంపై దృష్టిపెట్టాలని సర్కార్ డిసైడ్ అయింది.
Also Read: హైదరాబాద్ నలువైపులా రియల్ ఎస్టేట్ జోష్.. నార్త్ లో తగ్గేదేలే అంటోన్న నిర్మాణ రంగం
సిటీకి నాలుగు దిక్కుల ప్రత్యేక టౌన్‌షిప్స్
ఔటర్ రింగ్‌రోడ్, రీజినల్ రింగ్‌రోడ్ మధ్యలో అన్ని సౌకర్యాలతో శాటిలైట్ టౌన్‌షిప్స్ ఏర్పాటు చేయడం ద్వారా హైదరాబాద్‌పై జనాభా ఒత్తిడి తగ్గుతోందని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మేడ్చల్, సంగారెడ్డి, షాద్‌నగర్, ఘట్‌కేసర్ ఇలా సిటీకి నాలుగు దిక్కుల అన్ని వసతులు కల్పించి ప్రత్యేక టౌన్‌షిప్స్ ఏర్పాటు చేస్తే మరింత మంచిదని చెబుతున్నారు. ఉపాధి కోసం ఏటా నగరానికి లక్షలాది మంది వలస వస్తుంటారు. అలా సిటీకి వలసలు పెరగకుండా శివారు ప్రాంతాల్లోనే ఉపాధి కల్పించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచిస్తున్నారు. స్కూల్స్, ఆసుపత్రులు, క్రీడామైదానాలు వంటి సౌకర్యాలను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇలా చేస్తే సిటీపై జనాభా భారం తగ్గడంతోపాటు బెంగళూర్, ఢిల్లీ మాదిరిగా ట్రాఫిక్ కాలుష్యం సమస్యలను ఎదుర్కొనే అవకాశముంటుందని అడ్వైస్ ఇస్తున్నారు.