Union Budget 2026 : 10ఏళ్లుగా నిరీక్షణ.. ఈసారి మిడిల్ క్లాసుకు బిగ్ రిలీఫ్..సెక్షన్ 80C పరిమితి రూ. 3 లక్షలకు పెంపు? హోం లోన్లపై టాక్స్..!
Union Budget 2026 : వ్యక్తిగత ఆదాయ పన్నుపై మధ్యతరగతి, పన్నుచెల్లింపుదారులకు ఈసారి బడ్జెట్ 2026లో ఉపశమనం ఉంటుందా? సెక్షన్ 80C లిమిట్ రూ. 3 లక్షలకు పెంచుతారా? పూర్తి వివరాలివే..
Union Budget 2026 to finally hike 80C limit to Rs 3 lakh
- 10 ఏళ్లుగా సెక్షన్ 80C పరిమితిలో ఎలాంటి మార్పు లేదు
- సెక్షన్ 80C లిమిట్ ఈసారి రూ. 3 లక్షలకు పెంచే ఛాన్స్
- మధ్యతరగతి పన్నుచెల్లింపుదారులకు దక్కని ఊరట
- ఈసారి 2026 బడ్జెట్‌లో పర్సనల్ టాక్స్ పరిమితి పెంచే అవకాశం
- హోం లోన్లపై కూడా టాక్స్ బెనిఫిట్స్ అందించే అవకాశం
Union Budget 2026 : పన్నుచెల్లింపుదారులు, మధ్యతరగతివారి 10ఏళ్ల నిరీక్షణకు అతి త్వరలోనే తెరపడనుంది. రాబోయే వార్షిక బడ్జెట్ 2026లో ముఖ్యంగా మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్ సందర్భంగా మధ్యతరగతి పన్నుచెల్లింపుదారులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. వాస్తవానికి, పాత పన్ను విధానం కింద సెక్షన్ 80C పరిమితిని గత 10 ఏళ్లుగా పెంచకుండా అలానే ఉంది.
ఈసారి బడ్జెట్‌లోనైనా 80C పరిమితిని పెంచుతారని ప్రస్తుతం కన్నా రూ.3 లక్షలు చేస్తారని గంపెడు ఆశలు పెట్టుకున్నారు సామాన్య జనం. అదేవిధంగా, హోం లోన్లపై కూడా టాక్స్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా రాబోయే బడ్జెట్ కు సంబంధించి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయా? అని ఎదురుచూస్తున్నారు. 2026 వార్షిక బడ్జెట్ కు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
పర్సనల్ టాక్స్.. ప్రతి ఏడాదిలో బడ్జెట్‌కు ముందు ఇదే ఎక్కువగా వినిపిస్తుంటుంది. పాత పన్ను విధానంలో కొనసాగే పన్నుచెల్లింపుదారులు కూడా వ్యక్తిగత ఆదాయపన్ను గురించే డిమాండ్ చేస్తున్నారు.
పన్ను మినహాయింపులను పదేళ్లుగా మార్చకుండా అలానే కొనసాగిస్తున్నారని, ఈసారైనా బడ్జెట్‌లో తప్పకుండా పన్ను ప్రయోజనాలను అందించాలని కోరుతున్నారు. దీని ద్వారా ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80C, సెక్షన్ 80D, హోమ్ లోన్ వడ్డీ పన్ను వంటి బెనిఫిట్స్ పొందవచ్చు.
ఈ పన్ను ప్రయోజనాలను 10ఏళ్లలో ఒక్కసారిగా కూడా మార్చలేదని అంటున్నారు. ఒకవైపు నిత్యావసర ధరలు పెరిగిపోతున్న క్రమంలో ఖర్చులకు తగ్గట్టుగా ఆయా సెక్షన్లను పెంచి పన్ను మినహాయింపు అందించాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే సెక్షన్ 80C, 80D పరిమితి పెంపు అంశం మరోసారి చర్చకు తెరలేపింది.
పదేళ్లుగా ఎలాంటి ఉపశమనం లేదు. ఈ బడ్జెట్ సమయంలోనైనా రెండు సెక్షన్ల మినహాయింపుల పరిమితిని పెంచుతారని పన్నుచెల్లింపుదారులు భావిస్తున్నారు. ప్రత్యేకించి మిడిల్ క్లాస్ పన్నుచెల్లింపుదారులకు ఈ పరిమితి పెంపు భారీగా ప్రయోజనాలను అందించనుంది.
ఇప్పటికే కొత్త పన్ను విధానం అమల్లోకి వచ్చినప్పటికీ చాలామంది పన్నుచెల్లింపుదారులను కొత్త పన్ను విధానానికి మారేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు.
సెక్షన్ 80C పరిమితి రూ.3 లక్షలు పెంపు? :
సాధారణంగా, సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు బెనిఫిట్స్ ప్రత్యేకించి పన్నుచెల్లింపుదారులకు దక్కుతుంది. ఇందులో లైఫ్ ఇన్సూరెన్స్, ప్రావిడెంట్ ఫండ్, ఈఎల్ఎస్ఎస్ పెట్టుబడులు, ట్యూషన్ ఫీజులు, హోమ్ లోన్ పేమెంట్లు ఉంటాయి.
అంటే.. ప్రతి ఏడాదిలో రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది. లాస్ట్ టైమ్ 2014లో ఈ పరిమితిని పెంచగా ఆ తర్వాత ఇప్పటివరకూ ఎలాంటి పరిమితిని పెంచలేదు. అందుకే ఈసారి బడ్జెట్ సందర్భంగా ప్రస్తుత ధరలకు తగినట్టుగా సెక్షన్ 80C లిమిట్ రూ.3 లక్షలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
సెక్షన్ 80D పరిమితి పెంపు? :
హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటుంది. అది సెక్షన్ 80Dలో వర్తిస్తుంది. ఈ సెక్షన్ పరిమితిపై గత పదేళ్లుగా ఎలాంటి మార్పు చేయలేదు. ఈ 80D సెక్షన్ ద్వారా వ్యక్తిగతంగా రూ.25వేలు, సీనియర్ సిటిజన్లకు రూ.50 వేల వరకు మాత్రమే డిడక్షన్లు అందుబాటులో ఉంటాయి. చివరి సారిగా 2015లో ఈ లిమిట్ మార్చారు. ఈసారి 2026 బడ్జెట్ సమయంలో ఈ పరిమితిని పెంచాలనే డిమాండ్ వినిపిస్తోంది.
హోమ్ లోన్ వడ్డీ మినహాయింపులివే :
హోం లోన్లతో కొత్త ఇల్లు కొంటే.. సెక్షన్ 24(B)తో వడ్డీపై రూ.2 లక్షల వరకు మినహాయింపు పొందవచ్చు. 2014 నుంచి ఇదే మినహాయింపు ఉంది. అప్పటినుంచి ఇంటి వాల్యూ, హోమ్ లోన్ లిమిట్ పెరిగినా వడ్డీ ట్యాక్స్ మినహాయింపు మాత్రం అలానే ఉంచింది ప్రభుత్వం.
ఈసారి 2026 బడ్జెట్ సందర్భంగా ఈ పరిమితి పెంచాలని లోన్ తీసుకున్నవాళ్లు, పన్నుచెల్లింపుదారులు గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. ఫస్ట్ టైమ్ ఇల్లు కొనేవారికి సెక్షన్ 80EE, సెక్షన్ 80EEA వంటివి అమల్లోకి తీసుకొచ్చిన ప్రభుత్వం పన్నుచెల్లింపుదారులకు మరిన్ని బెనిఫిట్స్ అందిస్తోంది.
