బంగారం, వెండి ధరలకు కళ్లెం వేస్తారా? కేంద్ర బడ్జెట్‌లో ఏం జరగనుంది?
ఎస్‌ఈపీఏ తర్వాత కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల నుంచి బులియన్‌ను తప్పించాలని, రాబోయే వాణిజ్య ఒప్పందాల్లో కూడా బంగారం, వెండిని తక్కువ సుంకాల విధానాల నుంచి మినహాయించాలని పరిశ్రమ ఆశిస్తోందని సమిత్ గుహా చెప్పారు.
Nirmala sitharaman (Image Credit To Original Source)
- సుంకాల్లో తేడాతో దేశీయ రిఫైనర్ల పోటీతత్వంపై తీవ్ర ప్రభావం
- స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల నుంచి బులియన్‌ను తప్పించాలి
- కేంద్రానికి విలువైన లోహాల రిఫైనింగ్ రంగ సంస్థల విజ్ఞప్తి
Union Budget 2026: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మరికొన్ని రోజుల్లో పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే భారత విలువైన లోహాల రిఫైనింగ్ రంగ సంస్థలు నిర్మలా సీతారామన్‌కు తమ అంచనాలను వెల్లడించాయి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ద్వారా స్థానిక రిఫైనర్లతో పోల్చితే దిగుమతిదారులకు అనుకూలంగా ఉన్న ప్రస్తుత సుంకాల పద్ధతి నుంచి ఉపశమనం కావాలని ఈ రంగం కోరుతోంది.
మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్-ప్రెషియస్ మెటల్స్ అడ్‌వాన్స్‌డ్ రిఫైనింగ్ ప్రోగ్రామ్ (MMTC-PAMP) మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో సమిత్ గుహా దీనిపై మాట్లాడుతూ.. సుంకాల్లో తేడా దేశీయ రిఫైనర్ల పోటీతత్వంపై తీవ్ర ప్రభావం చూపుతోందని, ఈ సమస్యపై ప్రభుత్వానికి అవగాహన ఉందని చెప్పారు. విలువైన లోహాల రిఫైనింగ్ రంగం మొత్తం ఈ సుంక వ్యత్యాసాన్ని ఎదుర్కొంటోందని, ప్రత్యేకంగా ఎస్‌ఈపీఏ మార్గంలో డోర్ రూపంలో లభించే లోహం సుంకాలు, శుద్ధి చేసిన బులియన్ దిగుమతి సుంకాల మధ్య తేడా స్పష్టంగా ఉందని తెలిపారు.
ఇక్కడ ఎస్‌ఈపీఏ అంటే సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం. ఒక దేశంతో భారత్ కుదుర్చుకునే వాణిజ్య ఒప్పందం ఇది. దీనివల్ల రెండు దేశాల మధ్య దిగుమతి-ఎగుమతులపై సుంకాలు తగ్గింపు, వాణిజ్య సౌలభ్యాల మెరుగుదల సాధ్యమవుతుంది.
అలాగే, డోర్ దిగుమతులు అంటే ఇంకా పూర్తిగా శుద్ధికాని బంగారం లేదా వెండి మిశ్రమాన్ని విదేశాల నుంచి దిగుమతి చేయడం. ఈ డోర్ లోహాన్ని దేశీయ రిఫైనరీల్లో శుద్ధి చేసి స్వచ్ఛమైన బంగారం లేదా వెండిగా మారుస్తారు.
ఏ రకమైన ఉపశమనం కావాలి?
ఎస్‌ఈపీఏ తర్వాత కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల నుంచి బులియన్‌ను తప్పించాలని, రాబోయే వాణిజ్య ఒప్పందాల్లో కూడా బంగారం, వెండిని తక్కువ సుంకాల విధానాల నుంచి మినహాయించాలని పరిశ్రమ ఆశిస్తోందని సమిత్ గుహా చెప్పారు. భారత్ రిఫైనింగ్ సామర్థ్యాన్ని పెంచేందుకు లక్ష్యిత విధాన మద్దతు అవసరమని, లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ గుర్తింపు పొందిన రిఫైనరీల సంఖ్య పెరగాలని ఆయన సూచించారు.
వాణిజ్య ఒప్పందాల కింద సుంకాల తేడాల ద్వారా లేదా ప్రస్తుతం ఉన్న తేడాను విస్తరించడం ద్వారా ఇన్‌పుట్ ఆధారిత ప్రోత్సాహకాలు ఇవ్వవచ్చని సమిత్ గుహా అభిప్రాయపడ్డారు.
“ఇన్‌పుట్ సంబంధిత ప్రయోజనాల రూపంలో, సుంకాల తేడాల రూపంలో ప్రభుత్వం ఏం చేయగలదో పరిశీలించాలని కోరుతున్నాం. ఇది స్థానిక రిఫైనర్లు రిఫైనరీలపై పెట్టుబడులు పెట్టేందుకు, పెట్టుబడిపై రాబడులు సాధించేందుకు, ప్రపంచ స్థాయిలో రిఫైనింగ్ సామర్థ్యం పెంచేందుకు దోహదపడుతుంది” అని గుహా అన్నారు.
ప్రస్తుతం డోర్ దిగుమతులపై బంగారం, వెండి రెండింటికీ 6% సుంకం ఉంది. రిఫైనర్లకు 0.65% తేడా లభిస్తుండటంతో ప్రభావిత సుంక రేటు 5.35%గా మారుతోంది. ఎమ్‌ఎమ్‌టీసీ-పాంప్ ప్రధానంగా రిఫైనింగ్ ఉద్దేశంతో బంగారాన్ని డోర్ రూపంలో దిగుమతి చేస్తోంది. సంప్రదాయంగా బంగారం, వెండి దిగుమతులు 1:1 నిష్పత్తిలో ఉండేవి.
అయితే 2024–25 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ సుమారు 40 టన్నుల బంగారం, 50 టన్నుల వెండిని దిగుమతి చేసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-డిసెంబర్ కాలంలో బంగారం దిగుమతులు 36 టన్నులుగా, వెండి దిగుమతులు 60 టన్నులుగా ఉన్నాయని గుహా తెలిపారు. వెండిపై బలమైన డిమాండ్ కనిపిస్తోందని చెప్పారు.
