యువతిని వేధిస్తున్న లెక్చరర్ అరెస్ట్

పాఠాలు చెప్పి పది మందికి ఆదర్శంగా నిలవాల్సిన గురువు ప్రేమ పాఠాలు చెప్పి యువతిని మోసం చేశాడు. పెళ్లి కాలేదని అబద్దం చేప్పి నిశ్చితార్ధం చేసుకుని వారి వద్ద రెండు లక్షలు కాజేశాడు. విషయం తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసి అరెస్ట్ చేయిస్తే… బెయిల్ పై వచ్చి యువతిని బెదిరిస్తున్నాడు.
గుంటూరు స్తంభాల గరువు ఎల్ఐసీ కాలనీ ఒకటో లైను కు చెందిన చిలికా శ్రీనివాసరావు బ్రాడీపేటలో ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. అతడికి గతంలోనే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఓ బీఈడీ కళాశాలలో చదివే యువతి ఇంగ్లీషు కోచింగ్ కోసం శ్రీనివాస రావు దగ్గర చేరింది.
ఇంగ్లీషు నేర్పిస్తున్నశ్రీనివాసరావు ఆ యువతికి ప్రేమ పాఠాలు కూడా చెప్పటం ప్రారంభించాడు. క్రమంగా ఆమె పెద్దలను కూడా కలిసి వారిని నమ్మించి ఆమెతో నిశ్చితార్ధం చేసుకుని వారి వద్దనుంచి రూ.2లక్షలు తీసుకున్నాడు. అనంతరం తాను వివాహితుడనని నిజం చెప్పి పెళ్లి చేసుకోటానికి నిరాకరించాడు. ఈలోగా యువతిని శారీరకంగా మానసికంగా వేధించాడు.
మోసపోయిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపి శ్రీనివాసరావును అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. ఇటీవల బెయిల్ పై బయటకు వచ్చిన శ్రీనివాసరావు తిరిగి యువతిని వేధించటం మొదలు పెట్టాడు.
ఆమె పుట్టిన రోజునాడు కేకు కట్ చేసి ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టటం, పెళ్లి చేసుకోమని వేధించటం మొదలెట్టాడు. ఆమె ఇంటికి వెళ్లి తల్లి ,కూతుళ్ళను దుర్భాషలాడి వచ్చాడు. యువతికి పెళ్లికాకుండా చేస్తానని హెచ్చరించి వచ్చాడు. యువతి ఫిర్యాదుతో అరండల్ పేట పోలీసులు మళ్లీ శ్రీనివాసరావును అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.