కరోనా భయంతో దంపతులు ఆత్మహత్య

couple commit suicide due to corona fear : కరోనా పాజిటివ్ భయంతో దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాలో కలకలం రేపుతోంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గి..రికవరీ రేటు పెరిగినా కరోనా భయం మాత్ర ప్రజలను వెంటాడుతూనే ఉంది. కరోనా పేరు వింటేనే జనం భయంతో వణికిపోతున్నారు.
కరీంనగర్ జిల్లా జగిత్యాల లోని శివ వీధిలో నివాసం ఉండే గంజి రాంబాబు(49) లావణ్య(47) దంపతులు గురువారం ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరి ఆత్మహత్యకు కారణాలు స్పష్టంగా తెలియనప్పటికీ కరోనా వైరస్ ప్రభావం, ఆర్ధిక ఇబ్బందులు వీరి ఆత్మహత్యకు కారణంగా స్ధానికులు భావిస్తున్నారు.
ముంబైలోని యాడ్ ఏజెన్సీలో పనిచేసే రాంబాబు దంపతులు…అతడి తండ్రి రాజేశంకు అనారోగ్యం కారణంగా జగిత్యాలకు వచ్చారు. అనారోగ్యంతో ఉన్న తండ్రి 10 నెలల క్రితం మరణించటంతో అప్పటి నుంచి దంపతులు స్ధానికంగానే నివాసం ఉంటున్నారు.
రాంబాబుకు మూడు రోజుల క్రితం కరోనా లక్షణాలు కనిపించాయి. పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ నిర్ణారణ అయ్యింది. అప్పటి నుంచి దంపతులు ఇంట్లో నుంచి బయటకు రాలేదని చుట్టు పక్కల వారు తెలిపారు. ఈక్రమంలో లావణ్య కూడా గురువారం కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ తేలింది. ఈవిషయాన్ని ఆమె చొప్పదండి మండలం అర్నకొండలోని తన తల్లితండ్రులకు ఫోన్ చేసి చెప్పింది.
కరీంనగర్ లో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటామని వారికి తెలిపింది. దీంతో వారి బంధువులు కరీంనగర్ లో ఆమె చెప్పిన ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. అయితే ఎంత సేపటికి లావణ్య, రాంబాబు అక్కడకు చేరుకోక పోవటంతో వారిని సంప్రదించేందుకు ఫోన్ చేయగా…ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో వారు జగిత్యాల లోని లావణ్య ఇంటికి బయలు దేరి వచ్చారు.
ఇంటికి వచ్చే చూసేసరికి దంపతులు ఇద్దరూ అప్పటికే ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని కనిపించారు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు మృత దేహాలను గురువారం రాత్రి 11 గంటల సమయంలో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
కాగా… కరోనా పాజిటివ్ సమయంలో తలెత్తిన ఆర్ధిక ఇబ్బందులు కూడా దంపతులు ఆత్మ హత్యకు కారణమని బంధువులు చెపుతున్నారు. 10నెలల క్రితం తండ్రి అనారోగ్యం…మరణంతో జగిత్యాల లోనే స్ధిరపడిన రాంబాబాబు దంపతలకు కరోనా కాలంలో కష్టాలు మొదలయ్యాయి. ముంబై లో యాడ్ ఏజెన్సీలో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి వచ్చేయటంతో ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నారు.
కష్టాల నుంచి బయట పడటానికి తాము ఉంటున్నఇంటిని సైతం అమ్మాటానికి ప్రయత్నాలు చేయగా…. తన సోదరులతో రాంబాబుకు గొడవలు జరిగినట్లు తెలిసింది. అదే సమయంలో కరోనా పాజిటివ్ సోకటం..ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండటం వాటి వల్ల తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. మరో వైపు పెళ్లైనా వీరికి సంతానం కలగలేదనే బాధ కూడా వీరిని మరింత కుంగ తీసినట్లు బంధువులు చెపుతున్నారు.