ఏడు గంటల హింస, రక్తపు మరకలు తుడవమంటూ…

Sathankulam lockup death case, forensic report father son brutally tortured : తమిళనాడులో సంచలనం సృష్టించిన సత్తాన్ కులం లాక్ అప్ డెత్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) తన నివేదికను మద్రాస్ హైకోర్టుకు సమర్పించింది. ‘‘రిజల్ట్స్ ఆఫ్ లాబొరేటరి అనాలిసిస్’’ పేరిట రూపొందించిన ఫోరెన్సిక్ రిపోర్టును మధురై ధర్మాసనానికి సమర్పించింది.
సత్తాన్‌కులం లాకప్, టాయిలెట్, ఎస్‌హెచ్‌ఓ గదిలోని గోడలపై సేకరించిన రక్త నమూనాలు, మృతుల డీఎన్‌ఏతో సరిపోయినట్లు సీబీఐ తన నివేదికలో వెల్లడించింది. ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరి నిపుణులు ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు పేర్కొంది.
లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి సమీపంలోని సత్తాన్‌కుళానికి చెందిన తండ్రీకొడుకులు జయరాజ్(59), బెనిక్స్(31)లను 19.06.2020 రోజున సాయంత్రం అరెస్టు చేసిన పోలీసులు..అత్యంత దారుణంగా చిత్రహింసలకు గురిచేశారు. పోలీసులు పెట్టిన చిత్రహింసల వల్లే తండ్రీ కొడుకులిద్దరూ మరణించారని ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో ఈ కేసు సీబీఐకి అప్పగించారు.
https://10tv.in/sensational-twist-in-shamirpet-boy-death-case/
19.06.2020 సాయంత్రం, రాత్రి జయరాజ్, బెనిక్స్ లను పోలీసులు తీవ్రంగా కొట్టటం వల్లే వారి మరణానికి దారితీసిందని సీబీఐ స్పృష్టం చేసింది. బాధితులను తీవ్రంగా హింసించడమే గాకుండా, గాయాల వల్ల వారి శరీరం నుంచి కారిన రక్తం నేలపై పడిన దానిని కూడా వారి దుస్తులతోనే శుభ్రం చేయాలంటూ పోలీసులు అత్యంత పాశవికంగా ప్రవర్తించారని పేర్కొంది. ఇక కోవిల్‌పట్టి మెజిస్ట్రేట్ విచారణ, పోస్ట్‌మార్టం నివేదికలు కూడా ఇదే అంశాన్ని వెల్లడించినట్లు చార్జిషీట్‌లో పొందుపరిచింది.
ఆరోజు ఏం జరిగింది …
సీబీఐ నివేదికలోని వివరాల ప్రకారం.. జూన్ 19న ఎస్సై బాలక్రిష్ణన్, ఇన్‌స్పెక్టర్ ఎస్ శ్రీధర్, కానిస్టేబుల్ ఎం ముత్తురాజాతో పాటు మరికొంత మంది పోలీసులు కామరాజార్ చౌక్ వద్ద లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో జయరాజ్‌ను అరెస్టు చేశారు.
ఈ విషయం తెలుసుకున్న జయరాజ్ కుమారుడు బెనిక్స్ వెంటనే సత్తాన్ కులం పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. అక్కడ పోలీసులు తన తండ్రిని కొట్టటం చూసిన బెనిక్స్ …..తన తండ్రిని ఎందుకు కొడుతున్నారంటూ ఎస్సై బాలక్రిష్ణన్‌ను ప్రశ్నించాడు. దీంతో కోపోద్రిక్తులైన పోలీసులు అతడిపై కూడా దాడి చేయడం మొదలుపెట్టారు.
పోలీసు దెబ్బలనుంచి తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో కానిస్టేబుల్‌ను బెనిక్స్ నెట్టివేయడంతో మరింతగా రెచ్చిపోయారు. పోలీసులపై చేయి ఎత్తినందుకు తగిన గుణపాఠం చెబుతామంటూ బెనిక్స్‌ను తీవ్రంగా కొట్టారు. అలా కొన్ని గంటలపాటు జయరాజ్, బెనిక్స్‌లను చిత్ర హింసలకు గురి చేశారు. ఆ తర్వాత వారిద్దరి దుస్తులు విప్పించి, మళ్లీ కొట్టడం ప్రారంభించారు.
చెక్కబల్లపై వారిని పడుకోబెట్టి, కాళ్లూ, చేతులూ వెనక్కి మడిచి పెట్టి లాఠీలతో తీవ్రంగా కొట్టారు. తమను విడిచిపెట్టాలని ఎంతగా ప్రాధేయపడినా పోలీసులు కనికరం చూపలేదు. తీవ్రమైన గాయాల వల్లే వీరిద్దరు మృతి చెందినట్లు పోస్ట్‌మార్టం నివేదిక కూడా స్పష్టం చేస్తోంది. పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం బెనిక్స్ ఒంటిపై 13 గాయాలు, జయరాజ్ శరీరంపై 17 గాయాలు ఉన్నట్లు కోర్టుకు తెలిపింది.
ఈ నేపథ్యంలో అనేక పరిణామాల అనంతరం ఈ కేసు సీబీఐ చేతికి వచ్చింది. ఈ క్రమంలో జూలై 7న సీబీఐ రెండు కేసులు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేపట్టింది. సత్తాన్‌కులం పోలీస్ స్టేషన్ హౌజ్ ఇన్‌చార్జ్ సహా తొమ్మిది మంది పోలీసుల పేర్లను అభియోగపత్రంలో చేర్చింది.
ఎస్ శ్రీధర్, కె.బాలకృష్ణ, పి.రఘుగణేష్, ఏఎస్ మురుగన్, ఎ. సమదురై, ఏఎమ్ ముత్తురాజ, ఎస్. చెల్లాదురై, థామస్ ఫ్రాన్సిస్, ఎస్.వేల్‌ముత్తు తదితరులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. కాగా ఈ కేసులో అరెస్టైన స్పెషల్ సబ్ ఇన్స్‌పెక్టర్ పాల్‌దురై సెప్టెంబర్ నెలలో కరోనాతో మృతి చెందారు.