జిమ్ ట్రైనర్‌కు జీవితఖైదీ : 9ఏళ్ల తర్వాత ఢిల్లీ టెకీ ఫ్యామిలీకి న్యాయం

బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ హత్య కేసులో 9ఏళ్ల తర్వాత మిస్టరీ వీడింది. పాయల్ సురేఖ అనే 29ఏళ్ల టెకీని ఆమె జిమ్ ట్రైనర్ జేమ్స్ రాయ్ అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన అప్పట్లో సంచలనం రేపింది. ఈ కేసుపై విచారణ అనంతరం నిందితుడు జేమ్స్ కు స్పెషల్ సీబీఐ కోర్టు జీవిత ఖైదు విధించింది. మృతురాలు సురేఖను నిందితుడు జేమ్స్.. 23 సార్లు కత్తితో పొడిచి హత్య చేశాడు. పాయల్ భర్త అనంత నారాయణ మిశ్రా నడిపే ఫిట్ నెస్ సెంటర్ లో జేమ్స్ ట్రైనర్ గా పనిచేస్తున్నాడు. జిమ్ లో మహిళా కస్టమర్లతో అసభ్యప్రవర్తనతో పాటు ఆర్థిక విషయాల్లో అతడిపై ఆరోపణలు వచ్చాయి.
దీంతో అతడ్ని ఫిట్ నెస్ సెంటర్ నుంచి తొలగించారు. ఈ క్రమంలో డెల్ కంపెనీలో టెక్నికల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న పాయల్ ను జేమ్స్ నిందించాడు. ఆమెను చంపేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించాడు. జేపీ నగర్ లోని తన అపార్ట్ మెంట్లో పాయల్ ను కత్తితో పలుమార్లు పొడిచి చంపాడు. జేపీ నగర్ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎస్కే ఉమేశ్.. నిందితుడు జేమ్స్ ను అరెస్ట్ చేశాడు. అతడి దగ్గర నుంచి కత్తితో పాటు కళ్లజోడు జతను స్వాధీనం చేసుకున్నారు. తనను ఉద్యోగంలో నుంచి తీసేసారనే కోపంతో పాయల్ పై జేమ్స్ కక్ష పెంచుకున్నాడు.
అప్పటినుంచి ఆమెను చంపేస్తానంటూ బెదిరించినట్టు పోలీసు అధికారి ఉమేశ్ తెలిపారు. 2010లో జరిగిన ఈ దారుణ హత్య అప్పట్లో నగరాన్ని వణికించింది. ఈ కేసు విషయంలో ముందుగా పాయల్ కుటుంబ సభ్యులు ఆమె భర్త అనంత హత్య చేశాడని ఆరోపించారు. ఈ కేసు విచారణలో బెంగళూరు పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. ఎన్నో మలుపులు తిరిగింది. చివరికి అసలు దోషి ట్రైనర్ జేమ్స్ అని తేలడంతో అతడికి సీబీఐ కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. ఎట్టకేలకు పాయల్ కుటుంబానికి న్యాయం జరిగింది.