Matti Pavan Kumar : మట్టి పవన్ కుమార్ కేసులో కోర్టు సంచలన తీర్పు.. ఆ ఐదుగురికి జీవిత ఖైదు.. కేసులో కీలకంగా మారిన ఆ వీడియోలు..
కోర్టు తీర్పు పట్ల పవన్ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. దాదాపు మూడేళ్లుగా చేస్తున్న తమ పోరాటానికి విజయం దక్కిందన్నారు.

Matti Pavan Kumar : స్నేహితులే అతి కిరాతకంగా చంపేశారు. అంతేకాదు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. తమకు ఎవరైనా ఎదురు చెబితే ఇదే గతి అన్నట్లు రెచ్చిపోయారు. అయితే, ఇప్పుడు అవే వీడియోలు వారిని జీవిత ఖైదీలుగా మార్చాయి. ప్రత్యక్ష సాక్ష్యులు లేకపోయినా ఆ వీడియోలే కోర్టులో సాక్షి నిలిచాయి. ఆ తల్లిదండ్రులు మూడేళ్ల పోరాటానికి విముక్తి కల్పించాయి. కొడుకు కేసులో న్యాయం జరిగేందుకు బాసటగా నిలిచాయి.
అనంతపురం జిల్లా నార్పలలో 2022 ఏప్రిల్ 12న జరిగిన మట్టి పవన్ కుమార్ కేసులో ఐదుగురికి(షాజిద్, సి. రమేశ్, సి. నాగేంద్ర, తలారి సుధాకర్, తలారి అరుణ్) జీవిత ఖైదు విధిస్తూ జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది. నార్పలకు చెందిన పవన్ కుమార్ కు అతడి స్నేహితుల మధ్య గొడవ జరిగింది. అది తీవ్రం కావడంతో పవన్ ను లేపేయాలని నిర్ణయించుకున్నారు. అనంతరం పవన్ ను చంపి వీడియో తీశారు. అంతేకాదు వాటిని సోషల్ మీడియాలో పెట్టారు. ఈ కేసును విచారించిన కోర్టు.. ముద్దాయిలకు జీవిత ఖైదు విధించడంతో పాటు 20వేల రూపాయల చొప్పున జరిమానా విధించింది.
Also Read : వల్లభనేని వంశీకి మరో బిగ్ షాక్.. అక్రమాలపై సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం
మృతుడు పవన్ కుమార్ కుటుంబం నెల్లూరు నుంచి వచ్చి అనంతపురంలో ఉంటోంది. 2022 ఏప్రిల్ లో తన తండ్రితో కలిసి పవన్ కుమార్ నార్పలకు వెళ్లాడు. ఈ సందర్భంగా ఎదురుపడిన స్నేహితులతో గొడవ జరిగి అది హత్యకు దారి తీసింది. గొడవ పడ్డ రోజు రాత్రి పవన్ ను స్నేహితులు నార్పల తహశీల్దార్ కార్యాలయం వెనుకవైపునకు పిలిపించి ప్రాణం తీశారు.
ప్రాణం తీసే సమయంలో ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడమే కాకుండా తమను చూసి అందరూ భయపడాలి అంటూ మాట్లాడిన ఆడియో వైరల్ అయ్యింది. కోర్టులో వాదనలు జరుగుతున్న క్రమంలో ప్రధాన సాక్ష్యులు వెనక్కి తగ్గినా.. వీడియోల ఆధారంగా కేసుకు సంబంధించి అన్ని ఆధారాలను పోలీసులు కోర్టు ముందు ఉంచారు.
దీంతో ముద్దాయిలకు జీవిత కాలపు కఠిన కారాగార శిక్ష విధిస్తూ జిల్లా న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. మృతుడితో పాటు శిక్ష పడ్డ వారంతా 25 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం. తమ కుమారుడి మృతికి ఎట్టకేలకు న్యాయం జరిగిందని.. కోర్టు తీర్పు పట్ల పవన్ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. దాదాపు మూడేళ్లుగా చేస్తున్న తమ పోరాటానికి విజయం దక్కిందన్నారు.