Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి మరో బిగ్ షాక్.. అక్రమాలపై సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం

అక్రమ మైనింగ్ సహా వివిధ నేరాల్లో ప్రభుత్వానికి రూ.195 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం.

Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి మరో బిగ్ షాక్.. అక్రమాలపై సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం

Updated On : February 24, 2025 / 6:53 PM IST

Vallabhaneni Vamsi : ఇప్పటికే ఓ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరో బిగ్ షాక్. వంశీ అక్రమాలకు పాల్పడ్డారంటూ వచ్చిన ఆరోపణలపై విచారణకు సిట్ ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వంశీ పై అక్రమ మైనింగ్, భూకబ్జా ఆరోపణలు ఉన్నాయి. వీటిపై విచారణకు నలుగురితో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను నియమించింది సర్కార్.

ఏలూరు రేంజ్ ఐజీ జీవిజీ అశోక్ కుమార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటైంది. సభ్యులుగా ఏలూరు ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్, తూర్పుగోదావరి ఎస్పీ నరసింహ కిషోర్ లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై నమోదైన అక్రమ మైనింగ్, భూకబ్జాలు, ఆర్థిక నేరాలు, ఎక్స్ టార్షన్ పై సిట్ ఏర్పాటైంది. అక్రమ మైనింగ్ సహా వివిధ నేరాలల్లో ప్రభుత్వానికి రూ.195 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

Also Read : అసెంబ్లీ సమావేశాల వేళ వైఎస్ జగన్ సంచలన నిర్ణయం.. ఇకపై..

సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో కొన్నిరోజుల క్రితం వంశీని విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌లో ఆయనను అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. ఆయన ప్రస్తుతం విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వంశీపై పలు కేసులు ఉన్నాయి. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వంశీ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు ఇప్పటికే కొట్టివేయడం జరిగింది.

కిడ్నాప్ కేసులో ఇప్పటికే వంశీని మూడు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్ట్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. పోలీసులకు కోర్టు కొన్ని షరతులు విధించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే విచారించాలంది.

Also Read : ఇలాగైతే వైసీపీ నేతలు జర్మనీకి వెళ్లిపోవడం బెటర్.. ఎందుకంటే..: పవన్ కల్యాణ్ ఆసక్తికర కామెంట్స్

విజయవాడ లిమిట్స్ లోనే కస్టడీలోకి తీసుకొని విచారించాలని, న్యాయవాది సమక్షంలోనే విచారణ జరగాలని కోర్టు చెప్పింది. ఉదయం, సాయంత్రం మెడికల్ టెస్టులు నిర్వహించాలని ఆదేశించింది కోర్టు. అటు వెన్ను నొప్పితో ఇబ్బంది పడుతున్నానంటూ వంశీ వేసి పిటిషన్ పై స్పందించిన కోర్టు.. బెడ్‌ ఏర్పాటుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.