Drug Parcels Couriers : మీ పిల్లల పేరుతో ఇంటికి పార్సిల్స్ వస్తున్నాయా? తల్లిదండ్రులు బీ కేర్‌ఫుల్ అంటున్న పోలీసులు
మీ పిల్లల పేరుతో మీ ఇంటికి పార్సిల్స్ వస్తున్నాయా? మీకు తెలియకుండా వాటిని సీక్రెట్ గా ఓపెన్ చేస్తున్నారా? ఒక్కసారిగా మీ పిల్లల ప్రవర్తనలో తేడాలు కనిపిస్తున్నాయా? ఎవరితోనూ అంటీముట్టనట్టుగా ఉంటూ పరధాన్యంలో కనిపిస్తున్నారా? అయితే.. పేరెంట్స్.. బీ కేర్ ఫుల్.

Drug Parcels Couriers : మీ పిల్లల పేరుతో మీ ఇంటికి పార్సిల్స్ వస్తున్నాయా? మీకు తెలియకుండా వాటిని సీక్రెట్ గా ఓపెన్ చేస్తున్నారా? ఒక్కసారిగా మీ పిల్లల ప్రవర్తనలో తేడాలు కనిపిస్తున్నాయా? ఎవరితోనూ అంటీముట్టనట్టుగా ఉంటూ పరధాన్యంలో కనిపిస్తున్నారా? అయితే.. పేరెంట్స్.. బీ కేర్ ఫుల్. ఇప్పుడే మేల్కొండి. లేకపోతే మీ పిల్లలు మీకు దక్కరు. హైదరాబాద్ పోలీసులు చెప్పిన షాకింగ్ నిజాలు అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాయి. ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులను అలర్ట్ చేస్తున్నాయి.
డ్రగ్స్ దందాకు హైదరాబాద్ అడ్డాగా మారిందనే ఆరోపణలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. పోలీసులు ఎంత నిఘా పెట్టినా, చర్యలు చేపట్టినా మత్తు ప్రవాహం చాప కింద నీరులా నగరంలో విస్తరిస్తూనే ఉంది. పోలీసులు డేగ కళ్లతో నిఘా పెడుతున్నా, మత్తు ముఠాలు చిక్కకుండా కొత్త దారులు వెతుక్కుంటున్నాయి. యువతను డ్రగ్స్ రొంపిలోకి లాగుతున్నాయి. డార్క్ నెట్ వెబ్ సైట్స్ ద్వారా మొత్తం తతంగం నడిపిస్తున్నారు. మూడో కంటికి తెలియకుండా కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ను పార్సిల్స్ లో నేరుగా ఇంటికే కొరియర్ చేస్తున్నారు. ఇలాంటి ముఠా గుట్టు రట్టు చేశారు హైదరాబాద్ పోలీసులు. ఇదే ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది.
మూడు అంతర్ రాష్ట్ర డ్రగ్స్ ముఠాలను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో అంతర్ రాష్ట్ర డ్రగ్ పెడ్లర్ తో పాటు ఆరుగురు హైదరాబాద్ వాసులు అరెస్ట్ అయ్యారు. వారి నుంచి రూ.9లక్షల విలువ చేసే డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోవా, రాజస్తాన్, ఢిల్లీకి చెందిన డ్రగ్ పెడ్లర్స్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎల్ ఎస్ డీ, చరాస్, ఎండీఎంఏ డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా డార్క్ వెబ్ ద్వారా వేలాది మందికి మత్తు పదార్దాలను సప్లయ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ దందాలో పోలీసులకు చిక్కిన వారంతా ఉన్నత విద్యావంతులు, డబ్బున్న వారు కావడం షాక్ కు గురి చేస్తోంది. ఇంకా ఈ కేసులో ఎవరెవరు ఉన్నారు అనేదానిపై పూర్తి స్తాయిలో దర్యాఫ్తు కొనసాగుతోంది.
ఆన్ లైన్ లో ఇలా కూడా చేయొచ్చు అనేలా.. డ్రగ్స్ సప్లయ్ కోసం సరికొత్త పంథాలో బిజినెస్ చేస్తున్నారు. లావాదేవీల కోసం క్రిప్టో కరెన్సీ పద్దతిలో నగదును పంపించగా, డార్క్ వెబ్ సైట్ ద్వారా ఈ అంతర్ రాష్ట్ర ముఠా డ్రగ్స్ ను అమ్ముతోంది. ముందుగా వీరు డార్క్ వెబ్ లోకి వెళ్లి, అందులో యాప్ ద్వారా డ్రగ్స్ ను కొనుగోలు చేస్తారు. పేమెంట్ మొత్తం క్రిప్టో కరెన్సీలోనే జరుగుతుంది. చెప్పిన ప్లేస్ కు లోకల్ కొరియర్ల ద్వారా ఆర్డర్ ను డెలివరీ చేస్తారు. రిస్క్ తక్కువగా ఉండటంతో చదువుకున్న యువత ఈ మార్గాన్ని అనుసరిస్తోంది.
క్రిమినల్స్.. ఎంత పక్కాగా ప్లాన్ చేసినా కొన్నిసార్లు అడ్డంగా దొరికిపోవడం కామన్. తాజాగా అదే జరిగింది. ఈ డ్రగ్స్ ముఠాకు ప్రధాన సూత్రధారి నరేంద్ర ఆర్యా. ఇప్పటివరకు అతడు రూ.30లక్షలకు పైగా లావాదేవీలు చేశాడు. 450 మందికిపైగా కస్టమర్లు ఉన్నారు. డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ సప్లయ్ చేసి కొరియర్ ద్వారా పంపిస్తారు. పలు ఐడీలతో వీరు ఆపరేటింగ్ చేస్తున్నారు. ఫర్హాన్ మొహాద్ అన్సారీ అనే వ్యక్తి కూడా ఈ డ్రగ్స్ ముఠాలో కీలక పాత్రధారి. ఇతను కూడా ఇప్పటివరకు రూ.15లక్షల వరకు లావాదేవీలు చేశాడు.
రాష్ట్రంలోని చాలామంది యువత, ఉద్యోగులు డ్రగ్స్ బారిన పడుతున్నట్లు హైదరాబాద్ పోలీసులు తెలిపారు. ఈ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు అయిన క్రమంలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్.. పిల్లల తల్లిదండ్రులు కీలక హెచ్చరిక చేశారు. పిల్లల పేరుతో ఇంటికి వచ్చే కొరియర్స్, పార్సిల్స్ విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. పిల్లల పేరుతో ఏదైనా పార్సిల్ వస్తే కచ్చితంగా తల్లిదండ్రులే వాటిని ఓపెన్ చేయాలన్నారు. అందులో ఏముందో చెక్ చేసిన తర్వాతే పిల్లలకు ఇవ్వాలని సూచించారు సీపీ. ఎందుకంటే ఆన్ లైన్ పార్సిల్ సర్వీసుల ద్వారా ఎక్కువగా డ్రగ్స్ ఆర్డర్స్ వస్తున్నాయని సీపీ అన్నారు.
”రాష్ట్రంలో600 మంది డ్రగ్స్ వాడుతున్నారు. వీరంతా ఆన్ లైన్ లో డ్రగ్స్ ఆర్డర్ చేస్తున్నట్లు గుర్తించాము. వీరిలో ఎక్కువమంది బీటెక్ విద్యార్థులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులే ఉన్నారు. వారి వివరాలు బయటికి చెప్తే తల్లిదండ్రులు షాక్ అవుతారని వెల్లడించడం లేదు. పిల్లల పేరుతో ఇంటికొచ్చే కొరియర్స్ ను తల్లిదండ్రులే ఓపెన్ చేయాలి. అమెజాన్ వంటి సంస్థల నుంచి కూడా డ్రగ్స్ ఆర్డర్స్ వస్తున్నాయి” అని సీపీ సీవీ ఆనంద్ చెప్పారు.