భోపాల్ గ్యాస్ బాధితుల కోసం పోరాడిన అబ్దుల్ జబ్బర్ కన్నుమూత

1984 భోపాల్ గ్యాస్ విషాదంలో 20,000 మంది బాధితులకు, వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన వారికి న్యాయం కోసం పోరాడిన సామాజిక కార్యకర్త అబ్దుల్ జబ్బర్ కన్నుమూశారు. గురువారం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు.
ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన పారిశ్రామిక ప్రమాదమైన భోపాల్ గ్యాస్ ప్రమాదంలో అబ్దుల్ జబ్బర్ తన తల్లి, తండ్రి, సోదరుడిని కోల్పోయాడు. ఈ ప్రమాదంలో జబ్బర్ కూడా ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్‌తో బాధపడ్డాడు. అంతేకాకుండా ప్రమాదం కారణంగా 50 శాతం దృష్టిని కోల్పోయినప్పటికీ జబ్బర్ న్యాయం కోసం తన పోరాటం ఎప్పుడూ ఆపలేదు. గత కొన్ని నెలలుగా జబ్బర్ ట్రీట్మెంట్ పొందుతున్నాడు. ఆయన ట్రీట్మెంట్ ఖర్చులను భరిస్తామని మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. తదుపరి చికిత్స కోసం ముంబై ఆసుపత్రికి తరలించకముందే ఆయన కన్నుమశారు.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ యొక్క పురుగుమందుల ప్లాంట్ నుండి డిసెంబర్ 2-3, 1984 మధ్య రాత్రి మిథైల్ ఐసోసైనేట్ వాయువు లీక్ కావడంతో 20,000 మందికి పైగా మరణించారు. ఇప్పటికి కూడా అనేకమంది దీని కారణంగా అనారోగ్యానికి గురౌతున్నారు. భోపాల్ గ్యాస్ విషాదం జరిగిన కొద్దిసేపటికే.. అమెరికా పౌరుడైన యూనియన్ కార్బైడ్ సీఈఓ వారెన్ ఆండర్సన్ తప్పించుకున్నాడు. ఈ కేసులో విచారణ కోసం కోర్టుకు హాజరుకాలేదు. అతను 2013 లో అమెరికాలో మరణించాడు.