పెళ్లైన రాత్రే పెళ్లి కూతురు పరార్ : డబ్బు, నగలు మాయం

సమాజంలో ప్రస్తుత పరిస్ధితుల్లో మగపిల్లలకు పెళ్లి అవటం కొంచెం కష్టంగానే ఉంది. యువతుల కోరికలు కానీయండి మరే కారణాలైనా సరే…కొన్నిసందర్భాల్లో మగపెళ్లి వారే పెళ్లి ఖర్చు అంతా భరించి పెళ్లి చేసుకుని కోడల్ని ఇంటికి తెచ్చుకునే పరిస్ధితులు కొన్ని రాష్ట్రాల్లో వచ్చేస్తున్నాయి. ఈవిధంగా లక్షలు ఖర్చు పెట్టి పెళ్ళి చేసిన అత్తవారింటికి భారీ షాకిచ్చింది యూపీ లో ఓ కొత్త కోడలు. పెళ్లి జరిగిన కొన్ని గంటలు గడవక ముందే అత్తింటిలోని నగదు, బంగారం తీసుకుని రాత్రికి రాత్రే ఉడాయించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బడాన్ జిల్లాలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆజంగఢ్‌కు చెందిన ప్రవీణ్, రియా లకు డిసెంబర్ 9న వివాహం జరిగింది. టింకూ అనే మధ్యవర్తి ద్వారా ప్రవీణ్‌కు రియా పరిచయం అయింది. వీరి పెళ్ళికి అతనే మధ్యవర్తిగా వ్యవహరించాడు. రియా పేద కుటుంబానికి చెందిన అమ్మాయి అని, పెళ్లి చేసే స్థోమత లేదని చెప్పి మధ్యవర్తి టింకూ ప్రవీణ్ దగ్గర రూ.4 లక్షలు తీసుకున్నాడు. ముహూర్తాలు పెట్టుకున్న తర్వాత పెళ్లి కూతురు ఊరైన అజంగఢ్ లో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. పెళ్లి అయిన తర్వాత అంతా కలిసి వరుడు ప్రవీణ్ ఇంటికి వచ్చారు. అదే రోజు రాత్రి అంతా పెళ్లి కూతురు రియా ప్రవీణ్ కుటుంబం మొత్తానికి మత్తు మందు ఇచ్చి ఇంట్లోని నగలు, డబ్బుతో పరారయ్యింది.
మరుసటి రోజు ఉదయం ప్రవీణ్ కుటుంబ సభ్యులు నిద్రలేచి చూసేసరికి రియాతోపాటు నగదు, విలువైన ఆభరణాలు కనిపించలేదు. అలాగే మధ్య వర్తిత్వం వహించిన టింకూ కూడా కనిపించలేదు. ఖంగుతిన్న ప్రవీణ్ కుటుంబ సభ్యులు అజంగఢ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొత్త పెళ్లి కూతురు రియా రూ.70 వేల నగదు, నాలుగు లక్షల రూపాయలు విలువైన ఆభరణాలతో పారిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రియా కోసం గాలిస్తున్నారు.