తిరుపతిలో అలిపిరి వద్ద మంటల్లో కారు.. పూర్తిగా దగ్ధమైన వాహనం
అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే కారు ఆపేశాడు. కారులోని వారందరూ వెంటనే బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు.

Car Catches Fire in Tirupati: తిరుపతిలో అలిపిరి గరుడ కూడలి వద్ద గురువారం జరిగిన ప్రమాదంలో ఓ కారు మంటల్లో కాలిపోయింది. ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే కారు ఆపేశాడు. కారులోని వారందరూ వెంటనే బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రాణాపాయం తప్పడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగానే కారులో మంటలు వ్యాపించివుంటాయని భావిస్తున్నారు. సమాచారం అందుకొని సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే మంటల్లో కారు పూర్తిగా కాలిపోయింది. భక్తులు తిరుమల నుంచి తిరుపతికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.
శ్రీశైలంలో లోయలో పడిన వాహనం
శ్రీశైలం శిఖరేశ్వరం సమీపంలో గురువారం బొలోరో వాహనం అదుపుతప్పి లోయలో పడిన ఘటనలో 15 మంది స్వల్పంగా గాయపడ్డారు. లోయలో పడిన వాహనం చెట్టుకు ఢీ కొట్టి ఆగడంతో పెను ప్రమాదం తప్పింది. క్షతగాత్రులను సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని కోడుమూరు మండలం పాలకుర్తి గ్రామవాసులుగా గుర్తించారు. వీరందరూ మల్లన్న దర్శనార్థం శ్రీశైలం వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.