Couple End Life : నాగ్‌పూర్‌లో దంపతుల ఆత్మహత్య.. పెళ్లి దుస్తుల్లోనే అర్ధరాత్రి కేక్ కట్ చేసి అనంతలోకాలకు..!
Couple End Life : భార్యాభర్తలు తమ 26వ పెళ్లి వార్షికోత్సవం సందర్భంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ దంపతుల ఆత్మహత్యకు గల కారణాలేంటి?

Couple end life on wedding anniversary ( Image Source : Google )
Couple End Life : మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఓ విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యాభర్తలు తమ 26వ పెళ్లి వార్షికోత్సవం సందర్భంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరి మృతితో వారి కుటుంబంలో శోకసంద్రం నెలకొంది. ఈ దంపతుల ఆత్మహత్యకు గల కారణాలేంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ జంట తమ 26వ వివాహ వార్షికోత్సవంలో స్నేహితులు, బంధువులతో అర్ధరాత్రి దాటే వరకు సంతోషంగా గడిపారు. మరణించేవరకు సరదాగా, ఉల్లాసంగా కనిపించారు. తమ వివాహ వార్షికోత్సవం రోజున పెళ్లి దుస్తులను ధరించి మృత్యువు ఒడిలోకి జారుకున్నారు. 57 ఏళ్ల జెరిల్ డామ్సన్ ఆస్కార్ మోన్‌క్రిఫ్ మృతదేహం వంటగదిలో వేలాడుతూ కనిపించగా, అతని భార్య 46 ఏళ్ల అన్నే డ్రాయింగ్ రూమ్‌లోని మంచంపై పడి ఉంది. ఈ జంట 26 ఏళ్ల క్రితం ధరించిన అదే పెళ్లి దుస్తులను ధరించి ఆత్మహత్య చేసుకున్నారు.
26ఏళ్లుగా సంతానం లేక ఆందోళన :
నాగ్‌పూర్‌లోని జరిపట్కా పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీసు అధికారి మాట్లాడుతూ.. మరణించిన జంట జెరిల్ డాస్మన్ ఆస్కార్ మోన్‌క్రీఫ్, అన్నీ జెరిల్ మోన్‌క్రీఫ్ చాలా కాలంగా సంతానం లేక ఆందోళన చెందుతున్నారు. ఈ జంటకు 26 ఏళ్లుగా సంతానం కలగలేదు. వారిద్దరూ తమ మరణానికి ముందు సోషల్ మీడియాలో ఒక స్టేటస్‌ను కూడా అప్‌డేట్ చేశారు. ఒకదానిపై స్టాంప్ పేపర్, మరొకదానిపై అనధికారిక వీలునామాతో సహా రెండు సూసైడ్ నోట్‌లను అప్‌లోడ్ చేశారు.
ఈ ఆత్మహత్యకు ఎవరూ బాధ్యులు కాదని కూడా అందులో పేర్కొన్నారు. ముందుగా జెరిల్ భార్య ఆత్మహత్య చేసుకోగా, జెరిల్ ఆమెను గుడ్డతో కప్పి, దానిపై పువ్వులు ఉంచాడు. ఆ తర్వాత తాను కూడా కండువాతో ఉరివేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులకు పెద్దగా క్లూ లేకుండా పోయింది.
అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కట్ చేసి.. :
ఫేస్‌బుక్ వీడియోలో అన్నే, వారి బంధువుల పిల్లలను చూసుకోవాలని కుటుంబ సభ్యులను కోరారు. ఆత్మహత్యకు ముందు అందరికి శుభాకాంక్షలు తెలిపారు. రెండు సూసైడ్ నోట్‌లలో ముఖ్యంగా తమ మరణానికి ఎవరూ బాధ్యులు కారని, తమ ఆస్తులను సరిగా పంపిణీ చేయాలని కోరారు. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటల సమయంలో తమ వార్షికోత్సవ కేక్‌ను కట్ చేసి, ఉత్సాహంగా గడిపారు. దాంతో వారి మనస్సులో ఏమి ఉందో ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు.

Couple end life ( Image Source : Google )
జెరిన్ చెఫ్‌గా పనిచేసేవాడు :
కాథలిక్ స్మశానవాటికలో మోర్టిషియన్ విజయ్ అలిక్ మైఖేల్ మాట్లాడుతూ.. నేను గత ఐదేళ్లుగా శవపేటికలను తయారు చేస్తున్నాను. అయితే, నేను ఒక జంట కోసం శవపేటికను తయారు చేయడం ఇదే మొదటిసారి. ఇద్దరూ కలిసి అంత్యక్రియలు చేయాలనుకుంటున్నట్లు వారి బంధువులు తెలిపారు. అంతేకాకుండా 26 ఏళ్ల క్రితం పెళ్లికి వేసుకున్న దుస్తుల్లోనే ఇద్దరినీ అంత్యక్రియలు చేయాలి. మహమ్మారి సమయంలో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టే ముందు జెరిన్ అనేక హోటళ్లలో చెఫ్‌గా పనిచేశాడు. ఆ తర్వాత ఉద్యోగం మానేశాడు. భార్య అన్నీ గృహిణిగా ఉండగా, జెరిల్ వడ్డీకి అప్పు ఇచ్చేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
మంగళవారం ఉదయం 5.47 గంటలకు సోషల్ మీడియాలో పోస్టు అప్‌డేట్ చేశారు. ఆ పోస్టును సమీప బంధువు గుర్తించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్టు కుటుంబ వర్గాలు పేర్కొన్నాయి. ఇతర బంధువులకు కూడా సమాచారం అందించారు. వారంతా వెంటనే మోన్‌క్రిఫ్ దంపతుల నివాసానికి చేరుకున్నారు. అప్పటికే దంపతులు చనిపోయారని గుర్తించారు. ఆ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఏం చెప్పారంటే? :
ఈ కేసులో బంధువులు జెరిల్ మృతదేహాన్ని కిందకు దించి నేలపై పడుకోబెట్టారని జరీపట్క పోలీస్ స్టేషన్ అధికారి అరుణ్ శిర్షత్ తెలిపారు. భార్య మృతదేహం డ్రాయింగ్ రూంలో ఉంది. ప్రాథమికంగా చూస్తే ఇది ఆత్మహత్యగా అనిపిస్తోందని, ఇప్పటివరకు ఎలాంటి కుట్ర కోణం ఉన్నట్టుగా అనుమానాలు లేవని చెప్పారు. ప్రస్తుతం పోలీసులు ఇద్దరి మొబైల్ ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి విచారించనున్నారు.
Read Also : ఆన్లైన్ స్కామ్స్ పై విజయ్ దేవరకొండ వీడియో.. అలాంటి మెసేజ్ లు చూసి మోసపోకండి..