ఇదేందయ్యా ఇది.. టైమ్ మెషీన్‌తో వృద్ధుల వయసు తగ్గిస్తామని ఘరానా మోసం, రూ.35 కోట్లతో పరార్..
చివరికి తాను మోసపోయినట్లు గుర్తించిన ఓ కస్టమర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.

Age Reversal Scam (Photo Credit : Google)
ఇదేందయ్యా ఇది.. 60ఏళ్ల వృద్ధులను 25ఏళ్ల వారిగా మారుస్తాం అంటూ రూ.35కోట్లతో పరార్.. దంపతుల ఘరానా మోసం..
Age Reversal Scam : ఇది మోసాల కాలం. రకరకాల మోసాలు జరుగుతున్నాయి. అమాయకులే వారి టార్గెట్. మాయమాటలతో నమ్మించి ముంచేస్తున్నారు. ఇప్పటివరకు ఎన్నో తరహా మోసాల గురించి విని ఉంటారు, చూసి ఉంటారు. కానీ, ఇలాంటి చీటింగ్ గురించి బహుశా ఎప్పుడూ విని ఉండకపోవచ్చు. ఇంతకీ ఆ మోసం ఏంటంటే.. వయసు తగ్గిస్తారట. అవును, 60ఏళ్ల వయసున్న వృద్ధులను యవ్వనం ఉట్టిపడేలా 25ఏళ్ల నవ యువకులుగా మార్చేస్తామని మాయమాటలు చెప్పి అందినకాడికి దోచుకున్నారు. అలా రూ.35 కోట్లు వసూలు చేసి పరార్ అయ్యారు. ఈ ఘరానా మోసం ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో జరిగింది.
రష్మీ దూబే, రాజీద్ కుమార్ దూబే దంపతులు రివైవల్ వరల్డ్ పేరుతో ఓ థెరపీ సెంటర్ ను నెలకొల్పారు. తమ దగ్గరున్న ఇజ్రాయెల్ టైమ్ మెషీన్ తో ఆక్సిజన్ థెరపీ చేసి వృద్ధులను 25ఏళ్ల నవ యువకులుగా మారుస్తామని నమ్మించారు. ఆక్సిజన్ థెరపీ సాయంతో యవ్వనాన్ని తిరిగి తెప్పిస్తామన్నారు. ఇజ్రాయెల్ టైమ్ మెషీన్ అంటున్నారు, పైగా ఆక్సిజన్ థెరపీ అంటున్నారు.. అయితే కచ్చితంగా వారన్నట్లు వయసు తగ్గిస్తారేమోనని కొందరు వారి మాయమాటలను నమ్మేశారు.
అలా కొందరి నుంచి ఒక్కో సెషన్ కు రూ.90వేలు రాబట్టారు రష్మీ దంపతులు. మొత్తంగా రూ.35 కోట్ల వరకు వసూలు చేశారు. చివరికి తాను మోసపోయినట్లు గుర్తించిన ఓ కస్టమర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. పరారీలో ఉన్న కిలాడీ దంపతుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, రష్మీ, రాజీవ్ దంపతులు ఇప్పటికే విదేశాలకు పారిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
”రాజీవ్ కుమార్ దూబే, రష్మీ దూబే భార్యభర్తలు. కాన్పూర్ లో రివైవల్ వరల్డ్ పేరుతో థెరపీ సెంటర్ ఓపెన్ చేశారు. తాము ఇజ్రాయెల్ నుంచి ఓ మెషీన్ తెచ్చామని దాని ద్వారా వయసు తగ్గిస్తామని మాయ మాటలు చెప్పారు. ఆ టైమ్ మెషీన్ ద్వారా 60 ఏళ్ల వయసున్న వృద్ధులను 25ఏళ్ల వ్యక్తుల్లా మార్చేస్తామన్నారు. ఆక్సిజన్ థెరపీ ద్వారా వృద్ధులు తిరిగి యవ్వనం ఉట్టిపడే యువతలా మారొచ్చని నమ్మించారు. కాన్పూర్ లో అద్దె భవనంలో వారు ఈ దందా నడిపించారు. వాయు కాలుష్యం కారణంగా తొందరగా వృద్ధాప్య చాయలు వస్తున్నాయని, తాము చేసే ఆక్సిజన్ థెరపీ ద్వారా నెలల వ్యవధిలోనే వయసు తగ్గిస్తామని చెప్పారు.
అంతేకాదు దీనికోసం వారు ప్యాకేజీలు కూడా ప్రకటించారు. 10 సెషన్లకు 6వేల రూపాయలు. మూడేళ్ల రివార్డ్ సిస్టమ్ కింద రూ.90వేలు ఫీజుగా నిర్ణయించారు. దూబే దంపతుల మాయమాటలు నమ్మేసిన కొందరు వృద్ధులు.. వారు చెప్పినట్లు డబ్బు కట్టారు. అయితే, రేణు సింగ్ అనే కస్టమర్.. మోసాన్ని గ్రహించింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన దగ్గర రూ.10లక్షల 75వేలు వసూలు చేశారని వాపోయింది. నాలాంటి బాధితులు వందలాది మంది ఉన్నారని పోలీసులతో చెప్పింది. అంతా లెక్క కడితే.. సుమారు రూ.35 కోట్ల వరకు దూబే దంపతులు వసూలు చేసినట్లు తేలింది. రేణు సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న దూబే దంపతులను పట్టుకునేందుకు గాలిస్తున్నారు” అని పోలీసు ఉన్నతాధికారి ఒకరు ఈ కేసు వివరాలు వెల్లడించారు.
Also Read : తల్లిదండ్రులూ బీ కేర్‌ఫుల్..! రైలు ప్రయాణంలో పిల్లల చేతికి ఫోన్ ఇస్తున్నారా? ఎంత ప్రమాదమో చూడండి..